Aug 9 2019 @ 00:11AM

మోహన్‌బాబుగారి ప్రశంస మర్చిపోలేను

 ‘‘కొబ్బరిమట్ట చిత్రంలో నేను చెప్పిన మూడున్నర నిమిషాల డైలాగు విని, డా. మంచు మోహన్‌బాబుగారు ఫోన్‌ చేసి అభినందించడాన్ని మర్చిపోలేను’’ అని అన్నారు సంపూర్ణేశ్‌బాబు. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా ఆయన మూడు పాత్రల్లో నటించిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్‌ దర్శకుడు. సాయిరాజేశ్‌ నిర్మాత. ఈ చిత్రం శనివారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి బుధవారం సంపూర్ణేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘తెలుగు తెరమీద ఇంతకు ముందు ‘మావిడాకులు’, ‘గోరింటాకు’ వచ్చేశాయని.. పెద్ద ఆకుగా ఉంటుందని మా చిత్రానికి రచయిత స్టీవెన్‌ శంకర్‌గారు ‘కొబ్బరిమట్ట’ అని పేరు పెట్టారు. పలు కారణాల వల్ల సినిమా విడుదలలో జాప్యం జరిగింది. ‘హృదయకాలేయం’ తర్వాత ఉన్నపళాన వచ్చిన ఇమేజ్‌ని నేను బ్యాలన్స్‌ చేసుకోలేకపోయిన మాట వాస్తవమే. అయితే ‘కొబ్బరిమట్ట’ ఇక విడుదల కాదని కొందరు దగ్గరివాళ్లు అన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. నాకు హీరో ఉపేంద్రగారంటే చాలా ఇష్టం. ఆయనలాగా పలు గెటప్పులు వేసుకుని ఫిల్మ్‌నగర్‌లో తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడే సాయిరాజేశ్‌ పరిచయమయ్యి ‘హృదయ కాలేయం’ తీశారు. ఈ తాజా చిత్రం కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకం ఉంది. ఇందులో మూడున్నర నిమిషాల డైలాగుకు చాలా మంచి స్పందన వస్తోంది. పదోతరగతి పిల్లలు చదివినట్టు తెల్లారుజామునే లేచి చదివి కంఠతా పట్టి, ఒకే టేక్‌లో చెప్పిన డైలాగ్‌ అది’’ అని అన్నారు. వ్యక్తిగత వివరాలను వెల్లడిస్తూ ‘‘ నా అసలు పేరు నరసింహాచారి. ఇప్పటికీ నా కుటుంబం మిట్టపల్లిలోనే ఉంటుంది. నా పిల్లలిద్దరూ వాళ్ల స్కూల్‌లో ‘మా నాన్న పేరు నరసింహాచారి’ అనే చెబుతారు. నరసింహాచారి అనే పేరుతో పోలిస్తే సంపూర్ణేశ్‌బాబుగా నా జీవితం ఇంకాస్త మెరుగ్గా ఉంది’’ అని అన్నారు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌కు వెళ్లొచ్చిన అనుభూతి గొప్పదని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ ఆ షోను చూస్తుంటాననీ ఆయన తెలిపారు.
 
అలరించకపోతే...
‘‘నేను, సంపూ, రూపక్‌.. ఐదేళ్లపాటు ఈ సినిమాకు పనిచేశామని అనుకుంటున్నారు. అసలు మేం షూటింగ్‌ చేసింది 39 రోజులే. రిలీజ్‌ కోసం ఇబ్బంది పడ్డాం. మా కెరీర్‌ వదులుకుని మరీ ఈ సినిమాకు పనిచేశాం’’ అని ‘కొబ్బరిమట్ట’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సాయిరాజేశ్‌ చెప్పారు. ఈ విడుదల ఆలస్యం కావడానికి చాలా కారణాలున్నాయి. నా శ్రేయోభిలాషుల్లో చాలామంది ఈ సినిమా వదిలేసి వేరే సినిమాలపై దృష్టిపెట్టు అని సలహా ఇచ్చినప్పుడు ఎవరికీ చెప్పుకోలేని బాధ నన్ను వెంటాడింది. చివరికి ఊళ్లో నా స్నేహితులకు చెప్పుకున్నా. ఎక్కడో ఉన్న నిన్ను హీరోని చేసిన సాయిరాజేశ్‌ని నమ్ముకోమని చెప్పారు. మా కష్టాల్లో ప్రేక్షకులు అండగా నిలబడ్డారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించకపోతే ఇకపై సినిమాలు చేయను’’ అని సంపూర్ణేశ్‌ బాబు అన్నారు. సందీప్‌కిషన్‌, మారుతీ, మధురశ్రీఽధర్‌, షకీలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.