Jul 29 2019 @ 03:20AM

విలువల వైతాళికుడు జైపాల్‌ రెడ్డి అస్తమయం

  • న్యుమోనియా, జ్వరంతో ఆస్పత్రిలో చేరిక
  • శనివారం అర్ధరాత్రి దాటాక తుది శ్వాస
కఠినాతికఠిన ఇంగ్లిష్‌ పదాలను అలవోకగా
పలికే ఆంగ్ల భాషా ప్రవీణుడు!
 
అసెంబ్లీ అయినా.. పార్లమెంటైనా ప్రసంగంలో 
శరపరంపరగా అక్షరాలు సంధించే అద్భుత వక్త!
 వలువలూడిన రాజకీయాల్లో విలువల వైతాళికుడు!
ఐదుసార్లు లోక్‌సభ, రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పార్లమెంటుకు వన్నె తెచ్చిన
ఉత్తమ పార్లమెంటేరియన్‌!
చట్టాలను ఔపోసన పట్టిన రాజకీయ మేధావి!
ఇందిర, అంబానీలను ధిక్కరించిన ధీరుడు!
నిక్కచ్చి విధానాలను అవలంబించిన నిఖార్సైన, అసాధారణ ప్రతిభావంతుడు!
మారుమూల పల్లె నుంచి స్వయంకృషితో ఢిల్లీకి ఎదిగిన రాజకీయ దిగ్గజం!
ఏడాదిన్నర వయసులోనే పోలియో కబళించినా.. విఽధికి ఎదురీది జీవితాన్ని జయించిన వీరుడు!
  • పీవీ ఘాట్‌ సమీపంలో నేడు అంత్యక్రియలు
  • అధికారిక లాంఛనాలతో జరపాలన్న సీఎం
  • ఘాట్‌కు 3 ఎకరాలు కేటాయించిన సర్కారు
  • కార్యకర్తల కోసం 10.30కు గాంధీభవన్‌కు
  • మధ్యాహ్నం 12 గంటలకు అంతిమ యాత్ర
హైదరాబాద్‌ / హైదరాబాద్‌ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): అర్ధ శతాబ్దం పాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన రాజకీయ దిగ్గజం ఒరిగిపోయింది. వైకల్యాన్ని ఓడించి, రాజకీయ పరమపద సోపానంలో విజయ శిఖరాలను అధిరోహించిన ధీశాలి, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి (77) ఇకలేరు. కొద్ది రోజులుగా జ్వరం, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి దాటిన త ర్వాత 1.28గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉ న్నారు. కొద్ది రోజులుగా న్యుమోనియా, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న జైపాల్‌రెడ్డిని ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎం ట్రాలజీ ఇనిస్టిట్యూట్‌(ఏఐజీ)లో చేర్పించారు. ఐసీయూలో చేర్పిం చి గుండె, పల్మనాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన గుండె పనీ మందగించింది. కార్డియో రెస్పిరేటరీ సమస్యతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో, హృదయ స్పందనల పనితీరును మెరుగుపరిచి, ఆక్సిజన్‌ అందించడానికి ‘ది ఇంట్రా అరోటిక్‌ బెలూన్‌ పంప్‌(ఐఏబీపీ)’ చికిత్సను అందించారు. అయినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచారు. జైపాల్‌రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు నరసింహన్‌, హరిచందన్‌, సీఎంలు కేసీఆర్‌, జగన్‌, టీడీపీ అధినేత చందబ్రాబు, టీపీసీసీ నేతలు తదితరులు నివాళులు అర్పించారు. 
 
పీవీ ఘాట్‌ సమీపంలో నేడు అంత్యక్రియలు
జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు సోమవారం పీవీ ఘాట్‌ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎస్కే జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జైపాల్‌రెడ్డి సోదరుడి అల్లుడైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీనియర్‌ నేత జానారెడ్డి, అధికారులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. తారిక్‌ స్పోర్ట్స్‌ అకాడమీ స్థలంతో కలిపి 3 ఎకరాలు కేటాయించాలన్న జైపాల్‌ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నేతల విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించడం తో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీ జ్ఞానభూమికి తూర్పున ఉన్న ఈ స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. వర్షం పడుతున్న నేపథ్యంలో మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను హెచ్‌ఎండీఏ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ఆదేశించారు. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం ఉదయం 10.30 నుంచి జైపాల్‌రెడ్డి పార్థివదేహాన్ని గాంధీభవన్‌లో ఉంచుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తెలిపారు. ఒంటిగంటకు పీవీ ఘాట్‌లో ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
 
జైపాల్‌ సతీమణికి సోనియా లేఖ
జైపాల్‌రెడ్డి మరణం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు జైపాల్‌ సతీమణి లక్ష్మికి సోనియా ఒక లేఖ పంపారు.