Jul 23 2019 @ 03:11AM

తెలంగాణ ప్రజల గొంతుక దాశరథి

  •  కృష్ణమాచార్య జయంతిలో మంత్రి శ్రీనివాస్‌
  •  కవి విఠలాచార్యకు దాశరథి అవార్డు ప్రదానం
రవీంద్రభారతి/హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నిజాం అరాచకాలకు ఎదురొడ్డి తన సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ గొంతుక అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి దాశరథి సాహిత్యం ఆయుధంగా ఉపయోగపడిందన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్యకు దాశరథి పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 చెక్కు రూపంలో అందజేశారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రసంగిస్తూ, తెలంగాణ ఏర్పడ్డాక కొంతమంది అసత్యాలు రాస్తున్నారని అయితే మేధావులు, సాహితీవేత్తలు వాటిని తిప్పికొట్టే విధంగా వాస్తవాలను రాయాలని అన్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరంలాంటి మహా ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగిందని ‘బంగారు తెలంగాణ’ నిర్మాణంలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం సాఫల్యం కారణంగానే విఠలాచార్యలాంటి వారి వద్దకు పురస్కారాలు చేరుతున్నాయన్నారు. 80వేల పుస్తకాలతో స్వగ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.
 
ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సాహితీప్రియుడని, దాశరథి లాంటి వారి పుస్తకాలు చదివి ఉద్యమాన్ని రూపకల్పన చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన అగ్నిధార దాశరథి అని అన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ దాశరథి భావ చైతన్యాన్ని అందించిన మహోన్నతుడని కొనియాడారు. దాశరథి పురస్కారం తనకు అందజేయడం ఆనందంగా ఉందని కవి విఠలాచార్య అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బి.శివకుమార్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎ్‌స.రాములు, దాశరథి కుమారుడు లక్ష్మణ్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.