Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 19 Jul 2019 14:50:03 IST

‘మిస్టర్ కె.కె’ మూవీ రివ్యూ

మిస్టర్ కె.కె మూవీ రివ్యూ

సమర్పణ: ఐ టి.అంజయ్య
బ్యానర్స్: పారిజాత మూవీ క్రియేష‌న్స్
న‌టీన‌టులు: చియాన్ విక్ర‌మ్‌, అక్ష‌రా హాస‌న్‌, అభిహాస‌న్‌, లీనా, వికాస్‌, చెర్రీ త‌దిత‌రులు
సంగీతం: జిబ్రాన్‌
కెమెరా: శ్రీనివాస్ ఆర్‌.గుత్తా
మాట‌లు: శ‌శాంక్‌
పాటలు: రామ‌జోగ‌య్య శాస్త్రి
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
నిర్మాత‌లు:టి.న‌రేష్ కుమార్, టి. శ్రీధ‌ర్‌
ద‌ర్శ‌క‌త్వం: రాజేశ్ ఎం.సెల్వ‌
 
విశ్వ‌రూపం 2 త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లో బిజీగా మారిపోయారు. ఆ కార‌ణంగా ఆయ‌న కొన్ని స్క్రిప్ట్స్‌ను సిద్ధం చేసుకున్న‌ప్ప‌టికీ న‌టించ‌లేక‌పోయారు. అలాంటి ఆయ‌న న‌టించాల‌నుకుని న‌టించ‌లేక‌, హీరో విక్ర‌మ్‌ను హీరోగా న‌టింప చేస్తూ క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన చిత్రం `కడ‌రం కొండాన్‌`. తెలుగులో ఈ చిత్రాన్ని `మిస్టర్ కె.కె` పేరుతో విడుద‌ల చేశారు టి.అంజ‌య్య‌. చియాన్ విక్ర‌మ్‌కు కూడా సాలిడ్ హిట్ త‌గిలి చాలా కాల‌మే అయ్యింది. మ‌రి `మిస్ట‌ర్ కె.కె`.. చియాన్ విక్ర‌మ్‌కు హీరోగా, క‌మ‌ల్‌హాస‌న్‌కు నిర్మాతగా ఏ మేర పేరు తెస్తుందో తెలియాలంటే ముందుగా క‌థ‌లోకి వెళ‌దాం.
 
క‌థ‌:
వాసు(అభిహాస‌న్‌), అధిరా(అక్ష‌రాహాస‌న్‌)వేర్వేరు మ‌తాల‌కు చెందినవారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాసు డాక్ట‌ర్ కావ‌డంతో మ‌లేషియాలో ఓ పెద్ద హాస్పిట‌ల్‌లో జాబ్ సంపాదించుకుంటాడు. అధిరా గ‌ర్భ‌వ‌తి అవుతుంది. భార్య‌ను వాసు జాగ్ర‌త్త‌గా కాప‌డుకుంటూ ఉంటాడు. అదే స‌మ‌యంలో కె.కె(చియాన్‌)ను ఇద్ద‌రు వ్య‌క్తులు వెంటాడుతూ వ‌చ్చి చంప‌డానికి చూస్తారు. అయితే కె.కెకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. వాసు ప‌నిచేసే హాస్పిటల్‌లోనే కెకె పోలీసులు జాయిన్ చేస్తారు. నైట్ డ్యూటీలో ఉన్న వాసుకి ఎవ‌రో కె.కెను చంపాల‌ని చూడ‌టం చూసి, ప్ర‌మాదం నుండి బ్ర‌తికిస్తాడు. అయితే అదే స‌మ‌యంలో వాసు భార్య‌ను ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. కె.కెను ఎవ‌రికీ తెలియ‌కుండా విడిపించుకుని వ‌స్తే.. త‌న భార్య‌ను వ‌దిలేస్తామ‌ని చెబుతారు. భార్య కోసం వాసు, కె.కెను హాస్పిట‌ల్ నుండి త‌ప్పిస్తాడు. కానీ క‌థ అక్క‌డే ట్విస్ట్ తిరుగుతుంది. అస‌లు కె.కె ఎవ‌రు? అత‌న్నిచంపాల‌నుకుంది ఎవ‌రు? చివ‌ర‌కు వాసు, అత‌ని భార్య‌ను క‌లిశాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
స‌మీక్ష‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ఎవ‌రికీ అర్థం కానీ డ‌బుల్ ఏజెంట్ కె.కె పాత్ర‌లో చియాన్ విక్ర‌మ్ న‌టించాడు. ఆయ‌న న‌ట‌న గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. విక్ర‌మ్ పాత్ర పూర్తి గ్రే షేడ్స్‌తోనే సాగుతుంది. ఇక అక్ష‌రా హాస‌న్ న‌ట‌న ప‌రంగా పాత్ర‌కు న్యాయం చేసింది కానీ.. కొన్ని సీన్స్‌లో అయితే ఆమె చాలా లావుగా, ఏజ్‌డ్ ప‌ర్స‌న్‌గా క‌న‌ప‌డుతుంది. అభిహాస‌న్ .. భార్య‌ను కాపాడుకోవాల‌నుకునే డాక్ట‌ర్‌గా మంచి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు. ఇక లీనా, వికాస్‌, చెర్రీ త‌దిత‌రులు వారి వారి పాత్రల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక సాంకేతికంగా చూస్తే.. ద‌ర్శ‌కుడు రాజేశ్ ఎం.సెల్వ ఈ సినిమాతో ఏం చెప్పాల‌నుకున్నాడ‌నే దానిపై క్లారిటీ లేకుండా ఓ క‌థ‌ను రాసుకున్నాడ‌నిపించింది. సాంకేతికంగా ఇంగ్లీష్ యాక్ష‌న్ సినిమాలా ఉండాల‌నుకుని సినిమా చేయాల‌నుకోవ‌డం త‌ప్పు కాదు.. కానీ క‌థ లేకుండా సినిమా చేయాల‌నుకోవ‌డం త‌ప్పిద‌మే అవుతుంది. రాజేశ్ సెల్వ ఆ విష‌యంలో త‌ప్పు చేశాడు. ఫ‌స్టాఫ్‌లో అయితే అస‌లేం క‌థే క‌న‌ప‌డ‌దు. ఓ డాక్ట‌ర్‌, ఓ క్రిమిన‌ల్‌ను హాస్పిట‌ల్‌ను త‌ప్పించే సీన్‌తోనే స‌రిపోతుంది. ఓ సీన్‌ను చూపించ‌డానికి సగ భాగం సినిమా ర‌న్ చేశాడా అనిపించింది. ఇక అస‌లు యాక్ష‌న్ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. హీరో భార్య కోసం విక్ర‌మ్‌ను వెంబ‌డించ‌డం.. క్రిమిన‌ల్ అయిన విక్ర‌మ్ అనుకోకుండా ఓ ప్లాన్‌లో ఇరుక్కుని.. దాని నుండి భ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నంలో త‌న చుట్టూ జరిగిన త‌ప్పుల్ని, అందుకు కార‌ణ‌మైన వాళ్ల‌ను ఎలా ప‌ట్టిస్తాడ‌నే క‌థ‌ను లాక్కుంటూ వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు. జిబ్రాన్ సంగీతం ఎఫెక్టివ్‌గా లేదు. నేప‌థ్య సంగీతం బావుంది. శ్రీనివాస్ ఆర్‌.గుత్తా విజువ‌ల్స్ మాత్రం సూప‌ర్బ్‌. సినిమా హాలీవుడ్ యాక్ష‌న్ మూవీ స్టైల్లో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. శ‌శాంక్ మాటలు రాయ‌డానికి బ‌ల‌మైన స‌న్నివేశాలు లేవు. ఇద్ద‌రు పోలీసు అధికారుల మ‌ధ్య ఇగో క్లాషెష్ కార‌ణంగా న‌డిచే సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ పాటి క‌థ‌ను మ‌లేషియా బ్యాక్‌డ్రాప్ ఎందుకో అర్థం కాలేదు. అలాగే క్లైమాక్స్‌ను పోలీస్ కంట్రోల్ రూమ్‌లో గంద‌ర‌గోళంగా చిత్రీక‌రించారు. అస‌లు అక్క‌డ చేసేంత రీజ‌న్ ఎంటా? అని ప్రేక్ష‌కుడికి అనిపిస్తుంది. అలాగే అస‌లు అంత పెద్ద గొడ‌వ జ‌రుగుతున్నా..ఎవ‌రు ప‌ట్టించుకోరు. ఇలాంటి సీన్స్ రెండు, మూడు ప్రేక్ష‌కుడికి అర్థం కావు.

బోట‌మ్ లైన్‌: మిస్ట‌ర్ కె.కె.. .. అర్థం లేని ప్ర‌య‌త్నం
రేటింగ్‌: 1.75/5

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.