
బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
నటీనటులు: రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు
ఫైట్స్: రియల్ సతీష్
సాహిత్యం: భాస్కరభట్ల
ఎడిటర్: జునైద్ సిద్ధికీ
ఆర్ట్: జానీ షేక్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్.. హీరోలను మాస్ కోణంలో ఆవిష్కరించే అతి కొద్ది మంది దర్శకుల్లో ఈయనొకరు. అయితే `టెంపర్` తర్వాత ఈయనకు సరైన సక్సెస్ దక్కలేదు. ఈ క్రమంలో పూరి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో మాస్ సై ఫై జోనర్లో కథను రాసుకున్నాడు పూరి.. ఇప్పటి వరకు క్లాస్ హీరోగా మెప్పించిన రామ్‌తో ఈ సినిమా చేయాలని పూరి నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. దీంతో మాస్‌గా రామ్ లుక్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో రామ్ లుక్‌ను సరికొత్త కోణంలో చూపించాడు పూరి. అలాగే సినిమాలో ఎంత మాస్ ఉంటుందోఅర్థమయ్యేలాగానే పూరి టీజర్, ట్రైలర్‌ను కట్ చేశాడు. మరి పూర్తి స్థాయి పూరి హీరోగా రామ్ ప్రేక్షకులను ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ
శంకర్ (రామ్) పక్కా తెలంగాణ బస్తీ కుర్రాడు. అతని మాట తీరు, వేషభాషలూ అన్నీ అలాగే ఉంటాయి. అతనికి తన కాకా (మధుసూదన్ రావు) ఎంత చెబితే అంత. ఏది చెబితే అంత. కాకా చెప్పాడని మాజీ మంత్రి కాశీ విశ్వనాథ్ (పునీత్ ఇస్సార్) ను చంపేస్తాడు. అతను ఇచ్చిన డబ్బుతో తను ప్రేమించిన చాందిని (నభా నటేష్)ను తీసుకుని గోవాకు వెళ్తాడు. అక్కడ వారిద్దరూ ఉండగా కొందరు సీబీఐ ఆఫీసర్లు అటాక్ చేస్తారు. చాందిని కన్నుమూస్తుంది. శంకర్ తప్పించుకుని హైదరాబాద్ వచ్చేస్తాడు. చాందినిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు కాకాకు కాశీ విశ్వనాథ్‌ను చంపమని ఎవరు పురమాయించారు? అనేది తెలుసుకోవాలని శంకర్ తాపత్రయం. ఆ క్రమంలో ఉండగానే అతనికి జమాల్ ఆచూకి తెలుస్తుంది. అతన్ని వెతుక్కుంటూ శంకర్‌తో పాటు సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) కూడా వస్తాడు. కాల్పుల్లో అరుణ్ కన్నుమూస్తాడు. శంకర్ గాయపడతాడు. అరుణ్ గర్ల్ ఫ్రెండ్ సారా (నిధి అగర్వాల్) న్యూరో సైంటిస్ట్. తాను చేసిన పరిశోధనను ఉపయోగించి అరుణ్ జ్ఞాపకాలను శంకర్ బుర్రలోకి చిప్ రూపంలో ఎక్కిస్తుంది. అప్పటిదాకా ఎలుకల మీద మాత్రమే ప్రయోగించిన ఆ పరిశోధన శంకర్ మీద పనిచేస్తుందా? అరుణ్ జ్ఞాపకాలన్నీ శంకర్ మదిలోకి వచ్చి, అతను ఏం చేశాడు? సారా చేసిన ప్రయోగం ఫలించిందా? ఇంతకీ మాజీ మంత్రి కాశీ విశ్వనాథ్‌ను చంపమని ఎవరు పురమాయించారు? అసలు సీఎం ధనుంజయ్కీ, అతని మామ రామ్మూర్తి (ఆశిష్ విద్యార్థి)కి ఈ హత్యతో ఉన్న సంబంధం ఏంటి? ఆఖరికి కాశీ విశ్వనాథ్ భార్య (తులసి) శంకర్‌కు ఏం పురమాయిస్తుంది? వంటివన్నీ సెకండాఫ్‌లో తెలుస్తాయి.
ప్లస్ పాయింట్
- రామ్ గెటప్, యాక్టింగ్, శ్లాంగ్, సిక్స్ ప్యాక్
- డ్యాన్సులు
- ఫైట్స్
మైనస్ పాయింట్లు
- ఎమోషన్ లేకపోవడం
- స్క్రీన్ ప్లే ఆసక్తిని కలిగించకపోవడం
- పాయింట్ పరంగా కొత్తదిగా అనిపించినప్పటికీ, సాదాసీదాగా ఉన్న కథ
విశ్లేషణ
పూరి జగన్నాథ్ హీరోలు అనగానే మాస్ లోకి మాస్‌గా ఉంటారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి ప్రస్తావించినప్పటి నుంచీ శంకర్ పాత్ర అలాగే ఉంటుందని తెలుస్తూనే ఉంది. దానికి తోడు రామ్ ఇప్పటిదాకా ఎప్పుడూ మాట్లాడని తెలంగాణ యాసలో మాట్లాడటం. `ఇస్మార్ట్ శంకర్` లో రామ్ లుక్ బావుంది. ఇంతకు ముందు ఆయన వేయని గెటప్ ఇది. మాట్లాడని భాష ఇది. కొన్ని కొన్ని సామెతలు తెలంగాణ యాసలో రామ్ చెబుతుంటే థియేటర్లలో విజిళ్లు వినిపించాయి. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇప్పటిదాకా మిల్కీ బోయ్లాగా కనిపించిన రామ్ ఈ సినిమా కోసం కొంచెం టాన్ అయి కనిపించారు. ఫ్లోర్ స్టెప్స్, పాటలతో మెప్పించారు.
చాందిని పాత్రలో నభా నటేష్, సారా పాత్రలో నిధి అందాల ఆరబోతకు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. హుషారైన పాత్రలో నభా తనవంతు బాగానే చేసింది. కానీ ఒకవైపు ప్రియుడి పోయినప్పుడు, మరోవైపు అప్పటిదాకా కాపురం చేసిన శంకర్ మీద పోలీసులు దాడిచేసినప్పుడు... నిధిలో ఎమోషన్స్ పండలేదు. ఒక రకమైన బ్లాంక్ ఫేస్‌తో, శోకంగా కనిపించింది. క్రిమినల్ దగ్గర పెరిగిన శంకర్‌కు తాను హత్య చేయడానికి వెళ్తున్నది మాజీ మంత్రి అని తెలియకపోవడం కూడా అంత తేలిగ్గా మింగుడు పడే విషయం కాదు. మనిషి మెదడులో చిప్ పెట్టి, అతని జ్ఞాపకాలను మరో వ్యక్తి బుర్రలోకి పంపడం ఈ చిత్రంలో చూపించినంత తేలికైన విషయమా?... డాటా ట్రాన్స్ ఫర్ ఎంత లోడ్ అయిందో చూపించగలుగుతామా? అవన్నీ ఫిక్షనే అనుకున్నప్పటికీ, ట్రాన్స్ ఫర్ అయిన డేటా శంకర్ మదిలో మళ్లీ మెదిలేటప్పుడు తన ప్రేయసి నీళ్లల్లో తడుస్తూ అందాలను ఆరబోస్తున్న సన్నివేశాలే గుర్తుకొస్తాయా? ప్రాణాలకు తెగించి సేకరించిన విషయం తాలూకు సమాచారం గుర్తుకు రాదా? పైగా ఒక స్టేట్‌కి సీఎం కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఎక్కడో వారణాసిలో కొడుక్కి నామకరణం చేస్తుంటే, అక్కడికి లే మేన్ శంకర్ ఎలా చేరుకుంటాడు? అప్పుడు శంకర్ చెప్పే డైలాగుల్లో ఉన్నట్టు... అదంతా లైవ్ టెలికాస్ట్ అయితే అక్కడికి పోలీసులు ఎందుకు చేరుకోరు? సీబీఐ ఆఫీసర్లు అందరూ సీబీఐ అని రాసి ఉన్న జాకెట్లు ఎందుకు వేసుకుని తిరుగుతుంటారు?... ఇలాంటివెన్నో ప్రశ్నలు. అయినా రామ్ మాట్లాడిన యాస, పూరి సినిమా అనే మార్కు, జనాల్లోకి వెళ్లిన పాటల సాయంతో బీ, సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రమే... కాసులు కురుస్తాయి.
బాటమ్ లైన్: శంకర్... మస్తు మాసు!
రేటింగ్: 2.25/5