Jun 28 2019 @ 03:32AM

విజయనిర్మల ఇకలేరు

  • దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌
  • చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం
  • నేడు చిలుకూరులో అంత్యక్రియలు
రాయదుర్గం/హైదరాబాద్‌, సిటీ, అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సీనియర్‌ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల (73) ఇకలేరు. ఏడునెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌ గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసి కృష్ణ, విజయ నిర్మల అభిమానులు పెద్ద సంఖ్యల్లో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గురువారం ఉదయం 11:15 గంటలకు విజయ నిర్మల పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటికి తరలించారు. ఆమె మృతితో భర్త కృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. ఏడాది క్రితం విజయ నిర్మల ఇంట్లో మెట్లపై నుంచి జారి పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి ఆమె తరచుగా కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఏడునెలలుగా ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇంటికే పరిమితమయ్యారు.
 
బుధవారం రాత్రి 11:45 గంటలకు విజయ నిర్మల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమె కుమారుడు, సినీ నటుడు నరేశ్‌ తల్లిని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్‌కేర్‌కు తరలించి వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె మృతిచెందినట్లు అర్ధరాత్రి 1:30 గంటలకు వైద్యులు ప్రకటించారు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత విజయనిర్మల మృతి కళారంగానికి తీరని లోటు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దర్శకురాలిగా, నిర్మాతగా ఆమె సినీ రంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో విజయనిర్మల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు నరేశ్‌ తెలిపారు.