Feb 5 2015 @ 23:36PM

భగవంతుడిది తల్లిప్రేమ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 5: భగవంతునిది తల్లిప్రేమ అని... తల్లి పిల్లలకు సేవ చేసి... విద్యాబుద్ధులు నేర్పి... వారి ఉన్నతిని చూసి ఎలా ఆనందిస్తుం దో... అదే తరహాలో భగవంతుడు కూడా భక్తుల ఉన్నతిని చూసి ఆనందిస్తాడని శంషాబాద్‌ ఉదయ వేదాంత ఆచార్య పీఠం, జీయర్‌ ఇంటి గ్రేటెడ్‌ వైదిక్‌ అకాడమీ ఆచార్యులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి చెప్పారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఉన్న వ్యాసాశ్రమంలో శ్రీమలయాళస్వామి తపస్సిద్ధి శతవత్సర, విమలానందగిరి, విద్యానందగిరి శతజయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రణవ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి రామానుజ జీయర్‌స్వామి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 4వ అధ్యాయంలో చెప్పినట్లు మనం ఎందుకు జన్మించాం? ఏం చేస్తున్నాం? అని మానవుడు తెలుసుకోగలిగితే జ్ఞానం లభిస్తుందని చెప్పారు. మానవుడు ఎంతో మేధోసంపత్తి కలిగిన వాడని... కంప్యూటర్‌ కూడా చెప్పలేని లెక్కలు మనిషి ఏనాడో చెప్పాడని గుర్తు చేశారు. దండి నిర్మలానందగిరిస్వామి మాట్లాడుతూ సద్గురువుల సన్నిధిలోనే జ్ఞానం సిద్ధిస్తుందని చెప్పారు. దృష్టిని, వాక్కును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎపుడూ సానుకూల దృష్టి కలిగివుండాలని చెప్పారు. వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి,మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధువులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.