Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 15 Jun 2019 02:30:42 IST

ఆఖరి గాంధేయవాది

ఆఖరి గాంధేయవాది

 భాగవతుల వెంకట పరమేశ్వర రావు (1933–2019) అమెరికాలో అణుశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొంది సొంత గడ్డ ఉత్తరాంధ్రలో గ్రామీణాభ్యుదయానికి అంకితమైన ఉదాత్తుడు భాగవతుల వెంకట పరమేశ్వరరావు. ఆయన స్థాపించిన భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ (బిసిటి) ఆధ్వర్యంలో విజయం సాధించిన ఎన్నో సామాజిక ప్రయోగాలు, దేశవ్యాప్తంగా ఎందుకు అనుకరింపబడలేదు అని ఎందరో అడిగేవారు. దానికి నా సమాధానం: బారత దేశంలో 560కి పైగా జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాకి ఆ జిల్లా ఒక పరమేశ్వర రావుని వెతికి పట్టుకోవాలి.
 
భాగవతుల వెంకట పరమేశ్వర రావు (1933–-2019) ఈ నెల 9 న పరమపదించారు. తెలుగునాట బహుశా, ఆయన నిజంగా ఆఖరి గాంధేయ వాది అని చెప్పవచ్చు. గత ఐదు దశాబ్దాలుగా ఎన్నో సాంఘిక విప్లవాలకి పునాది వేసి, ఎన్నో ప్రణాళికలు ప్రారంభించి, తాను స్థాపించిన స్వచ్ఛంద సంస్థ బి.సి.టి. (Bhaagavatula Chari table Trust)ద్వారా, ఎందరో ప్రముఖులు అసాధ్యం అన్నవి కూడా ఆయన ఆచరణలో పెట్టారు. ఆయనతో నాకు ఉన్న పరిచయాన్ని స్మరించుకోవడానికే ఈ వ్యాసం.
 
పరమేశ్వరరావు 1967లో పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయం నుంచి అణుశాస్త్రంలో డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. పట్టా వచ్చిన మరునాడే తన సొంత వూరు, విశాఖ జిల్లాలో దిమిలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నత పాఠశాల కట్టిస్తానని సహాధ్యాయులకి చెప్పారు. వాళ్ళందరూ, ‘ఇతనికేమన్నా పిచ్చా, వెర్రా,’ అని దిగ్భ్రమచెందారు. అదే ఆయన గ్రామ పునరుద్ధరణ ప్రణాళికలకి నాందీవాక్యం.
 
స్కూలుకెళ్ళేపిల్లలు హైస్కూలు విద్యకోసం దిమిలినుంచి ఐదు మైళ్ళు యలమంచిలికి నడిచి వెళ్ళాల్సిన అగత్యం పరమేశ్వరరావుకి ససేమిరా నచ్చలేదు. దిమిలిలో ఉన్నత పాఠశాల వుంటే, చుట్టుపక్కల పది వూళ్ళ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, ఉన్నత విద్యాధికులు కావటం సులువు. అయితే ఈ ప్రణాళికకి ఆ ఊరి ప్రజల మద్దతు అవసరం. ప్రతి ప్రజావసర ప్రణాళికలోనూ, ప్రజలు పాల్గొనాలని ఆయన ధృఢంగా నమ్మారు. ఆ విషయమై పనికట్టుకొని పల్లె ప్రజల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ‘I act as a catalyst. They can solve their problems’ అని ఆయన అంటూ వుండేవారు. దిమిలి ప్రజల సహకారంతో ఏడాదిలో స్కూలు భవనం కట్టారు. ఇక ప్రభుత్వం బడికి పర్మిషన్‌ ఇవ్వటమే తరువాయి. దానికోసం ఆయన ముప్పతిప్పలూ పడ్డారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని’ సామెత. రకరకాల అడ్డంకులు – జిల్లాపరిషత్తు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ అధికారులు పెట్టిన అడ్డంకులన్నీ ఓపిగ్గా ఎదుర్కొంటూ, చివరకి అప్పటి గవర్నరు ఖందూభాయి దేశాయి వ్యక్తిగత జోక్యం ధర్మమా అని బడి తెరవటానికి తాఖీదు తెచ్చుకున్నారు. పరమేశ్వరరావు ఈ తతంగం చెప్పినప్పుడు, నేను వేళాకోళంగా ‘మీ అమెరికా అణుశాస్త్రం డాక్టరేటు యిక్కడేమయినా ఉపయోగపడిందా?’ అని కవ్విస్తే, ‘లేదు. నేను అమెరికా నుంచి తిరిగివచ్చేసాను ఈ బడికోసమే; అని ఇంగ్లీషులో చెప్పగానే, హైదరాబాదు అధినేతలు కిమ్మనకుండా విన్నారు’ అని చురకదెబ్బ తిప్పి కొట్టారు.
 
మర్రిపాలెంలో ఒకేఒక్క మంచినీటి నుయ్యి. అది ఎండిపోయింది. మంచినీళ్ళ బావి కోసం అక్కడి మహిళలు పరమేశ్వరరావు దగ్గిరకి వచ్చారు. ‘మీకు కావలసింది మంచినీటి బావి. కలెక్టరు దగ్గిరకి మీరే పోయి చెప్పండి’ అన్నారు. మరి మహాజరు రాయాలి కదా.. అదెలా? అన్నారు. ఆ పనికి సాయం చేస్తా. ‘మాకు బావి కావాలి, మంచినీళ్ళకోసం అని రాయండి’ అని చెప్పారు. అయితే, కలెక్టరు చెప్పిన రోజుకి యలమంచిలి రాలేదు. వెంటనే 40-–50 మంది మహిళలు సమితి అధ్యక్షుడి ఆఫీసులోకి దూసుకుపోయారు. మూడు రోజుల్లో మర్రిపాలెం లో బోరింగు నుయ్యి తెప్పించారు. ఈ కథ ఆయన చెప్పేటప్పుడు వినటం నిజంగా ఒక education.
 
పరమేశ్వరరావు ఒకసారి యలమంచిలి దగ్గిర పంచధార్ల ప్రాంతంలో ప్రభుత్వం అశ్రద్ధగా బీడు పట్టించేసిన భూమి చూసారు. జిల్లా కలెక్టరుని బ్రతిమాలి యాభై ఎకరాల భూమి, BCT కి ‘కౌలు’కి తీసుకున్నారు. పంచధార్ల పల్లెవారి సహకారంతో, ఆ నేల సాగుకి తెచ్చారు. మూడు సంవత్సరాల తరువాత, ఏ కలెక్టరు అయితే ‘అది బీడు; పురుగు, పుట్ర; రాళ్ళు, రప్పలు; అక్కడేమీపండదు’ అని నవ్వి ఈసడించారో, ఆ నవ్విన నాపచేనే పండిందని ఒప్పుకోక తప్పలేదు. నూరు రకాల పళ్ళు, కాయలు, కూరలు, వగైరా పండించవచ్చని ప్రయోగాత్మకంగా రుజువు చేసి, చుట్టుపక్కల రైతులకి ఎంతో ఆసక్తి కలిగించారు. పరమేశ్వర రావు మాటల్లో చెప్పాలంటే, ‘There is no waste-land; there is wasted-land in India’.
 
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్‌ మెక్‌నమారాకు, భారత ప్రధాని ఇందిరాగాంధీ ఢిల్లీలో వీడ్కోలు విందు ఇచ్చారు. ఆ విందుకు పరమేశ్వర రావును పిలవమని ఎవరో సలహా ఇచ్చారు. భారత ప్రభుత్వాధికారుల్లో ఎవరికీ పరమేశ్వరరావు ఎవరో తెలియదు; ఎక్కడ వుంటాడో అంతకన్నా తెలియదు. అదృష్టవశాత్తు అప్పుడు పి.వి. నరసింహారావు కల్పించుకొని, హుటాహుటిన విశాఖపట్నం నుంచి రావుని ఢిల్లీకి విమానంలో రప్పించే ఏర్పాటు చేసారు. మెక్‌నమారా బృందంతో రావు రెండు గంటలు గడిపారు. ఆ సందర్భంగా ఒకరు పరమేశ్వరావును అడిగారట! ‘ప్రపంచబ్యాంకు వారి గ్రామోద్ధరణ పథకాలేవీ మీ దేశంలో ఎందుకు జయప్రదంగా అమలు జరగటల్లేదూ?’ అని. పరమేశ్వర రావు నిష్కర్షగా చెప్పారు ‘ప్రపంచ బ్యాంకు వారు తగని గుర్రాలపై పందెం కాస్తున్నారు. గ్రామాల్లో మహిళలు సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలకి మీ డబ్బు ఇవ్వండి. అప్పుడు మీ డబ్బు వృధా కాదు’ అని.
 
హరిపురంలో BCT ప్రారంభించి ఎంతో అబివృద్ధిలోకి తెచ్చిన బడి. మామూలు చదువుతో పాటు, ఈ బడిలో వృత్తివిద్యలు నేర్పుతారు. వడ్రంగం, కమ్మరం, అద్దకం, బైకు రిపేరు, మొక్కల పెంపకం వగైరా ఎన్నో వృత్తి విద్యలకి నిలయం. ప్రతి విద్యార్థి ఏదో ఒక వృత్తివిద్య నేర్చుకుంటాడు. చాలామంది బాలికలు కూరగాయల తోటలో పని చేస్తారు. చాలా మంది ఉపాధ్యాయులుకూడా ఆ ఆవరణలలోనే ఉండటం ముదావహం. ప్రతి ఏడూ BCT కి వెళ్ళినప్పుడల్లా ఆ బడి పిల్లలతో కాలం గడపటం మాకు ఎంతో ఆనందంగా ఉండేది. ‘మీరు అమెరికానుంచి అయ్యగారిలా( పరమేశ్వర రావుగారిలా) వచ్చేసి మాకు పాఠాలు చెప్పండి’ అనేవాళ్ళు.
 
పొద్దస్తమానం పొట్టకూటికోసం పనుల ఒత్తిడిలో పల్లె ప్రజలు ప్రభుత్వ వయోజన విద్యాకేంద్రాలకి వెళ్ళగలిగేవాళ్ళు కారు. అందుచేత ఆ వయోజనవిద్యా కేంద్రాలు ఏ విధమైన ప్రగతీ సాధించలేకపోయాయి. ఈ విషయం పరమేశ్వరరావు చాలాకాలంగా ప్రభుత్వాధికారులకి చెబుతూనే వున్నారు. అయితే అక్షరాస్యత తప్పనిసరి అని అందరికీ తెలుసు. వారిని అక్షరాస్యులుగా చేయాలంటే, దానిని ప్రజా ఉద్యమంగా మార్చాలి. అదెలా సాధ్యం? స్వచ్ఛందసేవకై కంకణం కట్టుకొన్న పాతికమంది చదువుకున్న యువకులు, గ్రామీణుల ఇండ్లకు పోయి వారిని అక్షరాస్యులుగా చేయటానికి -- అంటే చదవటం, రాయటం నేర్పటానికి సంసిద్ధులయ్యారు. ఈ ప్రయోగం, పరమేశ్వరరావు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 1988 అక్టోబర్‌ లో బెంగుళూరు జిల్లాలోని శివగంగలో మొదలయ్యింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ ప్రయోగం చేసారు. ప్రజా ఉద్యమానికి బీజాలు పడ్డాయి. 1989లో 1100 మంది స్వచ్ఛందసేవకులు, బెంగుళూరులో కలిసి అక్షరాస్యత సాధనను దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేయాలని తీర్మానించారు. అందుకు కారణభూతుడు పరమేశ్వర రావు. ఆయన్నే కన్వీనరుగా ఎన్నుకున్నారు. అది ‘Literacy As a Movement of People’ (LAMP) అయింది. పరమేశ్వర రావు 1989 అక్టోబరులో అమెరికా వచ్చారు. ఈ ‘LAMP’ ఉద్యమంలో అమెరికాలో ఉన్న భారతీయులు కూడా భాగస్వాములై ప్రోత్సహించాలని ఆయన అభిలాష. అందుకోసం ‘India Literacy Project, ILP’ షికాగోలో మొదలయ్యింది. నేను 1998 వరకూ ప్రధాన సంచాలకుడిగా పనిచేసాను. అప్పటిలో మా ముఖ్య ఉద్దేశం BCT ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ ప్రాథమిక పాఠశాలకి రెండు సంవత్సరాలకి సరిపోయే వనరులు కల్పించటం. ఆపని కొంతవరకూ సాధించామనే చెప్పుకోవాలి. ఇప్పుడు శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉమ వెంకటేష్ ILP నడుపుతున్నారు. భారతదేశంలో కొన్ని పల్లెల్లో ప్రాథమిక పాఠశాలకి వనరులు చేకూరుస్తున్నారు.
 
అమెరికాలోని స్వచ్ఛందసేవా సంఘాల ఆహ్వానం మీద పరమేశ్వరరావు అమెరికా మూడు సార్లు వచ్చారు. ఆయన ప్రేరణమీద, మిచిగన్‌లోని Ganges Town లో వెలిసిన వివేకానంద ప్రార్థన మందిరంలో ఒక వందమంది అమెరికా నలుమూలలనుంచి వచ్చిన వలంటీర్ల సభ చేసాం. అప్పుడు, ‘Rejuvenate India Movement, RIM’ వెలిసింది. ఆ సంస్థ ఆ ఊరు దాటి ముందుకు పోలేదు. దేశవ్యాప్తంగా, భారీఎత్తున ఏది చేద్దామని తలపెట్టినా దానిని ఆదుకొని విజయవంతంగా నడిపించటం చాలాకష్టమని ఆయన ఎప్పుడూ అనేవారు. పరమేశ్వరరావు నిజాయితీ ఉన్న మనిషి. తాను మొదలుపెట్టిన ప్రణాళికలు కొన్ని బెడిసి కొట్టాయని ఆయనే చెప్పేవారు. అందుకు కారణాలు కూడా చెప్పేవారు. అది, మంచి నాయకుడికుండవలసిన ముఖ్య లక్షణం.
 
‘నమ్మలేని నిజాలు, నా గ్రామానుభవాలు’ అన్న మకుటంతో ఆయన 2009 లో ఒక పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకంలో కవిత్వం లేదు; ఉత్ప్రేక్షలు లేవు. ఆయన గుండెల్లోనుంచి వచ్చిన మాటలు మాత్రమే ఉన్నాయి. ఆ పుస్తకం చదువుతుంటే, ఆయనతో మాట్లాడుతున్నట్టుంటుంది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
 
ఆయనతో నేను ఎన్నోసార్లు మాట్లాడే అవకాశం, వాదించే అవకాశం కలిగింది. అది నా అదృష్టంగా భావిస్తాను. సబబైన సమాధానం రాబట్టడానికి సరైన ప్రశ్నలు అడగటం అనేది పరమేశ్వరరావు మాకు నేర్పిన పాఠం.
ఆఖరిగా ఒక్క మాట. BCT ఆధ్వర్యంలో విజయం సాధించిన ఎన్నో ప్రయోగాలు, దేశవ్యాప్తంగా ఎందుకు అనుకరింపబడలేదు అని ఎందరో అడిగేవారు. దానికి నా సమాధానం: బారత దేశంలో 560కి పైగా జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాకి ఆ జిల్లా ఒక పరమేశ్వర రావుని వెతికి పట్టుకోవాలి. ‘యద్యదాచరతి శ్రేష్ట్హ స్తత్త దేవతరో జనఃసయత్ ప్రమాణం కురుతే లోకోస్తదనువర్తతే’ అని గీతా వాక్యం. దీని భావం: (గౌరవించతగిన) నాయకుడు ఏ పనులైతే చేస్తాడో, సాధారణ ప్రజలు వాటినే (ఆయననే) అనుకరిస్తారు. తన మంచి పనులద్వారా ఏ రకమైన ప్రమాణాలు నిర్దేశిస్తాడో, ఆ ప్రమాణాలనే ప్రజలందరూ పాటిస్తారు. ఈ గీతా వాక్యం నిజంగా నిజమైతే ఎంత బాగుంటుందో అని నాకనిపిస్తుంది!
వేలూరి వేంకటేశ్వర రావు

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.