Jun 11 2019 @ 00:28AM

బహుముఖ ప్రజ్ఞాశాలి

  •  గిరీశ్‌ రఘునాథ్‌ కర్నాడ్‌ (1938–2019)
 జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా నిర్మించిన ‘సెవెన్ సమురాయ్‌’ ప్రేరణతో కర్నాడ్ ‘ఒందానందు కాలదల్లి’ రూపొందించారు. 1981లో శశికపూర్ నిర్మాతగా కర్నాడ్ ‘ఉత్సవ్’ తీసారు. భారతీయ సాహిత్యంలో పేరెన్నికగన్న ‘మృచ్ఛకటికం’ ఆధారంగా ఉత్సవ్ రూపొందింది. 4వ శతాబ్దం నాటి సామాజిక స్థితి, భాష, నిర్మాణాలు మొత్తంగా అత్యంత కళాత్మకంగా నిర్మించబడిన సినిమా ఇది. కళాశృంగార, హాస్య రసాలని పండించి మంచి సినిమాగా రూపొందింది.
 
భారతీయ నవ్య సినిమా, ఆధునిక నాటక రంగంలో ఒక శకం ముగిసింది. ఆ రెండు రంగాల్లో శిఖరాయమానమయిన కృషి చేసి చివరకంటా తన ముద్రను చాటిన గిరీశ్‌ కర్నాడ్ సెలవంటూ వెళ్లిపోయాడు. యయాతి (1961), తుగ్లక్ (1964), హయవదన (1972), నాగమండల లాంటి గొప్ప నాటకాల రచయితగానూ, ఒందానందు కాలదల్లి, ఉత్సవ్, కాడు లాంటి సినిమాలతో భారతీయ సినిమా రంగంలోనూ కర్నాడ్ తన విశిష్టతను చాటారు. ఆధునికత, ప్రగతిశీలతల్ని మేళవించుకున్న ఆయన సృజన బహు విస్తారమయింది. సృజన రంగంతో పాటు రచయితలు, కళాకారులపై దాడుల్ని, హింసని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గౌరి లంకేష్, కల్బుర్గి హత్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతే కాదు లంకేష్ ప్రథమ వర్ధంతి రోజున ‘‘#MeTooUrbanNaxal.’’ అని ప్లకార్డ్ ప్రదర్శించిన ప్రజాస్వామ్యవాది గిరీష్.
 
1938 మే 19న జన్మించిన ఆయన జూన్ 10న తన 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తనువు చాలించారు. భారతీయ కళల పట్ల, జానపద రీతుల పట్ల, సినిమా పట్ల మొత్తంగా సృజన పట్ల గొప్ప అభినివేశం వున్న కర్నాడ్ కన్నడ నాటక రంగంలోనే కాదు, అటు సినిమా ఇటు నటన రంగాల్లో కూడా తన విలక్షణతను చాటుకున్నారు. కళాకారుడి గానే కాదు వ్యక్తిగా కూడా ఎంతో ప్రేరణాత్మకమయిన జీవితం ఆయనది. ఇటీవల కర్నాడ్ శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎప్పుడూ పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ను వెంట తీసుకెళ్లే వాడు. వాటి వల్ల ఇబ్బంది అనిపించడం లేదా అని అడిగితే చూపులో తేడా వచ్చినప్పుడు కళ్ళద్దాలు వాడడం లేదా ఇదీ అంతే అన్నాడు గిరీశ్‌ కర్నాడ్. ‘నివారించుకోలేని దాన్ని నిభాయించుకోవాల్సిందే’ అన్న మాటని అనుసరిస్తూ గొప్ప వ్యక్తిత్వ ప్రేరణగా నిలిచిన గిరీశ్‌ కర్నాడ్ బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప కళాకారుడు. పలు రంగాల్లో సృజనాత్మక కృషి చేసిన భారతీయ ప్రముఖుల్లో ఒకరు. నాటక కర్త గా, సినీ దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రతిభ ఎన్నదగినది. రచయితగా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని, పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత నాటక అకాడెమి అవార్డులతో పాటు అనేక ఇతర అవార్డులు అందుకున్న కర్నాడ్ నాటక రచయితగా ఎంత ప్రముఖుడో సినీ దర్శకుడిగానూ అంతే ప్రముఖుడు. బహుళ సంస్కృతినీ, వాక్ స్వాతంత్ర్యాన్ని నమ్మే ఆయన అనేక దశబ్దాలుగా తన పుట్టిన నేల నుంచి మాతృభాషలో రాసిన రచనలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిని అందుకున్నారు. భారతీయ చరిత్ర, పౌరాణికాల నేపథ్యంలో ఆయన రాసిన రచనలు స్థానియమై విశ్వవిఖ్యాతిని పొందాయి. కర్నాడ్ 23 ఏళ్ల వయస్సులోనే ‘యయాతి’ ప్రచురితమయింది. మహాభారతంలోని కథ ఆధారంగా ఆయన రాసిన ఆ నాటకం విశేష ప్రాచుర్యం పొందింది. అప్పటినుండి కర్నాడ్ నాటక రచనలో కొత్త దృక్పథాన్ని తీసుకున్నాడు. ప్రాచీన పౌరాణిక రచనలనుండి ఆధునిక జీవితపు సంక్షోభాల్నీ ఆవిష్కరించడం మొదలు పెట్టారు. అదే క్రమంలో ‘తుగ్లక్’ నాటకాన్ని ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ చరిత్రను ఆధారం చేసుకొని నెహ్రూ పాలన పైన రాసాడు. ‘హయవదన’ కథాసరిత్సాగరం నుంచి తీసుకున్న కథాంశంతో జానపద యక్షగాన తరహాలో రాసాడు కర్నాడ్. ఇక ‘నాగమండల’ జానపద కథ ఆధారంగా రచించాడు.
 
ఈ రచనలను సుప్రసిద్ధ నాటక ప్రయోక్తలు ఇబ్రహీం అల్కాజీ, విజయ మెహతా లాంటి భారతీయులతో పాటు విదేశీ దర్శకులు కూడా ప్రదర్శించారు. అట్లా సాహిత్య రంగంలో కర్నాడ్ సృజన విలక్షణతను సంతరించుకొని నిలిచింది. ఇంకా ‘అన్జుమల్లిగ’, ‘హిత్తెన హుండ’ తదితర నాటకాలు రాసారు కర్నాడ్. ఇటీవల అయన రాసిన ‘బాయిల్డ్ బీన్స్ ఆఫ్ టోస్ట్’ స్వచ్ఛమయిన వర్తమాన బెంగుళూరు నగర నాటకం. 80 వ దశకంలో టీవీ వచ్చిన తర్వాత భారతీయ మధ్యతరగతి ప్రజలు సాయంకాలాలు బయటకు రావడమే మర్చిపోయారు. ఇప్పుడు బెంగళూరు కూడా అంతే అంటారు. నగర జీవిత సంక్లిష్టతని అర్థం చేసుకోవడం అంత సులభం కాదంటారు. ఇంకా ఆయన ఇటీవల ఫ్లవర్స్, బ్రోకెన్ ఇమేజెస్ నాటకాలు కూడా రాసారు. 1966 లో మద్రాస్‌లో వున్నప్పుడు కర్నాడ్ మద్రాస్ ప్లేయర్స్ అనే గ్రూపును నడిపేవారు. ఆ గ్రూపు ప్రధానంగా నాటకాలు వేసేది. అందులో ఒకరే పఠాభి రాంరెడ్డి. ఆయన ‘సంస్కార’ సినిమా నిర్మించాలని తలపెట్టి కర్నాడ్‌ను నటించమని కోరారు. అట్లా కర్నాడ్ సినీ జీవితం నటనతో మొదలయింది. సంస్కారతో కన్నడ సినీ రంగంలో నవ్య సినిమా మొదలయింది. తర్వాత భైరప్ప రాసిన ‘వంశవృక్ష’ ను సినిమా తీయాలనుకున్న జీవీ అయ్యర్, దర్శకులుగా కర్నాడ్, కారంత్‌లను ఎంపిక చేసుకున్నారు. తర్వాత ఇరవై ఏళ్ల యువకుడు శ్రీ కృష్ణ రాసిన ‘కాడు’ కథను గిరీశ్‌ కర్నాడ్ సినిమాగా రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొనివున్న ఫ్యూడల్ వ్యవస్థను ‘కాడు’ ఒక బాలుడి కోణంలో ఆవిష్కరించింది.
 
అనంతరం జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా నిర్మించిన ‘సెవెన్ సమురాయ్‌’ ప్రేరణతో కర్నాడ్ ‘ఒందానందు కాలదల్లి’ రూపొందించారు. 1981లో శశికపూర్ నిర్మాతగా కర్నాడ్ ‘ఉత్సవ్’ తీసారు. భారతీయ సాహిత్యంలో పేరెన్నికగన్న ‘మృచ్ఛకటికం’ ఆధారంగా ఉత్సవ్ రూపొందింది. 4వ శతాబ్దం నాటి సామాజిక స్థితి, భాష, నిర్మాణాలు మొత్తంగా అత్యంత కళాత్మకంగా నిర్మించబడిన సినిమా ఇది. కళాశృంగార, హాస్య రసాలని పండించి మంచి సినిమాగా రూపొందింది. తర్వాత చెలువి, కానూరు హేగ్గదితి, గోధూళి, ఓహ్ ఘర్‌ తో పాటు ది లాంప్ ఇన్ ది నిచె, బెంద్రే లాంటి డాక్యుమెంటరీ సినిమాలు తీసారు. నటుడిగా నిశాంత్, మంథన్, స్వామి, పుకార్, ఇక్బాల్, ఆనందభైరవి, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. లాంటి సినిమాలతో పాటు అనేక ప్రధాన స్రవంతి సినిమాల్లో నటించారు. ఇటీవలే టైగర్ జిందా హై లో కూడా ప్రధాన పాత్ర పోషించారు.
 
కర్నాడ్ పూర్తి పేరు గిరీశ్‌ రఘునాథ్ కర్నాడ్. ఆయన 19 మే 1938 లో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో వున్న రావు సాహెబ్ కుటుంబంలో జన్మించారు. బోంబేలో పుట్టిన ఆయన తర్వాత కర్ణాటక చేరుకున్నారు. ధార్వాడ్‌లో డిగ్రీ అంతరం ఆక్స్ఫర్డ్లో పీజీ చేసారు. అనంతరం చెన్నైలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేసారు. తర్వాత పూర్తి స్థాయి రచయితగా మారిపోయారు. పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌కి, లండన్‌లోని నెహ్రూ సెంటర్కి, సంగీత నాటక అకాడమీకి ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించాడు.
 
చివరిదాకా రచయితగా క్రియాశీలంగా ఉన్న గిరీశ్‌ కర్నాడ్ సినిమా దర్శకత్వ బాధ్యతలకు కొంత కాలం దూరంగా వున్నారు. గొప్ప సృజన కారుడిగా జీవితాన్ని గడిపిన గిరీశ్‌ కర్నాడ్ జీవితం, కళాసృష్టి భారతీయ సినీ కళా రంగాలకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
వారాల ఆనంద్