
విశాఖపట్నం/రాంబిల్లి, జూన్ 9: దశాబ్దాల క్రితమే మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం పరితపించి ‘మహిళా సంఘాల’కు బీజం వేసిన మహనీయుడు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ (బీసీటీ) వ్యవస్థాపకులు డాక్టర్ బి.వి.పరమేశ్వరరావు(86) ఆదివారం తెల్లవారుజామున విశాఖలో కన్నుమూశారు. ఆయన కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరమేశ్వరరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ ద్వారానే గ్రామస్వరాజ్యం సాధ్యమని భావించిన ఆయన నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఆర్థికమంత్రి పీవీ నరసింహారావు తోడ్పాటుతో అప్పట్లోనే మహి ళా సంఘాలకు బీజం వేశారు. పరమేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన విశాఖ జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో 1933 జనవరి 17న భాగవతుల సోమన్న, సీతారావమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం విశాఖలో పూర్తి చేశారు. ఏయూలో ఎమ్మెస్సీ, అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీలో న్యూక్లియర్ సైన్సె్‌సలో పీహెచ్డీ చేశారు. గ్రామీణ ప్రాంతం అంటే ఆయనకు ఎంతో మక్కువ. ఉన్నత విద్యను పూర్తిచేసిన తర్వాత తిరిగి స్వగ్రామం దిమిలి వచ్చారు.
ఉన్నత పాఠశాల నిర్మాణానికి గ్రామస్థులతో కలిసి నడుం బిగించారు. పాఠశాలకు అవసరమైన భూమిని తన తండ్రిపేరుతో విరాళంగా ఇచ్చారు. గ్రామీణులకు, వ్యవసాయ రంగంలో రైతులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో 1976లో భాగవతుల చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశా రు. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వయోజనవిద్య కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జిల్లాలోని 27 మండలాల్లో నాన్ఫార్మల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ, యువతకు ఉపాధి శిక్షణ, రైతుల కోసం కృషివిజ్ఞాన కేంద్రం ద్వారా వ్యవసాయ మండలి ఏర్పాటు చేశారు. తన జీవితానుభవాలతో ‘నమ్మలేని నిజాలు, నా గ్రామానుభవాలు’ పేరుతో పుస్తకాన్ని రచించారు.
సీఎం సంతాపం
డాక్టర్ భాగవతుల వెంకట పరమేశ్వరరావు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియడారు. న్యూక్లియర్ సైంటి్‌స్టగా ఉన్నా అమెరికా నుంచి తిరిగొచ్చి విశాఖ రూరల్ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు.