Jun 3 2019 @ 03:43AM

త్యాగమే ముఖ్య ‘సాధన’ కావాలి

మ్రింగెడు వాడు విభుడని
మ్రింగెడిది గరళమనియును మేలని ప్రజకున్‌
మ్రింగమనె సర్వమంగళ
మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో
దేవతలూ, రాక్షసులు సముద్రమథనం చేస్తున్నారు. అందులోంచి హాలాహలం ఉద్భవించింది. అందరూ భయపడి దూరం వెళ్లిపోయారు. శివుడు మాత్రం ఆ హాలాహలాన్ని తాగేందుకు ఉద్యుక్తుడయ్యాడు. ఆ విషయాన్ని పార్వతీదేవికి చెప్పగా.. అందుకు అంగీకరించింది ఆ జగజ్జనని. లోకుల మేలు కాంక్షించిన ఆ త్యాగభావం వల్లనే ఆమెకు ‘జగన్మాతృత్వం’ లభించింది. ఇలాంటి త్యాగతత్వం మన సమాజానికి అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు రావడం, మనుషుల మధ్య సఖ్యత, ప్రేమ లోపించడానికి ప్రధాన కారణం.. త్యాగ బుద్ధి లేకపోవడమే. ఇద్దరు మనుషుల మధ్య సర్దుబాటు జరగాలంటే త్యాగం, నిస్వార్ధమే ప్రధాన భూమికలు. వాటి వల్లనే వారిమధ్య ప్రేమబంధం దృఢమవుతుంది. ఒకరికోసం ఒకరు చేసే త్యాగంలోని ఆనందం అపరిమితం. ఆ ఆనంద స్వరూపుడే భగవంతుడు ఇదే ఒకసాధన. కానీ.. త్యాగబుద్ధి జనంలో లోపించడం వల్లనే లోకానికి ఈ దుస్థితి కలిగి మానవీయ విలువలు మంటగలుస్తున్నాయి. అరణ్యంలోని రుషులు, సాధుసత్పురుషుల క్షేమం కోసం, మునీశ్వరుల ఆశ్రమ రక్షణకు, యజ్ఞయాగాదులకు రాక్షసుల బారి నుంచి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు రామలక్ష్మణులు చిన్నవయసులోనే అడవిబాట పట్టారు. లోకకంటకులను సంహరించేందుకు తన వెన్నెముక ఇచ్చేందుకు ప్రాణత్యాగం చేశాడు దధీచి మహర్షి.
 
పావురాన్ని రక్షించేందుకు తన శరీరాన్ని కోసి ఇచ్చాడు శిబిచక్రవర్తి. ఇవన్నీ మనకు కథల్లా కన్పించినా.. అంతర్గతంగా మనల్ని సంస్కరించేందుకు ఉపయోగపడే అమూల్యరత్నాలు. జీవితంలో సర్దుబాటు, సహనం, దాతృత్వం, ప్రేమ, సద్బుద్ధి కలగాలంటే దాని వెనుక ‘త్యాగసాధన’ ఉండాలి. ఇతరుల సొమ్ము కావాలనుకోవడం, మోసం చేయడం, తాను మాత్రమే సుఖంగా ఉండాలనుకోవడం ఇవన్నీ త్యాగబుద్ధి లేనిచోట పుట్టే అవలక్షణాలు. సూర్యుడు ఎలాంటి పక్షపాతం లేకుండా తన దగ్గరున్నది దాచుకోకుండా వెలుగులను ప్రసరింపజేస్తాడు. పంచభూతాలు కూడా అంతే. అందువల్లనే అవన్నీ పూజనీయమయ్యాయి. ఇలా భగవంతుని తత్వం అంతా స్వార్ధం వదిలిపెట్టి త్యాగాన్ని అవలంబించాలని చెబుతుంది. మనుషులే ఎవరికి వారు గీతలు గీసుకొని త్యాగాన్ని గాలికి వదులుతున్నారు. అలాకాకుండా త్యాగజీవనమే సుఖజీవనం అని తెలుసుకున్ననాడు అంతా ఆనందమే.
- డా. పి. భాస్కరయోగి