
అవును.. అది.. 1988 మద్రాస్ పామ్గ్రోహోటల్..
ఓ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాను. ఒక జర్నలిస్ట్ మిత్రుడు వెంట వచ్చారు సూర్యనారాయణగారు. పరిచయాలయ్యాయి. ఆయనకి నా మాటలు నచ్చాయి. నాకు ఆయన విద్య వినయం చాలా బాగా నచ్చాయి.
ఆయనడిగారు... ఏం సినిమా సార్.
వేగుచుక్క - పగటి చుక్క అని చెప్పా.
డైలాగ్స్ రాస్తున్నాను....
కథేంటి సార్ అన్నారు..
అదే లేదు.. అన్నాను.
ఆశ్చర్యంగా అదేంటి సార్ అన్నారు.
సినిమా అన్నా...
నా దగ్గర ఒక కథ ఉంది సార్... అన్నారు.
ఒక కథ కాదు ఒకే కథ కావాలి.
అదీ విడిపోవడం - కలుసుకోవడం మీద. లాస్ట్ ఫౌండ్ టైప్...
వెంటనే సూర్యనారాయణ గారు అలాంటిదే నా దగ్గరుంది సార్ అన్నారు. వెంటనే ఆ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ పి. సత్యారెడ్డి రావడం ఈయన చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిరిపోయాయి. టైటిల్ కూడా నాదే వేస్తానన్నారు సార్ అని ఆనందంగా అన్నారు. అది మీ అదృష్టం. డబ్బులిస్తే ఇంకా అదృష్టం అన్నాను.
ఆయనకు ఇంకా ఇంకా అదృష్టం ఉన్నటుంది. డబ్బులు కూడా ఇచ్చారు. అదే ఆయన మొదట కథా రచయితగా పేరుపడ్డ చిత్రం ‘వేగు చుక్క - పగటి చుక్క’. నేను డైలాగ్స్. అప్పుడుమొదలైన మా స్నేహం అతి తొందరలోనే అనుబంధంగా మారిపోయింది. నేను అనేవాణ్ణి ఎంఎస్ అంటే మహా సిం పుల్ అని అర్థం. ఫస్ట్ టైమ్ నవ్వినట్టే నవ్వేవారు. ఆయన నవ్వు ఎందుకో నాకు చాలాఇష్టం. ఆ నవ్వు కోసమే ఆయన్ని కలిసినపుడల్లా నవ్వించి, ఆ నవ్వుని ఎంజాయ్ చేసేవాణ్ణి. నిజానికి ఎంఎస్కి కవికి, నిత్యం అలసిపోయే కళాకారుడికి కనీసంగా ఉండే సరదాలే తప్ప, పెద్ద పెద్ద దురలవాట్లు ఏమీ లేవు. అంటే ఈర్ష్య, అసూయ, కుళ్ళు, ఫిట్టింగ్స్ లాంటివి. ఎస్... స్వచ్ఛమైన నవ్వులాంటిదే ఆయన మనసు కూడా. దేవతలలో ఇంద్రుడు, రాక్షసుల్లో ప్రహ్లాదుడు, హాస్యంలో ఎంఎస్ ఉత్తములు. ఎంఎస్ది పసిపిల్లాడి నవ్వు.... అందుకే పసిపిల్లలకు ఆయన కామెడీ అంటే ప్రాణం. ఆ కామెడీకి ఏడ్చే వాళ్ళని కూడా పకపక నవ్వించగల పవర్ ఉంది. ఆ నవ్వే ఇప్పుడు, ఎప్పుడూ నవ్వు మాత్రమే ఉండే ఆ లోకానికి వెళ్ళిపోయింది. అయినా ఏం నష్టం లేదు. ఏ ఛానల్ ఆన్ చేసినా మా ఎంఎస్ సీరియస్గా నవ్విస్తూనే ఉంటాడు. ఆ నవ్వులోనే మాలాంటి వాళ్ళకి కన్నీళ్లు... అవే మా గుండె మంటలార్పే చన్నీళ్ళు... అవును... ఎంఎస్ మరణం కామెడీ మాతకు కడుపు కోతే..
తోటపల్లి మధు