Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 11 May 2019 00:26:39 IST

ఓ..బాట సారీ..

ఓ..బాట సారీ..

  • వలస పక్షులకు కష్టకాలం మానవుల స్వార్థానికి బలి
  • ఏటా కొల్లేరుకి లక్షల్లో వలస
  • వేట, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అంతరించిపోతున్న పక్షులు
నిడమర్రు :
ఈ సృష్టిలో పక్షులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాణాల్లో దైవ స్వరూపంగా భావించే పక్షలు మానవుని స్వార్థానికి బలైపోతున్నాయి. పక్షులు సహజ సిద్ధంగా ఏర్పడే ఆహారం.. ఆవాసం..సంతానోత్పత్తి కోసం ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించి సురక్షిత ప్రాంతంలో కొంత కాలం పాటు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వలస పక్షులను పరిరక్షించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తున్నది. జిల్లాలోని కొల్లేరు ఒకప్పుడు వలస పక్షుల నిలయం.. ఇప్పుడు కొల్లేరులో పక్షులు లేవు..వేట, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధిక గాడతతో కూడిన క్రిమి సంహార మందుల వాడకం వల్ల పక్షుల సంతతి అంతరించి పోతున్నది. నేడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం..ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...
 
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
వలస పక్షల సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం మేనెల రెండవ శనివారం, అక్టోబర్‌ నెల రెండవ శనివారాలను ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. 2010 నుంచి వలస పక్షుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పక్షులను సంరక్షించుకుందాం’ అనేది 2019 ప్రపంచ వలస పక్షుల దినోత్సవ ముఖ్య నినాదం..
 
పక్షులు ఎందుకు వలస వెళతాయంటే (బాక్స్‌లో)
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు తమ సంతానోత్పత్తి కోసం, శీతాకాలంలో తమ ప్రాణ రక్షణ కోసం వలసలకు సిద్ధపడుతుంటాయి. వేలాది కిలోమీటర్లు ఆకాశ మార్గంలో ప్రయాణించి తమ సంతానోత్పత్తికి అనువైన సురక్షిత ప్రాంతాలను అన్వేషించి అక్కడ కొన్ని నెలలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ధృవ ప్రాంతాల నుంచి శీతాకాలంలో పక్షులు తీవ్ర చలి గాలుల నుంచి రక్షణ కోసం అనువైన ప్రాంతాలకు వలసలు కడతాయి. పక్షులు ప్రతీ సంవ త్సరం ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేక ప్రాంతానికి వలసలు కడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వలస పక్షులు ప్రత్యేక దారుల గుండా సూర్యగమనం, చంద్రగమనం ఆధారంగా తమ వలస ప్రాంతాలకు దారుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర ధృవం నుంచి ధక్షిణ ధృవానికి సైబీరియన్‌ ప్రాంతం నుంచి పక్షుల వలసలు సాగుతుంటాయి.
 
పక్షుల వలస కేంద్రాలు
పక్షులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి అంటార్కిటికా ప్రాంతానికి వలసలు సాగిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు తొమ్మిది ప్రాముఖ్యత గల వలస పక్షుల దారులను గుర్తించారు. ఉత్తర దిక్కు నుంచి చ లికాలంలో దక్షిణ దిక్కున గల ఉష్ణ మండల ప్రాంతానికి వచ్చి గుడ్లు పొదిగి పిల్లలతో తిరిగి తమ ప్రాంతానికి సురక్షితంగా వెళ్తాయి. హిమాలయాలు, ఆండిస్‌ పర్వత ప్రాంతాల్లో కూడా వలస పక్షలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో వలస పక్షుల కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌ వలస పక్షులకు నిలయం. పర్యావరణహితంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతంలో వలస పక్షుల కేంద్రాలు కోకోల్లలుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురంలో ఫెలికాన్‌, గుడాబాతు పక్షులు రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతం నుంచి వలస వస్తుంటాయి. కృష్ణా గోదావరి జిల్లాల మధ్య ఉండే కొల్లేటి ప్రాంతంలో ఫెలికాన్‌, నైటికేల్‌, టిల్ట్‌ పక్షులు ఆస్ర్టేలియా, ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చి కొన్ని నెలల పాటు సేదతీరుతుంటాయి. పులికాట్‌ తీరంలో ఫ్లెమింగో పక్షుల కేంద్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని నేలపాడులో ఫ్లెమింగో, హేలాన్‌ పక్షులు వలస వచ్చి సేదతీరుతుంటాయి
 
కొల్లేరు వలస పక్షుల స్వర్గ ధామం
కొల్లేరు ప్రాంతం వలస పక్షులకు స్వర్గ ధామంగా నిలుస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు 72 కిలోమీటర్ల వైశాల్యంతో సహజ సరస్సుగా ఏర్పాడటంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కొల్లేటి తీరానికి అక్టోబర్‌ నెలలో వచ్చి ఐదు నెలల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చి నెలలో పిల్లలను తీసుకుని తమ సొంత ప్రాంతానికి పోతుంటాయి. ఆసియా, ఆస్ర్టేలియా ప్రాంతాల నుంచి వచ్చే ఫెలికాన్‌, గుడాబాతు, నత్తకొట్టు, చింత ఉప్పు, చిట్టిబెల్ల గువ్వా పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఫెలికాన్‌తో పాటు టిల్ట్‌, వైట్‌ టైల్‌, భార్గని, రిటెల్‌ గ్రీబ్‌, ఫ్లోవర్‌ మొదలైన పక్షులు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి కొల్లేరు చేరు కుంటాయి. 2018 పక్షుల లెక్కల ప్రకారం కొల్లేటి తీరంలో 3 నుంచి 5ల క్షల వరకు 108 రకాల పక్షుల ఆవాస ప్రాంతంగా ఉందని లెక్కల్లో తేలింది.
 
ప్రమాదం అంచున పక్షులు
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఒక మిలియన్‌ పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. మానవుడు ప్రతీ సంవత్సరం 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి ఉపయోగించుకుని భూమిపై, నీటి వనరుల్లో వదిలేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు మంచినీటి వనరులను సముద్రాల్లో విపరీతంగా కలవడం వల్ల పక్షులకు సహజసిద్ధ ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ను స్వీక రిస్తున్నాయి. ఆస్ర్టేలియా, అమెరికా తీరాల్లో వలస పక్షులు ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని వంద లాదిగా మృత్యువాతకు గురవుతున్నాయి. పక్షి పరిశోధకులు మృత్యువాత పడిన పక్షులను కోసి చూస్తే వాటి పొట్ట నిండ ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వ్యవసాయ క్షేత్రాల్లో అధిక గాడతతో కూడిన క్రిమి సంహారక మందులు పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు శీతాకాల ప్రాంతంలో విషపు ఎరలు పెట్టి వందలాది పక్షులను అంతం చేసున్నారు
 
పక్షుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి
డాక్టర్‌ ఎం.రామకృష్ణ, పక్షి ప్రేమికుడు, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌, భీమవరం
కొల్లేటి ప్రాంతంలో సుమారు 108 రకాల పక్షులు విహరించటం చూసి ఆశ్చర్యపోయా. ఖాళీ సమయాల్లో తెల్లవారు జామున నాలుగు గంటలకే పక్షుల కిలకిల రావాలను చూడాలనే కోరికతో మిత్రులతో కలిసి కొల్లేరును సందర్శించేవాడిని. కొల్లేరు పక్షుల అందాలు తనివి తీరా చూడతగ్గవి. వివిధ రకాల పక్షులు చేసే శబ్దాలు, వాటి అందాలు అత్యద్భుతం. మానవ స్వార్థానికి పక్షులు బలవడం బాఽధాకరమైన విషయం పక్షుల సంరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలి. కొల్లేరును ప్రపంచ ప్రసిద్ధ పక్షుల కేంద్రంగా తీర్చిదిద్దాలి.
 
కొల్లేరుకి పూర్వ వైభవం తీసుకురావాలి
డాక్టర్‌ ఈపూరి సత్యనారాయణ, ప్రకృతి ప్రేమికుడు
ప్రపంచ ప్రసిద్ధ కొల్లేరు ప్రాంతం పక్షుల ఆవాస ప్రాంతం. మా చిన్న నాటి నుంచి కొల్లేరు తీరంలో ప్రయాణిస్తుంటే వలస పక్షులను చూస్తూ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కొల్లేటికి పూర్వ వైభవం తీసుకురావాలి. కొల్లేటి ప్రాంతంలో పక్షుల వేటపై నిషేధం కఠిన తరం చేయాలి. పక్షుల సంరక్షణ కోసం ప్రభుత్వం సరంక్షణ చర్యలు చేపట్టాలి.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.