May 1 2019 @ 01:52AM

మేధావులను వెంటనే విడుదల చేయాలి

  • విరసం నేత కళ్యాణరావు
  • ముగిసిన రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల ధర్నా
గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 30: ప్రజాగొంతులు వినిపించే తెలుగు విప్లవ రచయితలు సాయిబాబా, వరవరరావు, రోనా విల్సన్‌, సుధాభరద్వాజ్‌ వంటి వారిని నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత కళ్యాణరావు డిమాండ్‌ చేశారు. వరవరరావు, ప్రొఫెసర్‌ సాయిబాబా, ఇతర నేతల్ని విడుదల చేయాలని కోరుతూ రచయితలు, మేధావులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మూడు రోజులుగా విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న నిరసన దీక్షలు మంగళవారం ముగిశాయి.
 
దీక్ష చేస్తున్న వారికి సంఘీభావంగా విరసం నేత కళ్యాణరావు మంగళవారం దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య గొంతులు వినిపించే మేధావుల్ని, పౌరహక్కుల నేతల్ని, సామాజిక కార్యకర్తల్ని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. విచారణ లేకుండా దీర్ఘకాలంగా వారిని నిర్బంధంలో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన మాట్లాడేవారిని నిర్బంధించడం ప్రజాస్వామ్యవాదులు చేయాల్సిన పనికాదని, ఇవి నియంతలు చేసే పనులన్నారు. వరవరరావు, సాయిబాబా, మరికొంతమంది హక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
 
మూడవ రోజు దీక్షలో విరసం కార్యవర్గ సభ్యుడు అరసవల్లి కృష్ణ, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కర్నాటి రామమోహనరావు, కుల నిర్మూలనా పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌, పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. వెంకటేశ్వరరావు, జనతాదళ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు కృష్ణారావు, సీఎల్‌సీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేసులు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పోలారి, కేఎన్‌పీఎస్‌ నాయకులు టి. శ్రీరాములు, విరసం నేత సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, సంగటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.