Aug 27 2014 @ 21:41PM

తెలుగు సినిమా నన్ను మర్చిపోయింది!

‘ఎన్‌ తంగచ్చి’ అంటూ ఆప్యాయంగా పలుకరించే ఎంజీఆర్‌ జ్ఞాపకాలను మదిలో దాచుకున్న తమిళ తంగచ్చి ఆమె. పి. సుశీలతో ‘క్లాసికల్‌ జీనియస్‌’గా కీర్తించబడిన గాత్రం ఆమెది. ఎన్‌టిఆర్‌ స్థాపించిన ఎన్‌ఎటీ బ్యానర్‌లో ప్రతి చిత్రానికి ఆరంభ గీతం ఆలపించిన మధురస్వరం ఆమెది. సుమధుర గానంతో కోకిలలాంటి ‘కోమల’మైన స్వరంతో శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించిన ఎ. పి. కోమల నేడు 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నవ్య పలకరించింది.


‘‘నా పూర్తి పేరు ఆర్కాడు పార్ధసారథి కోమల. ఆర్కాడు అనేది మా ముత్తాతలు పుట్టిన ఊరు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు వేలూరు జిల్లాలో ఉంది. అమ్మ లక్ష్మమ్మ, నాన్న ఎ. పార్ధసారథి. 1935 ఆగస్టు 28న అప్పటి తిరువళ్లిక్కేణి (ప్రస్తుతం ట్రిప్లికేన్‌)లో జన్మించాను. అప్పట్లో ఆర్కాడులోని ఆస్తులు, పొలాలు అమ్మేసి మా ముత్తాతలు మద్రాసు నగరానికి వచ్చేశారని నాన్న చెప్పేవారు. అమ్మానాన్నలకి సంగీతంపై ఆరాధన ఉండడంతో నాకూ మక్కువ ఏర్పడింది. అది గమనించి ఏడేళ్ల వయసులో నన్ను రాజమండ్రికి గురుకుల వాసం పంపించారు. అక్కడ నాదస్వర విద్వాన్‌ గాడవల్లి పైడిస్వామి దగ్గర శాసీ్త్రయ సంగీతం నేర్చుకున్నాను. ఎస్‌.జానకి కూడా అప్పుడక్కడే ఉన్నారు. తరువాత ప్రముఖ వీణా విద్వాంసులు ఎస్‌.నరసింహులు దగ్గర వీణ నేర్చుకున్నాను.
దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ప్రశంసలతో...
తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాసీ్త్రయ సంగీత పోటీలో దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నాను. కార్యక్రమానికి వచ్చిన దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ నన్ను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు. అప్పట్లో ఆలిండియా రేడియోలో ‘గానలహరి’ పేరుతో సంగీత శిక్షణ ఇచ్చేవారు. అక్కడ సంగీతం నేర్చుకుంటున్నప్పుడే పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావు, టి.జి.కమలాదేవి, రావు బాలసరస్వతీ దేవి వంటి గొప్పగొప్ప సంగీత కళాకారులతో పరిచయం ఏర్పడింది. రేడియోలో సంగీత దర ్శకులుగా పనిచేసిన వి.మల్లిక్‌ గారి వద్ద లలిత సంగీతం నేర్చుకున్నాను. ఆ రోజుల్లో వింజమూరి సిస్టర్స్‌ (సీత, అనసూయ) అంటే చాలా పేరు. వారితో కలిసి పాటలు పాడాను. దేవులపల్లి కృష్ణశాసి్త్ర రాసిన ‘ఆకులో ఆకునై’, గురజాడ అప్పారావుగారి ‘దేశమును ప్రేమించుమన్నా’ పాటలు పాడడం బాగా గుర్తు.
రెండో ప్రపంచ యుద్ధం - రేడియో ఉద్యోగం
రేడియోలో కార్యక్రమం ప్రారంభం కావడానికి పది నిమిషాల ముందు పాట రాసేవారు యండమూరి సత్యనారాయణ గారు. ఆ పాటని అప్పటికప్పుడు నేర్చుకుని పాడేదాన్ని. దాంతో నన్ను ఆయన బాగా ఇష్టపడేవారు. నా ప్రతిభను గుర్తించి 1944లో రేడియోలో ఆర్టిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. 50 రూపాయలు జీతం. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండడంతో ‘వార్‌ అలవెన్స్‌’ కింద మరో 14 రూపాయలు ఇచ్చారు. అది నా మొదటి సంపాదన.
తొలి సినిమా పాట...
రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో తొలిసారిగా సినిమా పాట పాడాను. ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే పాటకి అందిన పారితోషకం 250 రూపాయలు. తెలుగులో పి.భానుమతి పాడిన ‘గృహప్రవేశం’ సింహళ భాష అనువాద సినిమాకి సింహళంలో పాటలు పాడాను. ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్‌ సినిమాల్లోకి రాకమునుపు గ్రామ్‌ఫోను కంపెనీలో పనిచేసేవారు. ఆయన రూపొందించిన యుగళగీతాల ప్రైవేటు రికార్డులు నేనే పాడాను.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో సుమారు అయిదు వేల పైచిలుకు పాటలు పాడాను. బాల్యంలోనే సినిమా పాటలు పాడే అవకాశం రావడం వల్ల చిన్నపిల్లలకు పాడిన పాటలే ఎక్కువ. ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో స్కూల్‌కి వెళ్లకుండా ఉండేందుకు సాకులు చెప్తూ ‘అమ్మా నొప్పులే’ అనే పాట పాడతారు పిల్లలు. అది నేనే పాడాను. హీరోయిన్‌ల విషయానికొస్తే ‘రంగులరాట్నం’లో అంజలీదేవికి, ‘బాలసన్యాసమ్మ కథ’లో కృష్ణకుమారికి, ‘బంగారు పంజరం’లో శ్రీరంజనికి, ‘పరమానంద శిష్యులు’లో కేఆర్‌ విజయకి పాటలు పాడాను. అలాగే సావిత్రి, రాజసులోచన, గీతాంజలి... చాలామందికి పాడాను. జానకి, సుశీల, జిక్కి, పి.లీల, బి.వసంత, జానకి, ఎల్‌ఆర్‌ ఈశ్వరి...అందరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం.
ఎన్టీఆర్‌ కుటుంబంతో అనుబంధం...
మహానుభావుడు ఎన్టీఆర్‌తో, ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. రిహార్సల్స్‌కి వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఎన్టీఆర్‌ అస్సలు బాకీ పెట్టేవారు కాదు. పాట పూర్తయిన వెంటనే సోదరుడు త్రివిక్రమరావుతో ‘అమ్మాయికి డబ్బులిచ్చి, కారులో ఇంటి దగ్గర దింపి రా’ అని పురమాయించేవారు. ఆయన స్థాపించిన బ్యానర్‌లో పూజా కార్యక్రమాలకి నాతో ప్రత్యేకంగా పాట పాడించుకునేవారు. అలాగే అంజలీదేవి, భానుమతి కూడా డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండేవారు. అంజలీదేవి ఆ రోజుల్లోనే 1200 రూపాయలు ఇచ్చారు. ఘంటసాల ఎక్కువ పాటలు పాడించారు. నా ఆఖరి పాట ఘంటసాలదే అనుకుంటాను.
సంతోషం లేదు...
‘రక్షరేఖ’ సినిమాలో ఘంటసాలతో కలిసి ‘ఓహో రాజ సుకుమార’, ‘శ్రీలక్ష్మమ్మ కథ’లో ‘తాళగజాలనురా’ అన్న జావళి, ‘అమ్మలక్కలు’లో జిక్కితో కలిసి ‘కన్నెమావి తోటలోన’, ‘పరాశక్తి’ సినిమాలో ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’, ‘జయసింహ’లో రావు బాలసరస్వతితో కలిసి ‘మనసైన చెలి పిలుపు...’ పాటలు పాడాను. 1960లో ‘దీపావళి’ సినిమాలో ‘సరిమా మాతో సమరాన నిలువగలడా...’ అనే పాట బాగా ప్రజాదరణ పొందింది. ఘంటసాలగారి సొంత చిత్రం ‘భక్తరఘునాథ్‌’లో ‘జయ మురళీలోలా’ పాట నాకు చాలా ఇష్టం. ‘బంగారు పంజరం’లో నేను పాడిన ‘పదములే చాలు రామా...’ పాటని తిరుమలలో విన్నప్పుడు చాలా ఆనందమేసింది. జీతం తక్కువైనా తొలి నాళ్లలో సంతోషంగా ఉండేదాన్ని. ఇప్పుడు 10వేలు ఫించన్‌ వస్తున్నా ఆ సంతోషం లేదు. స్వరానికి, గానానికి రిటైర్మెంట్‌ ఉండదు. కానీ రేడియోలో పనిచేస్తానని 70ల్లోనే సినిమా అవకాశాలు తగ్గించేశారు.
ఎవరైనా.. ఎపుడైనా..
ఇప్పటికీ బతికున్నానంటే శాసీ్త్రయ సంగీతమే కారణం. తొలి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో శాసీ్త్రయ సంగీత కచేరీలు ఎక్కువగా చేసేదాన్ని. 1974లో గుంటూరులోని నాగార్జున అకాడమీలో, 1979లో మద్రాసులోని మ్యూజిక్‌ అకాడమీలో, కేరళలోని సద్గురు సంగీత సభ, విజయవాడలోని కనకదుర్గ కళాసమితిలో చాలా కచేరీలు చేశాను. 1991లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కచేరీ చేయడం నా పూర్వజన్మ సుకృతం. నా సినిమా వాళ్లు ఎవరైనా, ఎప్పుడైనా ‘కోమలగారూ’ అని పలకరిస్తారేమోనని ఆశగా చూస్తాను. తెలుగు సినిమా నన్ను మర్చిపోయిందనే అనుకుంటాను.’’

మరిచిపోలేని అనుభూతి
శాసీ్త్రయ సంగీతంలో ఆమె ప్రతిభకుగాను తమిళనాడులోని ఒక సంగీత సంస్థ ‘మధురవాణి’ బిరుదుతో సత్కరించింది. 2001లో తిరుపతికి చెందిన ఘంటసాల గాన కళాపీఠం ‘అమృతగాన వర్షిణి’గా కీర్తించింది. తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ అవార్డు కూడా అందుకున్నారు. 2003లో అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత కలైమామణి అవార్డు ప్రదానం చేస్తూ ‘‘నేను వచ్చి మీకు ఇచ్చానమ్మా’’ అనడం ఆ సభ లో విశేషంగా చెప్పుకున్నారట. ఆ సంఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ కోమల మోము వెలిగిపోతుంది.
. గనిరెడ్డి అరుణ్‌కుమార్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌.