Apr 22 2019 @ 03:49AM

పంచభూతాల ఆరాధనే పంచాయతనం

అనేక విధాలుగా ఉన్న మన ఆరాధనా పద్ధతులను అధ్యయనం చేసిన ఆదిశంకరులు ‘పంచ దేవతారాధన’ను పునరుద్ధరించారు.
‘‘ఆదిత్య మంచికా విష్ణుం గణనాథంచ మహేశ్వరమ్‌’’ ఆదిత్యుడు (సూర్యుడు), అంబిక (అమ్మవారు) విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు ఈ ఐదుగురిని పంచదేవతలంటారు. ఈ అయిదుగురితో కలిపి చేసే ఆరాధనను ‘పంచాయతనం’ అంటారు. నిజానికి మన దేవాలయ వ్యవస్థంతా ప్రతీకలమయం. దాని బాహ్యం మనల్ని ఆకర్షిస్తుంది అంతే. దాని అంతరంగం, అంతరార్థం వేరుగా ఉంటుంది. సృష్టి ఆధార భూతమైన పరమేశ్వరుని రంగస్థలం ఆద్యంతాలు లేనిది. అందులో ఈ పంచభూతాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపే సంకేతం పంచభూతలింగాల్లో ఉంది. మానవ దేహం మొదలుకొని సృష్టి అంతా వ్యాప్తమైన ఈ పంచభూత స్థితికి చైతన్యం కల్పించేవాడు పరమాత్మ అనేది ఇందులో అంతరార్థం. విడిగా చూస్తే.. ఆకాశానికి శివుడు, వాయువుకు శక్తి, అగ్ని తత్వానికి సూర్యుడు, జలానికి విష్ణువు, పృథ్వీ తత్వానికి గణపతి ప్రతీకలు. మనలోని పంచభూతాలను గమనించి, వాటికి అధిష్ఠాన దేవతగా పరమాత్మను తెలుసుకోమని చెప్పడమే ఈ అయిదుగురు దేవతల ఆరాధన.
 
శ్రీకాళహస్తిలోని సువర్ణముఖి నదిలోని శిలను అంబికారాధనకు, మధ్యప్రదేశ్‌లో ప్రవహించే నర్మదా నది శిలలను శివలింగాలకు, కావేరి నదిలోని స్ఫటిక లింగాలను సూర్యారాధనకు, నేపాల్‌లోని గండకీ నదిలో లభించే సాలగ్రామాలను విష్ణువు ఆరాధనకు, బీహార్‌లో ప్రవహించే శోణభద్రా నదిశిలలను గణపతి ఆరాధనకు ఉపయోగించాలని ఆగమాలు చెబుతున్నాయి.
శివే విష్ణౌ తథా శక్తా సూర్యేమయి నరాధిప
నాభే దుర్భుద్ధిర్యోగః ససమ్యగ్‌ యోగతమేమతః
శివ, విష్ణు, శక్తి, సూర్య, గణేశ.. అనే ఐదుగురు దేవతల గురించి చేసే సమష్టి ఆరాధన వల్ల కలిగే బుద్ధి యోగమని గణేశ పురాణం తెలిపింది ఈ దేవతల తత్వం అంతా యోగంలో భాగమే. తమస్సును పారదోలి మనుషుల్లో జ్ఞానాన్ని నింపే గురువులాగా ఆకాశమండలమంతా తన తేజంతో వెలుగులు నింపుతాడు సూర్యుడు. శరీరంలో కొన్ని భాగాలు ఆకాశతత్వం గలవి. మన ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే సూర్యనమస్కారాలు చేయాలి. 365 రోజులూ సూర్యుడుదయించే ఈ దేశంలో సూర్యారాధన మరచిపోయి ‘డి’ విటమిన్‌ మాత్రలు మింగుతున్నామంటే అంతకంటే దురదృష్టమేముంటుంది? ఇక.. శక్తి ప్రాణరూపంలో ఉంటుంది. ఆ తల్లిది వాయుతత్వం. అమ్మను ఆరాధించడమంటే ప్రాణారాధనే; జ్ఞానారాధనే. ఇక.. నీరు జగతికి ప్రాణాధారం. దాని అధిష్ఠాన దేవత నారాయణుడు. నీటిలో పోషకశక్తి, స్థితిశక్తి ఉన్నాయి. విష్ణువు అంటే వ్యాపించినవాడు. ప్రకృతికి ప్రతీక. భూమిలో మూడో వంతు జలమే, విష్ణుతత్వారాధన పోషకశక్తి ఆరాధనే. గణపతి పృథ్వీతత్వస్వరూపుడు. బుద్ధి, సిద్ధి రెండూ కలగాలంటే మనం ఈ భూమిపై జీవించాల్సిందే. అవి రెండూ గణపతి దగ్గరున్నాయి. విజాయమూలమైన ఈ రెండు సిద్ధులను పొందటానికే గణపతి ఆరాధన. ఇక.. మహేశ్వరుడు చిదాకాశరూపుడు. ఆయన ఆద్యంతాలను బ్రహ్మ, విష్ణువులే కనిపెట్టలేకపోయారు. నిరాకారతత్వానికి లింగం ప్రతీక. ఏమిలేనిదానికే లింగం (చిహ్నం) అని పేరు. ఆకాశతత్వమంటే అదే. ఈ పంచదేవతల ఆరాధన భౌతికంగా ఆధ్యాత్మికతను కల్గించి ప్రవర్తన మార్చుకొనేట్లు చేసి ఇహంలో సుఖం కలిగిస్తుంది. అంతర్ముఖులయి ఆరాధన చేస్తే ఆత్మజ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది.
- డా.పి. భాస్కరయోగి