
- 1920 ఏప్రిల్ 20న భవనం ప్రారంభం
- ప్రత్యేకతలు నిండిన వారసత్వ కట్టడం
- నేడు ఉత్సవాలు... సుప్రీం జడ్టిల రాక
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరం ఒడిలో మూసీ నది ఒడ్డున కొలువుదీరిన హైకోర్టు భవనానికి నేటితో వందేళ్లు! శత సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యమే కాదు నిండా ఎన్నో ప్రత్యేకతలు నింపుకున్న నిర్మాణమిది! అత్యంత అరుదైన, అందమైన వారసత్వ కట్టడమిది! అంతేనా, రాచరిక పాలనలో ఆధునికత సంతరించుకొన్న న్యాయ వ్యవస్థకు తార్కాణం. నాడు బ్రిటీషు పాలిత దేశంలోని 543 సంస్థానాల్లో తొలిగా ఉన్నత న్యాయస్థానానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించిన ఘనత నిజాం ప్రభుత్వానికే దక్కుతుంది.
దేశంలోనే అతిపెద్ద దర్వాజా
సైఫాబాద్‌లోని ఒక అద్దె భవనంలో ఇరుకు గదుల్లో హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలు సాగేవి. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పూనికతో 1915, ఏప్రిల్ 15న హైకోర్టు భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జైపూర్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ శంకర్‌లాల్ డిజైన్ గీశారు. నిజాం ప్రభుత్వ చీఫ్ ఇంజినీరు అక్బర్ బేగ్, మరొక ఇంజినీరు మెహర్ అలీ ఫజిల్ నేతృత్వంలో నిర్మాణం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ శిష్యుల్లో ఒకరైన ఎంఎల్ ఆదయ్య పర్యవేక్షణాధికారిగా పనిచేశారు. ‘గులాబీ, బూడిదరంగు గ్రానైట్ రాళ్లతో, ఇండో సార్సనిక్ శైలితో నిర్మితమైన హైకోర్టు భవనంలో రాజస్థానీ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది’’ అంటారు సీనియర్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి. యూపీలోని ఫతేపూర్ సిఖ్రీలో మొగల్ చక్రవర్తి అక్బర్ కట్టించిన బులంద్ దర్వాజా దేశంలోనే అతి పెద్దదని అంటారు. అంతకన్నా మన హైకోర్టు ముఖద్వారం పెద్దదని చరిత్ర అధ్యయనకారులు సఫీవుల్లా చెబుతున్నారు. హైకోర్టు భవనాన్ని శంషాబాద్ వద్ద గగన్‌పహాడ్ ప్రాంతంలోని కొండలను తొలిచి తవ్విన రాళ్లతో కట్టారు. హైకోర్టు భవన నిర్మాణం 1919, మార్చి 31 నాటికే పూర్తయింది. కానీ 1920, ఏప్రిల్ 20న మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు.
హిందూ లా ప్రకారం...
నిజాం ప్రభుత్వంలోని న్యాయ వ్యవస్థ షరియత్ చట్టం ప్రకారమే నడిచేది. హైదరాబాద్ రాజ్యంలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉండటంతో ఆరో నిజాం కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. ముస్లిం న్యాయమూర్తులతో పాటు హిందూ న్యాయశాస్త్రంలో నిష్ణాతుడికి స్థానం కల్పించారు. 1957 ఎన్నికల్లో ఛాదర్‌ఘాట్, పురానాపూల్, మొఘల్‌పురా, లాల్‌దర్వాజా ప్రాంతాలతో ‘హైకోర్టు నియోజకవర్గం’ ఏర్పాటైంది. 1962 ఎన్నికల తర్వాత చార్మినార్ నియోజకవర్గంలో విలీనం చేశారు.
ఉత్సవాలకు సుప్రీం జడ్జిలు
హైకోర్టు భవనం వందేళ్ల వేడుకలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ హాజరు కానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ఇతర న్యాయమూర్తులు పాల్గొంటారు.
ఉరి శిక్ష రద్దు!
1920 తర్వాత నిజాం రాజ్యంలో ఉరి శిక్షను సైతం రద్దు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని సడలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిజాం ఆర్మీలోని కంట్రోలింగు అధికారిని ఒక జవాను తుపాకీతో కాల్చి చంపాడు. ఆర్మీ విజ్ఞప్తి మేరకు ఆ సైనికుడిని ఉరి తీశారు. ఆ తర్వాత నిజాంపై బాంబు దాడి చేసిన నారాయణరావు పవార్‌కు ఉరి శిక్ష విధిస్తూ నాటి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆ శిక్ష అమలు కాలేదు.