Apr 11 2019 @ 01:47AM

కవి శివారెడ్డికి ‘సరస్వతీ సమ్మాన్‌’

  • ‘పక్కకు ఒత్తిగిలితే’ కవితా సంపుటికి పురస్కారం
  • ప్రకటించిన బిర్లా ఫౌండేషన్‌
  • ఈ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు కవి ఆయనే
  • 2018 ఏడాదికి ప్రకటించిన బిర్లా ఫౌండేషన్‌
  • అవార్డు కింద పతకం, ప్రశంసాపత్రం,15లక్షల నగదు
  • ప్రజల కోసం తపించే కవులకు దక్కిన గౌరవం: శివారెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కె.శివారెడ్డి ప్రతిష్ఠాత్మకమైన ‘సరస్వతి సమ్మాన్‌’ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంస్థ కేకే బిర్లా ఫౌండేషన్‌ ఏటా అందజేసే ఈ అవార్డును 2018 సంవత్సరానికిగాను శివారెడ్డిని ఎంపిక చేసింది. 2016లో ఆయన రాసిన ‘పక్కకు ఒత్తిగిలితే’ అనే కవితా సంపుటిని పురస్కారానికి ఎంపిక చేశారు. ‘సరస్వతి సమ్మాన్‌’ను ప్రారంభించిన 28 ఏళ్లలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు కవి శివారెడ్డినే. అవార్డు కింద ఆయనకు పతకం, ప్రశంసాపత్రంతో పాటు రూ.15లక్షల నగదును అందజేస్తారు. ఈ మేరకు ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సురేశ్‌ రితూపర్ణ బుధవారం పేర్కొన్నారు. లోక్‌సభ సచివాలయం పూర్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సుభాష్‌ సి. కశ్యప్‌ నేతృత్వంలోని 13 మంది సభ్యులు గల ఎంపిక కమిటీ దేశవ్యాప్తంగా 22 భాషల్లోని ఎంతోమంది కవుల రచనలను పరిశీలించి శివారెడ్డిని ఎంపిక చేసింది.
 
ఈ కమిటీలో తెలుగు ప్రతినిధిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ మృణాళిని ఉన్నారు. తనకు ఈ అవార్డు రావడం పట్ల శివారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘ఏ పురస్కారమైనా కవికి ఉత్తేజాన్నిస్తుంది. ఈ పురస్కారాన్ని ప్రజల కోసం తపించే కవులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు. శివారెడ్డి.. ఏపీలోని గుంటూరు జిల్లా కారమూరివారిపాలెంలో 1943 ఆగస్టు 6న జన్మించారు. ఐదు దశాబ్దాలుగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అక్కడి వివేకవర్థిని కాలేజీలో అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. 1973లో సాహితీ సేద్యాన్ని ప్రారంభించిన ఆయన.. రక్తం సూర్యుడుతో మొదలుకొని 20 కవితా సంకలనాలను వెలువరించారు. చర్య, ఆసుపత్రిగీతం, నేత్ర ధనస్సు, మోహనా ఓ మోహనా, బారమితి, శివారెడ్డి కవిత, అజేయం, నా కలల నది అంచున, వర్షం.. వర్షం, జైత్రయాత్ర, కవి సమయం, అంతర్జనం, వృత్తలేఖిని, పోసగనీవన్నీ, ఆమె ఎవరైతే మాత్రం వంటివి ఆయన కవితల్లో ప్రధానమైనవి.
 
1990లో ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 2015 సెప్టెంబరులో వరంగల్‌ జిల్లా మొద్దుగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని శ్రుతి అలియాస్‌ మహిత, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్‌ సాగర్‌లకు అంకితం ఇస్తూ కూడా కవిత రాశారు. పలు పుస్తకాలను ఆయన అనువాదం చేశారు. మధ్యప్రదేశ్‌ సర్కారు తరఫున అందజేసే ప్రతిష్ఠాత్మకమైన కబీర్‌ సమ్మాన్‌ అవార్డును 2017లో రాష్ట్రపతి కోవింద్‌ నుంచి శివారెడ్డి అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు భాషా సలహా సంఘం కన్వీనర్‌గా ఉన్నారు. కాగా ‘సరస్వతి సమ్మాన్‌’ తొలిసారిగా ఒక తెలుగు కవికి దక్కడం తెలుగు సాహిత్యరంగానికే గర్వకారణం అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి. సాహితీవేత్త మృణాళిని, కవి యాకూబ్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

మానవ సంబంధాల విధ్వంసమే కవితా వస్తువుగా
ప్రపంచీకరణ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలు, మానవ సంబంధాల విధ్వంసం, జీవితాల్లోని సంక్లిష్టత తదితర ఆంశాలను కవితా వస్తువులుగా తీసుకొని ఆక్షరబద్ధం చేసిందే ‘పక్కకు ఒత్తిగిలితే’ కవితా సంపుటి. 104 కవితలతో కూడిన ఆ పుస్తకం 2016లో ప్రచురితమైంది. అందులో ‘కొంచెం స్వేచ్ఛ కావాలి’ వంటి కవితలు సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దంపడతాయని.. ఆ కవితాక్షరాలు ప్రజాస్వామ్య విలువల గొంతుకై నినదిస్తాయని అంటారు.
 
తొలి అవార్డు.. హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌కు
జ్ఞానపీఠ్‌ తర్వాత సాహితీ పురస్కారాల్లో ఆ స్థాయి గుర్తింపు కలిగిన ‘సరస్వతి సమ్మాన్‌’ను 1991 నుంచి ఇస్తున్నారు. తొలి అవార్డును బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తండ్రి ప్రముఖ కవి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌కు ప్రదానం చేశారు. ఆ తర్వాత వరుసగా రమాకాంత్‌ రథ్‌, విజయ్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌, బాలమణి అమ్మ, శంషూర్‌ రహ్మన్‌ ఫారూఖీ, మనుభాయ్‌ పంచోలి, శంకా ఘోష్‌, ఇందిరా పార్థసారథి, మనోజ్‌దాస్‌, దాలిప్‌ కౌర్‌ తివానా, మహేశ్‌ ఎల్‌కుంచ్‌వార్‌, గోవింద్‌ చంద్రపాండే, సునీల్‌ గంగోపాధ్యాయ్‌, కె.అయ్యప్ప ఫణీక్కర్‌, జగన్నాథ్‌ ప్రసాద్‌ దాస్‌, నయ్యర్‌ మసూద్‌, లక్ష్మినందన్‌ బొరా, సుర్జిత్‌ పాతర్‌, ఎస్‌ఎల్‌ భైరప్ప, ఎ.ఎ.మనవాలన్‌,సౌగత్‌కుమారి, గోవింద్‌ మిశ్రా, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ(రామాయణ మహాన్వేషణం అనే కవిత), పద్మా సచ్‌దేవ్‌, మహాబలేశ్వర్‌ సాయిల్‌, సీతాంశు యశ్‌షచంద్రలు అందుకున్నారు.