desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 7 2019 @ 00:11AM

సెన్సార్‌ మార్చిన టైటిల్‌!

  • పొలిటికల్‌ ఫిల్మోగ్రఫీ
  • ‘ఓటుకు విలువివ్వండి’
సగటు మనిషి సమస్యలే ఇతివృత్తాలుగా తీసుకొని సినిమాలు రూపొందించిన దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణ. ‘ఈ చరిత్ర ఏ సిరాతో!’, ‘ఇది కాదు ముగింపు’, ‘ఈ దేశంలో ఒక రోజు’, ‘ఈ పిల్లకు పెళ్లవుతుందా?’, ‘ఆడవాళ్లే అలిగితే..?’, ‘మార్చండి మన చట్టాలు’, ‘అపనిందలు ఆడవాళ్లకేనా?’ .... ఇలా ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండేవి ఆయన చిత్రాల టైటిల్స్‌. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని వేజెళ్ల సినిమాలు తీసేవారు. స్టార్స్‌ జోలికి వెళ్లకుండా, చిన్న హీరోలతో, కొత్త వాళ్లతో చిత్రాలు తీసి, దర్శకుడిగా తన ఆధిపత్యాన్ని ఆయన నిలబెట్టుకొనేవారు. శివకృష్ణ, రాజేంద్రప్రసాద్‌ వంటి నటులు కెరీర్‌ ప్రారంభ దశలో వేజెళ్ల సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. అలాగే పరుచూరి సోదరుల రచనా ప్రతిభను పదిమందికీ చాటినవి వేజెళ్ల సినిమాలే! 
 
అలా విభిన్న తరహా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వేజెళ్ల తీసిన మరో సినిమా ‘ఓటుకు విలువివ్వండి’. ఓటు హక్కు ప్రాముఖ్యం, అది దుర్వినియోగం అవుతున్న తీరు, ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకుల వాగ్దానాలు... ఈ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రజాస్వామ్య పాలనలో దేశం ఉండాలనీ, అందులో ప్రతి పౌరుడికీ భాగస్వామ్యం కలిగించే ఉద్దేశంతో ఓటు హక్కు కల్పించారు. అయితే కాలక్రమంలో ఆ ఓటుకు రేటు కట్టడం మొదలైంది. ఎన్నికల్లో వేసే ఆ ఓటు కోసం ఎన్నో అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో మానవత్వం మసై పోతోంది. ఓటును అమ్ముకోకూడదనీ, సమర్ధుడైన వ్యక్తిని ఎన్నుకొనే ఆయుధం అదనీ చాలామందికి తెలియడం లేదు. ముఖ్యంగా సామాన్యుడికి ఓటు విలువ తెలియజేసే బాధ్యత మేధావి వర్గానిదే. ఆ వర్గం కళ్లు తెరిచి సామాన్యుడికి ఓటు విలువ తెలిసే వరకూ ఓటుకు సెలవు ఇవ్వాల్సిందే అని ఈ చిత్రంతో చాటారు వేజెళ్ల. అలాగే ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోతే.... వాళ్లను పదవి నుంచి వెనక్కి పిలిచి, నిలదీసే అధికారం కూడా ఓటర్లకు ఉండాలని ఈ సినిమాలో బలంగా చెప్పారాయన.
 

కొత్తవారికి అవకాశం
ప్రతి సినిమాలోనూ ప్రతిభ కలిగిన కొత్తవారికి అవకాశాలు కల్పించడం వేజెళ్లకు అలవాటు. అలాగే ఈ చిత్రంలో కూడా కొంతమంది కొత్తవారికి అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా చిత్రంలోని కీలకమైన దయానిధి పాత్రకు మొదట ఓ సీనియర్‌ నటుడిని అనుకొని కూడా ఆ తర్వాత మనసు మార్చుకొని, శ్యామలరావు అనే కొత్త నటుడితో చేయించారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు శ్యామలరావు. నటనానుభవం లేకపోయినా వేజెళ్ల సూచనలతో చక్కగా నటించి, దయానిధి పాత్రకు న్యాయం చేశారు శ్యామలరావు. అలాగే చిత్రంలో గాంధీ, బోసు, ప్రకాశం పాత్రలను రంగనాఽథ్‌, సుధాకర్‌, రాజేంద్రప్రసాద్‌ పోషించారు. శరత్‌బాబుదీ కీలకమైన పాత్రే. భీమేశ్వరరావు, వంకాయల, ర్యాజ్యలక్ష్మి, రమాప్రభ, త్రివేణి, జయమాలిని ఇతర ముఖ్యతారాగణం.
 

సెన్సార్‌ సమస్య
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న సమయమది. ఎన్నికల ముందు ఇటువంటి కథాంశంతో సినిమా తయారవుతున్నప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడడం సహజమే. 1985 నాటి రాజకీయ పరిస్థితుల్ని ఈ సినిమాలో ప్రతిబింబించే ప్రయత్నం చేశారు దర్శకుడు వేజెళ్ల. అయితే ఆయన ఉత్సాహం మీద సెన్సార్‌ బోర్డ్‌ నీళ్లు జల్లింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ భారీ సంఖ్యలో కట్స్‌ చెప్పడమే కాకుండా టైటిల్‌ కూడా మార్చాలని ఆదేశించింది. ఈ సినిమాకు మొదట పెట్టిన టైటిల్‌ ‘ఓటుకు సెలవివ్వండి’. కానీ సెన్సార్‌ ఆదేశంపై ‘ఓటుకు విలువివ్వండి’గా మార్చాల్సి వచ్చింది. దాంతో సినిమాలో కథకూ, టైటిల్‌కూ సంబంధం లేకుండా పోయింది. ఈ కారణంగా 1985 ఫిబ్రవరి 28న విడుదలైన ‘ఓటుకు విలువివ్వండి’ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
 
- వినాయకరావు