Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 02 Apr 2019 03:49:28 IST

బిగ్‌ఫైట్‌....

బిగ్‌ఫైట్‌....

 • అభివృద్ధా.. అనుభవమా?
 • జీడీ నెల్లూరులో ఇదే సమర నినాదం
 • ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ
చిత్తూరు (వ్యవసాయం): గంగాధర నెల్లూరు నియోజకవర్గంపై తమ పట్టును కొనసాగించాలని వైసీపీ, ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని టీడీపీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన నారాయణస్వామి ఈసారి కూడా వైసీపీ అభ్యర్థిగా బరిలో వుండగా, టీడీపీ నుంచి అప్పటి అభ్యర్థి కుతూహలమ్మ స్థానంలో ఆమె తనయుడు ఆనగంటి హరిక్రిష్ణ రంగంలోకి దిగారు. వీరితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోడెం నరసింహులు, జనసేన పార్టీ నుంచి పొన్న యుగంధర్‌, అంబేడ్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరపున పయని, జైహిందూస్థాన్‌ పార్టీ తరపున రామయ్యతోపాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో వున్నారు. అయితే ప్రధాన పోటీమాత్రం వైసీపీ, టీడీపీల మధ్యే కొనసాగనుంది.!.
 
భౌగోళిక స్వరూపం
గతంలో వేపంజేరి నియోజకవర్గంలో ఉండిన జీడీనెల్లూరు, పెనుమూరు మండలాలతో పాటు పుత్తూరు నియోజకవర్గం నుంచి వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, కార్వేటినగరం మండలాలతో కలిపి గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకరవర్గం 2009లో ఏర్పడింది. నియోజకవర్గంలో 2,83,332 మంది జనాభా వుండగా 1,87,756 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో 94,524 మంది పురుషులు, 93,219 మంది మహిళలు, 13 మంది ట్రాన్స్‌జెండర్లు. 2014లో జరిగిన ఎన్నికల్లో మ్తొతం 1,54,485 ఓట్లు పోలవగా వైసీపీకి 83,915 ఓట్లు, టీడీపీకి 63,355 ఓట్లు పోలయ్యాయి.
 
రాజకీయ చరిత్ర
నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడిన తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న రెండవ అసెంబ్లీ ఎన్నిక ఇది. తొలిసారి జరిగిన ఎన్నికలో వైసీపీ అభ్యర్తి అయిన ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామిపై టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్‌ గుమ్మడి కుతూహలమ్మ పోటీచేసి ఓటమి చెందారు. ఈమె గతంలో వేపంజేరి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా, ఆ తర్వాత శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. అయితే అనారోగ్యంతోపాటు వయస్సు సహకరించకపోవడంతో తనస్థానంలో తన కుమారునికి రాజకీయ బాధ్యతలు అప్పగించారు.

వర్తమానం..
వైసీపీకి కోటలా ఉన్న కొన్ని మండలాల్లో ప్రభుత్వ పథకాలను పార్టీలకు అతీతంగా మంజూరు చేసి అక్కడి ప్రజానీకాన్ని, క్యాడరును తమవైపు తిప్పుకోగలిగింది టీడీపీ నాయకత్వం. ప్రత్యర్థికంటే ముందుగా ప్రచారం రంగంలోకి దిగిన హరికృష్ణ ముమ్మరంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. రాత్రింబవళ్ళు ప్రచారం కొనసాగిస్తున్నారు. అభ్యర్థిత్వ ప్రకటనకు ముందుకూడా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల ద్వారా ఇటు క్యాడరుకు, అటు ప్రజలకూ అందుబాటులో ఉంటూ వైసీపీ కోటలో పాగావేస్తూ వచ్చారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి వైసీపీ కోటను బద్దలుకొట్టే దిశగా టీడీపీ నేతలు కృషి చేస్తున్నారు.

బలాలు.. బలహీనతలు
ఆనగంటి హరిక్రిష్ణ (టీడీపీ)
రాజకీయాలకు కొత్తయినా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తన తల్లి డాక్టర్‌. గుమ్మడి కుతూహలమ్మ మాజీ మంత్రి, వరసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకురాలు, తన తండ్రి డాక్టర్‌. మునిసిద్దయ్య మాజీ ఎంపీపీ కావడంతో వారి సలహాలు, సూచనలను తీసుకుంటూ రాజకీయంగా ముందుకెళుతున్నారు.

బలం
 • నియోజకవర్గంలో రూ. కోట్లాది ఊపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే నమ్మకం
 • నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని పల్లెల్లో క్యాడరుతో పెంచుకున్న పరిచయాలు.
 • ప్రతి పల్లెకూ రోడ్డు సౌకర్యంతో పాటు ప్రతిపల్లెలోనూ సీసీరోడ్లు నిర్మించి ఉన్నందున ఆ అభివృద్ధిని చూసే ఓట్లేస్తారనే నమ్మకం
 • మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ తనయుడు కావడమే తనకు అత్యంతప్రజాధరణ లభిస్తుందనే ధీమా
 • నియోజకవర్గంలో పార్టీకి ఉన్న నమ్మకమైన క్యాడరు
 • ఎన్టీఆర్‌ జలాశయం మిగులు జలాలను గొలుసుకట్టు చెరువుల పథకం కింద రెండు మండలాలకు మళ్ళించే పనులు మంజూరు చేయించడం
 • ప్రస్తుతం పార్టీ అమలు చేస్తున్న పించన్లు, పసుపు-కుంకుమ, ద్వాక్రా రుణాల ఉపశమనం, అన్నదాత సుఖీభవ, రుణమాఫీ పథకాలే గెలిపిస్తాయనే నమ్మకం
బలహీనత..
 • ముఖ్యమైన నాయకులను కలుపుకుని వెళ్లడంలో ఎదురవుతోన్న సమస్యలు
 • క్యాడరుతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏర్పడడం, ఫోన్‌కు దూరంగా ఉండడం
కళత్తూరు నారాయణస్వామి (వైసీపీ)
సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఒక పర్యాయం సమితి అధ్యక్షుడుగానూ, మరోసారి ఎంపీపీగానూ వ్యవహరించడం. సత్యవేడు ఎమెల్యేగా తొలిసారి, జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికకావడం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మళ్లీ జీడీనెల్లూరుకే టిక్కెట్టు రావడం.
బలం...
 • నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైసీపీకి ఇతోధిక పట్టు ఉండడం.
 • పార్టీ జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా ఇతనితో కలిసి పర్యటించడం
 • నాయకులు, కార్యకర్తలతో ఎక్కడైనా సమస్య ఎదురయితే జిల్లా నాయకులు కల్పించుకుని పరిష్కరించడం
బలహీనతలు...
 •  క్యాడరు పట్ల చులకనగా వ్యవహరించడం
 • వర్గ విభేదాలను పెంచి పోషించడం
 • నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని దూరం చేసుకోవడం
 •  క్యాడరుకు ఒక్క పని కూడా చేయక పోవడం...

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.