Mar 28 2019 @ 14:57PM

దొంగల కాపలాదారుడు మోదీ: చంద్రబాబు

అనంతపురం: ఢిల్లీలో ఉన్న దొంగల కాపలాదారుడు మోదీ అని.. జగన్‌లాంటి వాళ్లను కాపాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కోడికత్తితో జగన్‌ పొడిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అదొక ప్రపంచ సమస్యలా ఎంక్వైరీ వేసిందని ఎద్దేవాచేశారు. వివేకా హత్యను కూడా అలాగే చేశారని విమర్శించారు. ఇంట్లో మనిషిని చంపుకొని రాజకీయం చేయాలనుకున్నారని వ్యాఖ్యానించారు. వివేకాను చంపేసి గుండెపోటుగా చిత్రీకరిస్తారా?, చంపేటప్పుడు లెటర్‌ రాయించడం దుర్మార్గమన్నారు. వివేకా భార్య, కూతురితో నాటకాలు ఆడిస్తున్నారన్నారు. వివేకా హత్య కేసులో కడప వైసీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఇన్వాల్‌ అయ్యారన్నారు. మనిషిని చంపడం ఎంత నేరమో.. చంపిన తర్వాత ఆధారాలు ధ్వంసం చేయడం కూడా అంతే నేరమని పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి అదే చేశారు.. తప్పుచేసిన వాళ్లని వదిలిపెట్టమని హెచ్చరించారు. పోలీసులను బెదిరించారు.. కడప ఎస్పీని కూడా బదిలీ చేయించారని ధ్వజమెత్తారు. ఎన్ని దొంగ ఎత్తుగడలు వేసినా నేరస్తులెవరో బయటపెట్టి తీరుతామని హెచ్చరించారు. మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోనివ్వడం లేదన్నారు. జగన్‌లాంటి వాళ్లను తిప్పికొట్టాలంటే జనం నుంచి విప్లవం రావాలని చెప్పారు.
 
ఈవీఎంలను ట్యాంపర్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇష్టానుసారంగా ఓట్లు వేసుకుని గెలిచి.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ఎవరికి ఓటు వేస్తున్నారో మీకు తెలియాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసిన తర్వాత ఈవీఎంల నుంచి స్లిప్‌ రావాలని పోరాడామన్నారు. ఇప్పుడు వీవీప్యాట్‌లు లెక్కించేలా సుప్రీంకోర్టులో కేసు వేశామని, విజయం సాధిస్తామని పేర్కొన్నారు. పనిచేయకుండా అడ్డగోలు రాజకీయాలు చేసే మోదీలాంటి వాళ్లు శాశ్వతంగా అధికారంలో ఉండాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.