Mar 28 2019 @ 04:06AM

రాహుల్‌తోనే రాష్ర్టానికి మహర్దశ: రఘువీరా

కళ్యాణదుర్గం అర్బన్‌, మార్చి 27: రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే రాష్ర్టానికి మహర్దశ వస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐయ్యగార్లపల్లి గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానమంత్రిని చేస్తే తొలిసంతకం ప్రత్యేక హోదాపై ఉంటుందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు తక్షణమే రూ.2లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని చెప్పారు. వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్‌, పేదలకు కనీస ఆదాయ హక్కు, విద్యనైపుణ్యాభివృద్ధికి కేంద్రబడ్జెట్‌లో 6శాతం నిధులు కేటాయిస్తామని రఘువీరా హామీ ఇచ్చారు. ఉద్యోగుల సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. పేద కుటుంబాలకు 4గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు పేద మహిళలకు రూ.6వేలు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2వేలు, 60-70ఏళ్ల వరకు రూ.2,500, 70 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు రూ.3వేలు పింఛను ఇస్తామన్నారు.