Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 23 Mar 2019 02:55:21 IST

తెలంగాణనా... పాకిస్థానా?

తెలంగాణనా... పాకిస్థానా?

  • కేసీఆర్‌ మనవాళ్ల భూముల్ని తీసేసుకుంటారా?
  • మనమింకా బతికే ఉన్నాం.. భయపడొద్దు.. అడ్డదారి రాజకీయం చేస్తే వదలం
  • మా పార్టీలోకి వస్తామన్న వాళ్లనూ అడ్డుకున్నారు.. వాళ్లే ఆ విషయం చెప్పారు
  • జగన్‌తో పొత్తుకు నాపై ఒత్తిడి తెచ్చారు.. కేసీఆర్‌ను జగన్‌ తలకెత్తుకుంటున్నారు
  • వైసీపీ నేతలకు పౌరుషం లేదా?.. ఆంధ్రా పుట్టుక పుట్టలేదా?.. పవన్‌ ఫైర్‌
‘‘కొన్ని నెలల క్రితం కొంతమంది నా వద్దకు వచ్చి జనసేనలో చేరతామన్నారు. కానీ, తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఎందుకని ఆరా తీస్తే, ‘హైదరాబాద్‌లో మాకు ఆస్తులున్నాయి. వాటితో సమస్యలున్నాయి’ అని చెప్పారు. నాకు అప్పుడు అది అర్థం కాలేదు. ఇప్పుడు తెలుస్తోంది! ప్రజాస్వామ్యాన్ని బతికించే విధానం ఇది కాదు!’’
 
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుచిత జోక్యం చేసుకుంటున్నారని జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తెర వెనుక చాలా జరుగుతోందని నిప్పులు కురిపించారు. ఏపీ రాజకీయాలూ, నేతలపై పొరుగు ఒత్తిళ్ల గురించి ఆంధ్రజ్యోతి గత నాలుగు రోజులుగా ప్రచురిస్తున్న కథనాల్లోని విషయాలను బలపరిచే విధంగా పవన్‌ మాట్లాడారు. భీమవరం రోడ్‌షోలోనూ, ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
‘‘హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? అది తెలంగాణా? పాకిస్థానా? పౌరుషం లేదా? మనమింకా బతికున్నాం. ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే పోనీలే పోనీలే అని వదిలే పరిస్థితి లేదు. భయపడుతూ భయపడుతూ ఎంతకాలం ఉంటాం? ధైర్యంగా ఉందాం.’’
‘‘ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే.. వారిని జగన్‌ భుజానికెత్తుకెళ్తుంటే వైసీపీ నాయకులకు ఎలా మనసొప్పుతోంది? అంత హీనంగా తిడుతుంటే.. మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉండుంటే మీకు పౌరుషమే రాలేదా?’’-పవన్‌ కల్యాణ్‌
 
భీమవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? తెలంగాణా ఏమన్నా పాకిస్థాన్‌ అనుకుంటున్నారా? పౌరుషం లేదా? మనమింకా బతికున్నాం. ఇంకా విభజించే రాజకీయాలు చేయొద్దు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే పోనీలే పోనీలే అని వదిలే పరిస్థితి లేదు. భయపడుతూ భయపడుతూ ఎంతకాలం ఉంటాం? ధైర్యంగా ఉందాం’’ అని పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం భీమవరం సభలో అన్నారు. ‘‘ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే.. అలాంటి నాయకుల్ని మీ నాయకుడు జగన్‌ భుజానికెత్తుకెళ్తుంటే మీకెలా మనసొప్పుతోంది? అని వైసీపీ నాయకులను అడగండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘అంత హీనంగా తిడుతుంటే.. మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉంటుంటే మీకు పౌరుషమే రాలేదా?’’ అంటూ వైసీపీ అభ్యర్థులను తీవ్రంగా విమర్శించారు.
 
భీమవరం సభలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివా్‌సను ఉద్దేశించి ప్రస్తావిస్తూ కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి తీరును పవన్‌ ఎండగట్టారు. ‘తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్పా.. కేసీఆర్‌ మాత్రం ఆంరఽధా రాజకీయాలలో వేలు పెట్టవచ్చా?’ అని ప్రశ్నించారు. ఆయనకు ఆంధ్రా మీద అంత అభిమానం ఉంటే తన అభ్యర్థులను పోటీ చేయింవచ్చన్నారు. ‘‘టీఆర్‌ఎస్‌ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తారా? వారితో వైసీపీ వారు వంత పాడుతారా?’’ అని విమర్శించారు. ‘‘2014లో తలసాని తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎన్నో తిట్లు తిట్టాడు.. పైగా నా ప్రచారం కోసం ఎదురుచూశారు. పవన్‌ ఎక్కడ? పవన్‌ ఎక్కడ? అంటూ పదే పదే ఫోన్‌లు చేస్తూ ఎదురుచూశారు. ఇప్పుడు ఇక్కడ అభ్యర్థికి మద్దతు ఇస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తలసాని శ్రీనివా్‌సగారూ దయచేసి విభజన రాజకీయాలను మానేయాలి. పద్ధతి కాదిది. రాష్ట్రాలు విడిపోయినాయి. శ్రీనివాస్‌ యాదవ్‌గారూ మీరు కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ స్థాపించండి. భీమవరం నుంచి మీ అభ్యర్థిని నిలబెట్టండి.
 
కావాలంటే గ్రంధి శ్రీనివా్‌సగారినే నిలబెట్టుకోండి. మీరు ఛీకొట్టిన జగన్మోహన్‌ రెడ్డినే మళ్లీ సపోర్ట్‌ చేస్తున్నారు. ‘జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది తప్ప నాకు ఆయనంటే భయం లేదు. అక్కడేదో నాకు ఇల్లుంది. ఆస్తులున్నాయి. పదెకరాల భూములున్నాయన్న భయం లేదు. ఏం భూములు తీసుకుంటారా? తీసుకోమనండి! ఎవడు తీసుకుంటాడు తెలంగాణలో మన ఇల్లు.. మన భూములు.. నేనూ చూస్తాను. ఏం.. తెలంగాణ పాకిస్థాన్‌ అనుకుంటున్నారా? ఏం పౌరుషం లేదా మనకి? ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మార్చేస్తారా మీరు? బతికున్నామండి ఇంకా ఇక్కడ చాలా మంది. విభజన రాజకీయాలు చేసే మనుషులం కాదు. కానీ.. మమ్మల్ని విభజిస్తామంటే చేతులు ముడుచుకుని కూర్చోం. గుర్తుపెట్టుకోండి. భరిస్తాం మర్యాదతోటి. ఇక్కడికొచ్చి అడ్డగోలుగా అడ్డదారిలో వచ్చి ఆంధ్రరాజకీయాల్లో వేలుపెడతారా? ఏం మాట్లాడతారయ్యా మీరు? పోన్లే పోన్లే.. అంటుంటే వచ్చి ఎక్కి తొక్కుతున్నారు ఒక్కొక్కళ్లు’’ అని ఆగ్రహంతో ఊగిపోయారు.
 
నన్ను కొట్టడానికి 100 మంది వచ్చారు
తెలంగాణలో తనను కొట్టడానికి 100 మంది వచ్చారని పవన్‌ చెప్పారు. ‘‘దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు ఎవరెవరో చేసిన తప్పులకు తెలంగాణ నాయకులు మనందరినీ అడ్డగోలుగా తిడుతుంటే.. హైదరాబాద్‌లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడ్డానికి ఒక్కడికి ధైర్యం లేదు. ఆరోజున నేను తెలంగాణలో సభ పెడితే నన్ను కొట్టడానికి దాదాపు ఒక 100 మంది జనంలో దూరిపోయారు. నేను ఎలాంటోణ్నంటే.. మీరు కొడితే నేను కూర్చోబెట్టి, చేతులు ముడుచుకొని ‘అయ్యా.. బాబూ’ అనే వ్యక్తిని కాదమ్మా గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెరిగినవాళ్లం.. మీరు కొడతా ఉంటే చేతులు కట్టుకుని ‘కొట్టండి కొట్టండి’ అంటామా ఏంటి? ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాం. అధర్మాన్ని ఎదిరించడానికి వచ్చాం. సత్యం మాట్లాడతాం. తప్పుంటే సరిదిద్దుకుంటాం. తప్పు చేస్తే తోలు తీస్తాం. మాట్లాడతాం. ప్రజాస్వామ్యంలో మా గొంతులు నొక్కే హక్కు ఎవ్వరికీ లేదు. అది తెలంగాణలో కాదు.. హైదరాబాద్‌లో కాదు.. వరంగల్‌ నడిబొడ్డులో కాదు.. ఎక్కడైనా సరే! ఇది భారతదేశం.. నేను భారతీయుణ్ని. నేను ఎక్కడైనా మాట్లాడటానికి ప్రజాస్వామ్యం నాకు హక్కు ఇచ్చింది. నేను నా హక్కుల గురించి మాట్లాడేటప్పుడు నన్ను ఎన్ని లక్షల మంది బెదిరించినా నన్ను ఆపలేరు. ఆ రోజు నన్ను కొట్టడానికి వచ్చినవాళ్లు కూడా చప్పట్లు కొట్టి వెళ్లిపోయారు.’’ అని పవన్‌ అన్నారు.
 
తెలంగాణలో మనల్ని ఆంధ్రులుగా కొడుతున్నారు
భీమవరంలో నామినేషన్‌ వేయడానికి వెళ్లే ముందు మాట్లాడుతూ.. ఏపీలో ప్రజలు కులమతాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం ఏపీ ప్రజల్ని ఆంధ్రులంటూ కొడుతున్నారని పవన్‌ అన్నారు. ‘‘విభిన్న సామాజికవర్గాలు.. మతాలపేరుతో మనలోమనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. కానీ, తెలంగాణకెళ్తే.. మనందరినీ కలిపి ఆంధ్రావాళ్ల కింద కొడుతున్నారు. దళితులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా కానివ్వండి.. వారికి మాత్రం మనం ఆంధ్రులం. విసిగిపోయాను నేను. కులాలు పెళ్లిళ్లు చేసుకోవడానికే. స్నేహాలు చేయడానికి కులమంటే కుదరదు. అలాంటిది రాజకీయాల్లోకి కులం వచ్చిందంటే మనం అధఃపాతాళానికి వెళ్లిపోతున్నామని అర్థం. భావజాలంతో రాజకీయం ముడిపడాలిగానీ.. కులంతో ముడిపడి రాజకీయమంటే అది మనం భయపడాల్సిన విషయం. అందుకే నేనెప్పుడూ నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని ఎందుకంటానంటే.. నాకు మానవత్వమే ఉంది. ప్రతి కులానికీ నేను గౌరవం ఇస్తాను. అభివృద్ధిలో అందరికీ సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తాను’’ అని పవన్‌ స్పష్టం చేశారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.