Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 03 Jan 2015 23:51:02 IST

హాస్యానికి చిరునామా - ఎన్‌. తారక రామారావు

హాస్యానికి చిరునామా - ఎన్‌. తారక రామారావు

‘అకరసటంశ్రీ మంకాంకుం’- ఇదేమి పేరని ఆశ్చర్యపోతున్నారా? ఇది రావి కొండలరావు హాస్యానికి మచ్చుతునక. నాటికలకు పేర్లు, పాత్రల పేర్లు చదవినా విన్నా హాస్యం, ఆశ్చర్యం కలగటం రావి కొండలరావు ప్రత్యేకత.
రావి కొండలరావు తొలితరం హాస్య నాటక రచయితలలో ఒకరు. మలితరం హాస్య రచయితలు గన్విశెట్టి వెంకటేశ్వరరావు, ఆవుల శ్రీనివాసరావు, అంగర సూర్యారావు, ఆదివిష్ణు, తారకరామారావు, శంకరమంచి పార్థసారథి మొదలైన వారికి, స్ఫూర్తినందించిన ప్రముఖుడు. ఓ రకంగా రెండు తరాలకు వారధి.
రావి చిదంబరం, పార్వతమ్మ దంపతులకు 1932లో ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్ట్‌ మాస్టారు కనుక చదువు సంధ్యలు కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలో జరిగాయి. అన్న ఆర్‌.కె.రావు ప్రోత్సాహంతో పదో సంవత్సరంలో, బాలనటుడిగా కొండలరావు రంగ ప్రవేశం చేశారు. హైస్కూల్‌, కాలేజీ వార్షికోత్సవాలలో తన నటనను కొనసాగించడమేగాక అతి చిన్న వయసులోనే కందుకూరి, చిలకమర్తి వారి ప్రహసనాలు చదవటం, విశ్వనాథ కవిరాజు, మల్లాది వెంకట కృష్ణశర్మల నాటికలు చదివి ప్రదర్శించారు. ఆ క్రమంలో ‘భారతి’ మాసపత్రికలో ఆయన ఒక నాటిక రాశారు. ‘స్వయంవరం’ నాటికతో రావి కొండలరావు ప్రతిభ ఆంధ్ర దేశమంతా మారుమోగింది. రావి కొండలరావుకు 24వ ఏట ఉప్పులూరికాళిదాసు ‘ఆనందవాణి’లో ఉద్యోగం వచ్చింది. అలా మద్రాసు మహానగరంలో జీవనయానం ప్రారంభమైంది. ‘ఆనందవాణి’లో జీవితం ఒక పట్టాన సాగలేదు. జీతం ఎప్పుడిస్తారో, ఇవ్వరో తెలియదు. అసలు కాళిదాసు దర్శనమే కరువు. ఆర్థిక ఇబ్బందులు జీవితం, జీవనయానం పడుతూ లేస్తూ తాడు తెగిన గాలిపటంలా అయింది. కష్టాలు కన్నీళ్ళు కొత్త ప్రదేశం భవిష్యత్తు అగమ్య గోచరం అయినా రావి కొండలరావు నిలదొక్కుకుని రచనా వ్యాసంగం కొనసాగించి, ‘ఆంధ్రపత్రిక’ ప్రత్యేక వార్షిక సంచికలో, ‘కథ కంచికి’ నాటిక ప్రచురణతో కొంచెం స్థిరపడ్డారు. నిలబడ్డారు ధైర్యంగా.
ఆనాటి మద్రాసు నగరంలో ముళ్లపూడి వెంకటరమణ, తెన్నేటి సూరి, తిరుమల రామచంద్ర, మల్లాది రామకృష్ణ శాసి్త్ర, బాపు, డి.వి. నరసరాజు, మల్లాది వెంకటకృష్ణ శర్మ లాంటి సాహితీ ప్రముఖుల సాంగత్యం, కొందరితో సాన్నిహిత్యం, మరికొందరితో అంతే వాసిత్వం పొంది రచయితగా నటుడిగా స్థిరపడ్డారు. సినిమాల్లో కథా విభాగంలో సహాయకుడిగా, కొంతకాలం సహాయ దర్శకుడిగా ఆ తర్వాత సినిమా నటుడిగా, పత్రికారంగంలో సబ్‌ ఎడిటర్‌గా జీవనం కొనసాగిస్తూనే రంగస్థలం మీద అనేక నాటికలు, నాటకాలు రాసి ప్రదర్శించారు.
ఆంధ్ర నాటక కళా పరిషత్‌ పోటీల్లో రచనకు, ప్రదర్శనలకు ఉత్తమ రచయితగా బహుమతులుఅందుకున్న రావి కొండలరావు ఆకాశవాణికి నూరుకుపైగా నాటికలు రాసి, రికార్డు సృష్టించారు. ‘నాలుగిళ్ళ చావిడి, పట్టాలుతప్పిన బండి, ప్రొ.పరబ్రహ్మం’ నాటకాలు విరివిగా ప్రదర్శించి ఆనాటి ప్రముఖులు ఆచంట జానకి రామ్‌, మల్లాది వెంకటకృష్ణ శర్మల ప్రశంసలందుకున్న రావి కొండలరావు ఇంతవరకూ, నలభైకి పైగా నాటికలురాసి ప్రదర్శించారు.
రావికొండలరావు అన్ని రచనల్లో, హాస్యం అడుగడుగునా ఉంటుంది. పాత్రల స్వరూప స్వభావాలు మనం నిత్యం సమాజంలో చూసే వ్యక్తులే. సంఘటనలు సంభాషణలు కృతకంగా ఉండవు. సహజంగా నిత్యం మనం మధ్యతరగతి జీవులు మాట్లాడే మాటలే. రచనలో నాటకీయత వల్ల అన్ని నాటికలు సభారంజకంగా ఉండటం వల్ల రావి కొండలరావు రచనలు విద్యాలయాల్లో నేటికీ ప్రదర్శితమవుతూనే ఉన్నాయి. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
రావి కొండలరావు రచనల్లో హాస్యం ప్రధానంగా ఉన్నా అంతర్లీనంగా మనుషుల్లోని స్వార్థం, డాంబికం, చాదస్తాల మీద చురకలు ఉంటాయి. సమాజం బాగుపడాలన్న తాపత్రయం ఉంటుంది. హత్యలు, దోపిడీ, అరాచకం, మూర్ఖత్వం ఉన్న సమాజంలోని మధ్య తరగతి జనం జీవితాల్లోని బాధలు ఆశలు, ఆకాంక్షలు, తాపత్రయం, నైరాశ్యం, సంతోషం చూసి, జాలిపడి, వాళ్ళు బాగుపడాలనే ఆశ, విశ్వాసం నమ్మకం ఉంటాయి. ‘ఏకోరసః హాస్యఏవ’ అన్న లాక్షణికుల మాటల్ని త్రికరణశుద్ధిగా నమ్మి, తన రచనల్లో హాస్యాన్ని, అనితర సాధ్యంగా పోషించిన, ‘నవ్వు నాలుగు విధాల గ్రేట్‌’ అన్న సంజీవనిని ప్రేక్షకులకు పాఠకులకూ అందించిన రావి కొండలరావు హాస్యానికి చిరునామా. అంతేగాదు వినయానికి, సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ‘అకరసటం శ్రీమంకాంకుం’ ఏమిటంటే ఇవన్నీ క్రికెట్‌ ఆటగాళ్ళ పేర్లలో మొదట అక్షరాలు. కొంచెం శ్రమపడి తెలుసుకోండి.
 ఎన్‌. తారక రామారావు
(నేడు అనకాపల్లిలో రావి కొండలరావును ‘అజో-విభో-కందాళం ఫౌండేషన్‌’ వారు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరిస్తున్నారు)

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.