
- వేలాది మంది ఉద్యోగులనూ తరలించాలి
- మోసపూరిత జోన్ ప్రకటన
- వెనుక నేరపూరిత కుట్ర: సబ్బం హరి
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన వెనుక నేరపూరిత కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలో అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు సూత్రధారులు. వాల్తేరు డివిజన్‌ను చీల్చి, మాయం చేసి, కేవలం ఒక వంతు మాత్రమే మిగిల్చారు. డివిజన్ పోయింది. దానితోపాటే ఆస్తులూ పోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా 18 వేల మంది ఉద్యోగులు, కుటుంబాలు విశాఖను వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అందుకే ఇది కేవలం ఏపీని మోసం చేయడానికి మాత్రమే చేసిన ప్రకటన’’ అని మాజీ ఎంపీ, విశ్లేషకులు సబ్బం హరి అన్నారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో జోన్ ఏర్పాటు ప్రకటనపై ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘జోన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీకి... జోన్ ఇవ్వాలన్న విషయం 4 సంవత్సరాల 10 నెలలకు గుర్తుకొచ్చింది. జోన్ ఇస్తున్నామన్న ప్రకటన ప్రధాని చేత చేయించాలని బీజేపీ భావిస్తోందన్న విషయం 8 రోజుల క్రితమే తెలిసింది. పరిస్థితులు వేగంగా మారాయి. ప్రధాని సభకు వస్తారో, రారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో జోన్ ఇస్తున్నట్లు బీజేపీ నేతలే ప్రకటించారు. పునర్విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వమన్నారు కాని, డివిజన్ తీసేయమని చెప్పలేదు. బీజేపీ ప్రభుత్వమే జబల్పూర్, కుర్దా, బిలా్‌సపూర్ జోన్లను ఏర్పాటు చేసింది. అక్కడ అప్పటికే ఉన్న డివిజన్లను ఏమాత్రం కదిలించకుండానే జోన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడేమో డివిజన్లో అత్యంత కీలకమైన, ఆదాయాన్ని అందించే విభాగాన్ని ఒడిసాకు ఇచ్చారు. అలా చేయడానికే డివిజన్ విభజన చేశారు.
ఒడిసాలో ఎన్నికల ప్రచారంలో ‘మేం మీకు మేలు చేశా’ అని చెప్పుకోవడానికే ఇలాంటి దుర్మార్గమైన కుట్రకు పాల్పడ్డారు. రాయగడ డివిజన్‌కు 2/3 వంతు ఇవ్వడమంటే కేవలం రైల్వే లైన్లను మాత్రమే ఇవ్వడం కాదు. ఆ మేరకు ఇక్కడ ఉన్న ఆస్తులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విశాఖలోని కీలకమైన విభాగాలను ఆమేరకు రాయగడ డివిజన్‌కు అప్పచెప్పే దిశగా కదులుతున్నారు. అన్నింటికన్నా అత్యంత ప్రధానమైనది... విభజనలో స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని కనీసం అడగనుకూడా లేదు. మొత్తం వాల్తేరు డివిజన్లో 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 12 వేల మందిని తరలించాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం ఉద్యోగులు మాత్రమే జోన్‌కు అవసరముంటుంది. అంటే తరలించాల్సిన ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఉద్యోగుల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన, చర్చా లేకపోవడమే ఇక్కడ విషాదం. వేలాది కుటుంబాలను విశాఖ నుంచి తరలించేయడమంటే నగరాన్ని దెబ్బతీయడమే. మరో కీలకమైన విషయం. జోన్ ఏర్పాటు అంశం బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రాలేదు.
మార్చి మొదటి వారంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయ్యి, కేబినెట్ ఆమోదం వచ్చే వరకూ జోన్ ఏర్పాటు అమలయ్యే అవకాశం లేదు. ఇది తెలిసే బీజేపీ చేసిన కుట్ర ఇది ’’ అని సబ్బం స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఓ ప్రైవేటు చానల్లో ఇదే అంశంపై మాజీ ఎంపీ చర్చలో పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ నేతలు జీవీఎల్, విష్ణువర్థన్‌రెడ్డికి పలు కీలకమైన ప్రశ్నలను సంధించిన సబ్బం... కేంద్ర రైల్వే జోన్ ప్రకటన చేయడంపై తన అభిప్రాయాన్ని సూటిగా ప్రకటించారు. ఈ సందర్భంగా సబ్బం హరి మాట్లాడుతూ, రైల్ భవన్‌కు వెళ్లి విభజన, జోన్ ఏర్పాటు, తదుపరి పరిణామాలను క్షుణ్ణంగా తెలుసుకుని, తిరిగి చర్చకు రావాలని సవాల్ చేశారు.