desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 27 2019 @ 04:30AM

యాదాద్రి జిల్లాలో..ఇక 17 మండలాలు

  • జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికి మారిన గుండాల
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • నెరవేరిన ప్రజాకాంక్ష
(ఆంధ్రజ్యోతి- యాదాద్రి): పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా జనగామ జిల్లాలో విలీనమైన గుండాల మండలం తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ జరిగింది. జనగామ జిల్లా పాలనా యంత్రాంగం పరిధిలోని గుండాల మండలం బుధవారం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి మారనుంది. పరిపాలనా, రాజకీయ, ప్రజా ఇబ్బందుల కారణంగా గుండాల మండలా న్ని యాదాద్రిభువనగిరి జిల్లాలో కలపాలని మండల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..
 
ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ జీవోఎంస్‌ 20 తేదీ 23-02-2019 జారీ చేశారు.. దీంతో ప్రస్తుతం 16 మండలాల పరిధిలో గల యాదాద్రి భువనగిరి జిల్లా భౌగోళిక స్వరూపం 17మండలాలకు విస్తరించనుంది. జిల్లాలోని ప్రస్తుత 16మండలాల పరిధి లో 401 గ్రామ పంచాయతీలసంఖ్య 421కి పెరుగనుంది. అదేవిధంగా జిల్లాలో 2011జనాభా లెక్కల ప్రకారం 16మండలాల పరిధిలో7,39,448 గల జనాభా గుండాల మండల జనాభా 31,385 కలిసి 7,70,833కు పెరుగనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆలేరు శాసనసభా నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలు పూర్తిగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి రానున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 59 మండలాల్లో 58 మండలాలను పునర్విభజన జరిపి 70మండలాల తో మూడుజిల్లాలుగా విభజించారు. గుండాల మం డలాన్ని మాత్రం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఏర్పాటైన జనగామ జిల్లాలో విలీనం చేశారు. అయి తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో గల గుండాల మండలం జనగామ జిల్లా లో విలీన కారణంగా పరిపాలనా పరంగా, రాజకీయంగా ప్రజలకు తీవ్రఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లాకేంద్రం జనగామ, రెవెన్యూ డివిజన్‌ కేంద్రం పరిధిలోకి గుండాలను చేర్చడంతో ప్రజలు తమ అవసరాలకు జిల్లా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలకు వెళ్లడానికి తీవ్ర వ్యయప్రయాసలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
దీంతో గుండాలను యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలోకి తిరిగి మార్చాలని 2016అక్టోబర్‌ మాసం నుంచి మండల ప్రజలు ఉద్యమాలు చేశారు. నిరాహారదీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కూడా గుండాల మండల విలీనం రాజకీయంగా పెద్ద సమస్యగా పరిణమించడంతో ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి తీసుకువచ్చారు. దీంతో శాసనసభ ఎన్నికల ఆలేరు ప్రచారసభలో సీఎం కేసీఆర్‌ గుండాల మండలాన్ని జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేస్తామని స్పష్టంగా హామీఇచ్చారు. ఈమేరకు రాష్ట్రంలో ములుగు, నారాయణపేట కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు గుండాల మండలాన్ని బదిలీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.
అయితే ఈనెల 17న కొత్త జిల్లాలు ఏర్పా టు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేస్తూ జీవోఎంస్‌ 20 తేదీ 23-02-2019 ఉత్తర్వులను మంగళవారం జారీచేశారు. దీంతో నిన్నటి వరకు జనగామ జిల్లా పరిధిలో సాగినపాలనా వ్యవహారాలు, ఇక నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి రానున్నాయి. గుండాల మండలం జనగామ జిల్లాలోకి మార్పు చేయడంతో జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య 17కు పెరుగనుంది.
 
అదేవిధంగా మండల పరిషత్తులు కూడా 17ఏర్పాటు కానున్నాయి. జిల్లా లో కొత్తగా పునర్విభజన ప్రకారం168 ఎంపీటీసీ స్థానాలు గుండాల మండల మండల పరిధిలోని 9 స్థానాలు కలుస్తుండటంతో 177కు పెరుగుతాయి. జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య కూడా 401 నుంచి 421కి, జిల్లా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 7,39,448 నుంచి 7,70,833కు పెరగనుంది. జనగామ జిల్లా, రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గుండా ల మండలంలోని 17రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామ పంచాయతీలు యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలో, భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి చేరాయి.