
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో కన్నుముశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందకు పైగా చిత్రాలకు రామకృష్ణ దర్శకత్వం వహించారు. రామకృష్ణ మృతితో టాలీవుడ్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటీవల కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో బుధవారం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక చికిత్స అందించడానికి మద్రాసు నుంచి వైద్యుడిని రప్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన కన్నుమూశారు. కోడి రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించి వంద చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు తీశారు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు.