Feb 22 2019 @ 03:12AM

‘వేదవ్యాస రంగభట్టర్‌’ ఇకలేరు

  • అనారోగ్యంతో తిరుపతిలో కన్నుమూత..
  • రంగస్థల నటుడు, దర్శకుడు, సాహితీవేత్త, సంగీత దర్శకుడిగా ఖ్యాతి
  • 80కి పైగా సినిమా పాటలు.. 2003లో నంది పురస్కారం
హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీమంజునాథలో బ్రీత్‌లె్‌స సాంగ్‌ ‘మహా ప్రాణదీపం శివం.. శివం’ పాట వినని ఆధ్యాత్మిక ప్రియులు ఉంటారా! ఈ పాటతో పాటు ఎన్నో మంచి మంచి గీతాలను సినిమాలకు అందించిన రచయిత.. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, సాహితీవేత్త, సంగీత దర్శకుడు, తిరుపతి శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు వేదవ్యాస రంగభట్టర్‌(72) ఇకలేరు. ఊపిరితిత్తుల వ్యాధితో తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోమటిపల్లికి చెందిన రంగరాజభట్టర్‌, రంగనాయకమ్మాళ్‌ దంపతులకు 1946లో రంగభట్టర్‌ జన్మించారు. ఉద్యోగరీత్యా తిరుపతిలో స్థిరపడి.. శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేశారు. 1968లో టీటీడీకి చెందిన ఓరియంటల్‌ కాలేజీలో సంస్కృత, సాహిత్య ఆచార్యుడిగా విధుల్లో చేరారు.
 
కొంతకాలం ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించి 2004లో ఉద్యోగ విరమణ పొందారు. 1996లో మహతి కళా మందిరంలో ‘ఎస్వీ నటశిక్షణాలయం’ స్థాపించి ఔత్సాహికులకు పద్యపఠనం, పౌరాణిక నాటకాల్లో ఉచిత శిక్షణ ఇచ్చారు. వందలాది నాటకాలకు రచన, దర్శకత్వం వహించారు. ‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే కొత్త సాహిత్య సంగీత స్వర ప్రక్రియను రూపొందించారు. శ్రీవేంకటేశ్వరస్వామిపై 12, 16 స్వర స్థానాలతో దాదాపు 320 కీర్తనలు రాశారు. ఈ కీర్తనలను ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, సంగీత దర్శకుడు కీరవాణి ఆమోదించి అభినందించారు. వరల్డ్‌ అమేజింగ్స్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ ఇండియా, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తోపాటు వండర్‌బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు రంగభట్టర్‌ సాహిత్య సేవలను గుర్తించి పలు అవార్డులు అందజేశాయి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శక, నిర్మాత నారా జయశ్రీ, తన సోదరుడు భారవి ప్రోత్సాహంతో దాదాపు 80కిపైగా తెలుగు సినిమాలకు పాటలు రాశారు. 1986లో విడుదలైన రంగవల్లి సినిమాకు తొలిసారిగా పాటలు రాశారు.
 
శ్రీమంజునాథ చిత్రంలోని ‘మహాప్రాణ దీపం’ పాట రంగభట్టర్‌కు విశేష ఖ్యాతి సమకూర్చింది. పాండురంగడు, రామదాసు, షిరిడీసాయి, అనగనగా ఒక ధీరుడు, ఝుమ్మంది నాదం, జగద్గురు ఆదిశంకర, వెంగమాంబ, ఓం నమో వేంకటేశాయ లాంటి 13 చిత్రాలకు తన పాటలతో ఆధ్యాత్మిక సుగంధాలను అందించారు. హీరోయి న్లు రోజా, సంఘవిలకు నటనలో భట్టర్‌ శిక్షణ ఇచ్చారు. పలు సాహితీ, సాంస్కృతిక సంస్థల నుంచి కళాతపస్వి, దర్శకరత్న, కళారత్న, సాహితీ సార్వభౌమ వంటి బిరుదులను అందుకున్నారు. శ్రీ రామదాసు, వెంగమాంబ, జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలకు ఉత్తమ గేయ రచయిత అవార్డులు కూడా అందుకున్నారు. రంగభట్టర్‌ సాహిత్యం, కళారంగానికి అందించిన సేవలను గుర్తించిన అప్పటి ప్రభుత్వం 2003లో ఆయనకు నంది అవార్డుతో సత్కరించింది.