Feb 19 2019 @ 15:36PM

మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?

కప్పుడు సౌత్‌లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించిన నగ్మా, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే ముందు, హీరోయిన్‌కు తల్లిగా నటించింది ఆమె. ఎన్టీఆర్ ‘అల్లరి రాముడు’ సినిమాలో చివరిగా కనిపించింది నగ్మా. ఆ తర్వాత సచిన్ జోషి సినిమాలో ఐటెం సాంగ్ చేసినా అంతగా ఎలివేట్ అవలేదు. ఇక అక్కడితో తెలుగు సినిమాలు ఆపేసింది. తాజా సమాచారం మేరకు నగ్మా అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలొస్తున్నాయి.
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న చిత్రంలో నగ్మా.. అల్లు అర్జున్ తల్లి పాత్రలో కనిపించబోతోందని ఫిలింనగర్ టాక్. దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో అత్తలకు, తల్లులకు గుర్తుండిపోయే పాత్రలు ఇస్తాడు. దానికి నదియా, కుష్బూ లాంటి వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్స్. గతంలో చిరంజీవి సరసన ‘ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్ళు, రిక్షావోడు’ సినిమాల్లో నటించిన నగ్మా మరో మెగా ఫ్యామిలీ హీరో బన్నీ సినిమా ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
 
మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోన్న బన్నీ-త్రివిక్రమ్ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇక తాజాగా 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్‌ఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ లో నగ్మాకు లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు వచ్చింది. దీని మీద స్పందించిన ఆమె నా లైఫ్‌ ఇంకా చాలా ఉందంటూ.. ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉందని చెప్పింది. అందులో భాగంగానే నగ్మా ఇప్పుడు త్రివిక్రమ్ మూవీతో రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నగ్మా బన్నీకి తల్లిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.