Feb 19 2019 @ 01:02AM

దీక్షితులు ఇకలేరు

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్‌ దీక్షితులు సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నాచారంలో ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్‌ చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే దీక్షితులు తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎం.ఏ డిగ్రీ పొందారు. రేపల్లె జూనియర్‌ కళాశాలలో లెక్చరరుగా పని చేసిన ఆయన రంగస్థల నటుడిగా, అద్యాపకుడిగా పేరు గడించారు. ఎన్నో నాటకాలు వేశారు. తదుపరి ‘ఇంద్ర’, ‘మురారి’, ‘అతడు’ వంటి హిట్‌ చిత్రాల్లో ఆయన పూజారి పాత్రలతో మెప్పించారు. ఠాగూర్‌, వర్షం తదితర చిత్రాల్లో కూడా నటించారు. అక్కినేని నట విద్యాలయంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. తన జీవితాన్ని నటనా రంగానికే అంకితం చేశారు.