Jan 28 2019 @ 03:41AM

రుణానికి కొత్త మార్గం క్రెడిట్‌ లైన్‌

ప్రస్తుతం మన ఆర్థిక అవసరాలు తీర్చే పలు కంపెనీలు, ఆర్థిక సంస్థలు అనేకం అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో వ్యక్తిగత రుణాలందించే కంపెనీలతో పాటుగా క్రెడిట్‌ లైన్‌ అందించే కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో క్రెడిట్‌ లైన్‌కు ఇప్పుడు ప్రాచుర్యం పెరుగుతోంది. అసలు క్రెడిట్‌ లైన్‌ అంటే ఏమిటి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి వివరిస్తున్నారు మనీట్యాప్‌ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ అనుజ్‌ కాకర్‌.
 
మన స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఎన్నో కంపెనీలు, సాధనాలు ఉన్నాయి. వాటిలో వ్యక్తిగత రుణం ఒకటైతే క్రెడిట్‌ లైన్‌ మరొకటి. వ్యక్తిగత రుణమే పర్సనల్‌ లోన్‌. క్రెడిట్‌ లైన్‌ సుమారుగా క్రెడిట్‌ కార్డు మాదిరిగానే పని చేస్తుంది. అయితే క్రెడిట్‌ కార్డులో మంజూరైన సొమ్ము అంతా కార్డులో ఉంటే క్రెడిట్‌ లైన్‌లో నగదుగానే చేతిలో ఉంటుంది. ఒకసారి కొంత మొత్తంలో రుణం మంజూరైతే దాన్ని ఏకమొత్తంగా తీసుకోవచ్చు/అవసరానికి ఎంత కావాలంటే అంత తీసుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకే ఉంటుంది. తిరిగి చెల్లింపు విషయంలోనూ దీనికి వెసులుబాటు ఉంటుం ది. కస్టమర్లు తమకు అనుకూలమైన పే మెంట్‌ షెడ్యూల్‌ను ఎంచుకోవచ్చు. ఎంత మొత్తం ఉపయోగించుకుంటే అంత మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్‌ రుణంతో పోల్చితే వడ్డీ భారం తక్కువ ఉంటుంది. ఈంఐలు చెల్లించిన కొద్ది ఖాతాలో అందుబాటులో ఉండే సొమ్ము ఆ మేరకు పెరుగుతుంది.
 
షరతులేవీ ఉండవు
ఒకసారి క్రెడిట్‌లైన్‌ నిర్ణయం అయితే అది ఎంతకాలంపాటు ఉంచుకోవచ్చు అనేందుకు ఎలాంటి షరతు ఉండదు. వినియోగించుకోని సొమ్ముపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఎంతకాలంపాటైనా దాన్ని కొనసాగించుకోవచ్చు. అలాగే ఒకసారి క్రెడిట్‌ లైన్‌ మంజూరైతే భవిష్యత్తులో తీసుకునే క్రెడిట్‌ లైన్‌కు ప్రాసెసింగ్‌ ప్రక్రియ ఏమీ ఉండదు. ఇంటి మెరుగులకు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రక్షణ, ఆరోగ్య ఎమర్జెన్సీలు, ఆకస్మికంగా ఎదురయ్యే ఖర్చులు, సాధారణ ఆదాయానికి మద్దతుగా వినియోగించుకునేందుకు క్రెడిట్‌ లైన్‌ పొందవచ్చు. అలాగే దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న విడిది ప్రదేశాల్లో పర్యటించేందుకు, పెట్టుబడులు/పండగ సీజన్‌లో షాపింగ్‌ అవసరాలకు క్రెడిట్‌ లైన్‌ ఉపయోగించుకోవచ్చు.
ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం పర్సనల్‌ లోన్‌, లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ రెండింటిలో దేనికైనా మౌలిక ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరం. ప్రప్రథమంగా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించేయాలి. దరఖాస్తు చేసుకునే ముందే తమ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా తమ అవసరాలేమిటో ఒక అంచనాకు వచ్చి అంత మొత్తానికి దరఖాస్తు చేయడం మంచిది. సాధారణంగా ఇక్కడే చాలా మంది తప్పటడుగు వేస్తారు. హడావుడిగా దరఖాస్తు చేసేస్తారు. కానీ ఆ తర్వాతే అది స్వల్పకాలిక అవసరం అని గుర్తిస్తారు. కానీ అప్పటికే రుణానికి దరఖాస్తు చేసి ఉండడం వల్ల లేదా రుణం తీసుకుని ఉండడం వల్ల వారిపై దీర్ఘకాలిక భారం పడుతుంది. ఒకవేళ అవసరం తీరిందనుకుని ఆ సొమ్ము ఏకమొత్తంలో తిరిగి చెల్లిస్తే ముందస్తు చెల్లింపు జరిమానాల భారం భరించక తప్పదు.
 
పర్సనల్‌ లోన్‌
నిర్దిష్ట కాలపరిమితికి నిర్దేశిత వడ్డీ రేటుతో ఏక మొత్తంలో సొమ్ము అందిం చే సాధనం ఇది. స్వల్పకాలిక రుణాలు తీర్చి వడ్డీల భారం తగ్గించుకునేందుకు, కొన్ని రకాల కొనుగోళ్లు, వ్యయాలకు అవసరం అయిన సొమ్ము సమకూర్చుకునేందుకు, ఇంట్లో ప్రధాన వేడుకల వ్యయాలు భరించేందుకు, విద్యారుణాల చెల్లింపునకు మనం పర్సనల్‌ లోన్‌ తీసుకుంటూ ఉంటాం. పర్సనల్‌ లోన్‌ కనిపించడానికి ఎంతో అనుకూలం అనిపించినా దానితో ముడిపడి ఉన్న ఇబ్బందులు కూడా ఉన్నా యి. అది మనకి ఆర్హత ఎంత ఉంటే అంత సొమ్ము ఏకమొత్తంలోనే అందిస్తారు. దానికి వడ్డీరేటు కూడా సాధారణ రుణాల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది.
 
మొదటి నుంచి చివరి వరకు కూడా వడ్డీరేటు ఒకేలా ఉంటుంది. తిరిగి చెల్లించే షెడ్యూల్‌ పరిమితంగానే ఉంటుంది. ఈంఐ ఒక్క నెల సరిగ్గా చెల్లించకపోయినా రుణం తీసుకున్న వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. పర్సనల్‌ లోన్‌ ఆమోదించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. మొత్తం రుణం చెల్లించి తాజాగా రుణం తీసుకోవాలంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే. రుణం చెల్లింపులో క్రమశిక్షణ పాటించి నిర్ణయించిన గడువులోగానే ఈంఐలన్నీ చెల్లించిన వారికి ఎలాంటి మినహాయింపులు లేదా ప్రోత్సాహకాలు ఉండవు. ప్రతీ దరఖాస్తు సమయంలోనూ చోటు చేసుకునే జాప్యం అత్యవసర సమయాల్లో ఇబ్బందికరంగా మారవచ్చు.