Jan 23 2019 @ 13:37PM

ఎంఎస్ నారాయణ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

  • లెక్చరర్‌ నుంచి నటుడిగా ఎదిగిన...
  • మైలవరపు సూర్యనారాయణ(ఎంఎస్‌)
  • స్వగ్రామం నిడమర్రు
  • నేడు 4వ వర్దంతి
నిడమర్రు: అసలేం జరిగింది.. నాకు తెలియాలి.. తెలిసి తీరాలి.. అంటూ అతడు సినిమాలో సీరియస్‌గా నవ్వించినా.. దూకుడు సినిమాలో ఏరా పులి అంటూ జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఇమిటేట్‌ చేసినా.. రోబోను మళ్లీ చూపించినా.. సింహాలో బాలకృష్ణ క్యారెక్టర్‌ చేసి నవ్వించినా ఆయనకే చెల్లింది. ఇక తాగుబోతు క్యారెక్టర్‌ అంటే ఎంఎస్‌ అనే అంతలా పాపులర్‌ అయిపోయారు. ఎన్నిసార్లు వేసినా ప్రేక్షకులకు బోర్‌ కొట్టేది కాదు.. కడుపుబ్బా నవ్వుకునేవారు.. ఆనందంతో కన్నీళ్లు తెచ్చుకునేవారు. వెండి తెర పై ఆయన వేసిన పంచ్‌ డైలాగులకు పడిపడి నవ్వని వారుండరు.
 
70 సంవత్సరాల తెలుగు సినీ జగత్తులో తాగుబోతు పాత్రలో మరో నటుడిని కూడా ఊహించుకోలేని విధంగా జీవం పోశారు. కేవలం 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించగలిగి.. ఐదు నందులు, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించగలిగిన మన తెలుగోడు మైలవరపు సూర్యనారాయణ..ఎంఎస్‌ నారాయణ. ఆయన ఉంటే చాలు సినిమా మినిమం గ్యారంటీ అనేలా పేరుతెచ్చు కున్నారు. మన జిల్లా నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎంఎస్‌ నాల్గవ వర్దంతిని పురస్క రించుకుని ఆయన కుటుంబ సభ్యులతో ప్రత్యేక కథనం..
 
రచయిత నుంచి నటుడిగా...
1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవి రాజ పినిశెట్టితో రుక్మిణీ సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా ఎం.ధర్మరాజు ఎంఏలో అవకాశం కల్పించారు. పుణ్యభూమి నా దేశం, రుక్మిణి చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో మా నాన్నకు పెళ్లి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు. అందుకే ఆయన పాత్రలు నేటికి సజీవంగా ప్రజల గుండెల్లో ఉన్నాయి.
 
పరుచూరి గోపాలకృష్ణ శిష్యుడు
పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్‌ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు.తన క్లాస్‌మెట్‌ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్లి చేయించడం విశేషం.
 
నాటకాల రాయుడు
తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్‌ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరణిక నాటకాలు వేశారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్‌ఎల్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివి సీమ ప్రజలకు అందించారు.
 
స్వగ్రామం నిడమర్రు అంటే ఎంతో అభిమానం..
మైలవరపు సూర్యనారాయణ స్వగ్రామం నిడమర్రు. మైలవరపు బాపిరాజు, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఏడుగురు మగపిల్లలు. ఎంఎస్‌ నారాయణ రెండో వాడు. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు.తన స్నేహితులు, సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎపుడూ చెపుతుండేవారు. నిడమర్రు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు.అంతలోనే నాలుగేళ్ల కిందట మన జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
 
అన్నయ్య అంటే ఇష్టం : లాలయ్య
అన్నయ్య అంటే చాలా ఇష్టం. పత్తేపురంలో భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు ప్రతీ రోజు భోజనం తీసుకెళ్లేవాడిని . సినిమా కథలు రాసి పేరుతెచ్చుకోవాలనే ఆయన కోరిక ఒక నటుడిగా నెరవేరింది.
 
తమ్ముడిని మరువలేను : పోతురాజు
మా తమ్ముడు ఎంఎస్‌ది కష్టపడే తత్వం. వ్యవసాయ పనుల్లో ఆసక్తిగా పాల్గొనేవాడు. ఎంఎస్‌ మా సోదరుడు అని చెప్పుకోవడం మాకు ఎంతో గర్వకారణం. తమ్ముడిని మరవలేను.