Dec 24 2014 @ 15:27PM

'ముకుంద'

ఈ యేడాది మెగాభిమానులకు పండగే పండగ! మొన్న చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ 'పిల్లా నువ్వులేని జీవితం'తో ఎంట్రీ ఇస్తే... ఇవాళ నాగబాబు తనయుడు వరుణ్ తేజ 'ముకుంద'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సంక్రాంతి పండగను మెగాభిమానులు మూడు వారాల ముందే జరుపుకునే అవకాశాన్ని వరుణ్ తేజ ఇచ్చాడో లేదో తెలుసుకుందాం.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'కొత్త బంగారులోకం', మలి చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చూసిన వాళ్ళకు ఆయనేమిటో అర్థమౌతుంది. నటీనటులకు ఉన్న ఇమేజ్ ను పట్టించుకోకుండా తాను రూపొందించిన పాత్రల్లోకి వాళ్ళను పరకాయ ప్రవేశం చేయించడానికి అతనెంత తాపత్రయపడతాడో ఆ రెండు సినిమాల్లోనూ చూశాం. శ్రీకాంత్ అడ్డాల మూడో చిత్రం 'ముకుంద'లోనూ అదే మనకు కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోను ఇంట్రడ్యూస్ చేస్తున్నాననే అంశాన్ని పక్కన పెట్టి, తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు శ్రీకాంత్ అడ్డాల.
ఇక కథ విషయానికి వస్తే... ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, రాజకీయ ఎత్తుగడలతోనూ, కులం బలంతోనూ రెండు దశాబ్దాలకు పైగా మున్సిపల్ ఛైర్మన్ గా నెగ్గుకొచ్చేస్తాడు రావు రమేశ్. అడ్డు వచ్చిన వాళ్ళను నిర్ధాక్షిణ్యంగా తొలగించేస్తూ తన పట్టణంలో ఏక ఛత్రాధిపత్యం వహిస్తూ ఉంటాడు. కంసుడి లాంటి ఈ నిరంకుశుడి జీవితంలోకి ముకుంద (వరుణ్ తేజ్) అడుగుపెడతాడు. అదీ విచిత్రంగా జరుగుతుంది. ముకుంద స్నేహితుడు అర్జున్... రావు రమేశ్ తమ్ముడి కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయీ అర్జున్ ను ఇష్టపడుతుంది. ఇది పెద్దవాళ్ళకి కంటగింపుగా మారుతుంది. అర్జున్ పై వేటు వేయాలని చూసిన ప్రతిసారి కృష్ణ పరమాత్మ మాదిరి ముకుంద అతనికి అండగా నిలుస్తాడు. దాంతో రావు రమేశ్ టార్గెట్ ముకుంద అవుతాడు. అదే సమయంలో ఊహించని విధంగా రావు రమేశ్ కూతురు, ముకుంద తారసపడతారు. తొలిచూపులోనే ఒకరిని చూసి ఒకరు ఇష్టపడతారు. దాంతో రావు రమేశ్ పరిస్థితి పేనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇంతలో మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తాయి. కాలేజీ కుర్రాళ్ళను ఎంత సముదాయించాలని చూసినా వాళ్ళు మాట వినకపోగా, ప్రకాశ్ రాజ్ ను రావు రమేశ్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబెడతారు. దీనంతటికి సారధి ముకుంద అనే విషయం రావు రమేశ్ కు తెలుస్తుంది. ఓ పక్క రాజకీయంగా, మరో పక్క కుటుంబపరంగా తనను ఎదురుదెబ్బ కొట్టబోతున్న ముకుందకు రావు రమేశ్ ముకుతాడు వేయగలిగాడా? స్నేహితుడు అర్జున్ ను అరివర్గం నుండి ముకుంద రక్షించగలిగాడా? తన మాట నమ్మి ఎన్నికల్లో నిలిచిన ప్రకాశ్ రాజ్ ను గెలిపించుకున్నాడా? అన్నది మిగతా కథ.

ఓ మామూలు కథను ఆసక్తికరంగా ఎలా చూపించాలి అనే దానికి 'ముకుంద'ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 'ఈ సినిమాకు కథేం అనుకోలేదు' అని ప్రారంభంలోనే దర్శకుడు మనకు చెప్పేస్తాడు. అయితే... తాను చూపించాలనుకున్న సన్నివేశాలను ఆసక్తికరంగా తెర మీద ప్రెజెంట్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. మర్డర్ చేశానంటూ హీరోతో సరదాగా చెప్పించడం, అది వాస్తవమేనంటూ ఇంటర్వెల్ లో చూపించడం, ఆ పైన దానికి సహేతుక కారణాలు వివరించడం... అంతా పకడ్బందీగా ఉంది. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ఆ చిక్కుముడిని విడగొట్టడంలోనే ప్రేక్షకుడి మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది.

పట్టణాల్లో నివసించే కుర్రాళ్ళలో ఉండే తెగువ, పొగరు, నిర్లక్ష్యం, నిజాయితీ, అమాయకత్వం, బలహీనతలు అన్నీంటినీ ముకుంద స్నేహితుల్లో చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. అంతేకాదు... రాజకీయ నాయకుల నైజాన్ని, పదవి పట్ల వాళ్ళ కుండే వ్యామోహాన్ని కూడా అదే స్థాయిలో చూపించాడు. ఇలాంటి కథను, పాత్రలను తయారు చేసుకోవడం ఓకే కానీ వాటిని పండించే నటులు దొరికితేనే శ్రమకు తగ్గ ఫలితం దక్కేది. అది రావు రమేశ్ రూపంలో శ్రీకాంత్ అడ్డాలకు దక్కింది. మున్పిపల్ ఛైర్మన్ గా రావు రమేశ్ అద్భుతంగా నటించాడు. డైలాగ్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ చక్కగా కుదిరాయి. ఆ పాత్రకు దర్శకుడు రాసిన సంభాషణలూ బాగా పేలాయి.

వరుణ్ తేజ విషయానికి వస్తే... తొలి చిత్రమే అయినా... ఎక్కడా ఆ కొత్తదనం కనిపించదు. నటనలో మంచి ఈజ్ ఉంది. అతనిలోని ఇతర కోణాలను తెర మీద ఆవిష్కరించాలనే ప్రయత్నంలో కావలసినదానికంటే ఎక్కువ మోతాదులో యాక్షన్ సన్నివేశాలను పెట్టారు. అలానే ఒకటి రెండు పాటలూ అసందర్భంగానే వచ్చాయి. ఈ విషయంలో శ్రీకాంత్ అడ్డాల రాజీ పడినట్టుగా కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ క్యారెక్టరైజేషన్ మీద మరి కాస్త హోమ్ వర్క్ చేయాల్సింది. కొన్ని పాత్రలకు పేర్లు పెట్టకుండానే దర్శకుడు నెట్టుకొచ్చేశాడు. ప్రధాన పాత్రలకే ఇలా చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ పాత్రలకు పేర్లే ఉండవు. ఎలక్షన్ ప్రచారం జరిగిన క్రమంలో కూడా గుర్తులను హైలైట్ చేశారు తప్పితే... వారి పేర్లను కాదు. ఏ పేరు పెడితే ఎవరితో తంట వస్తుందో అని తెలివిగా వ్యహరించారని పిస్తుంది. (ఇటీవల వచ్చిన ఓ సినిమా విషయంలో అలానే జరిగింది. పోస్టర్ల మీద కనిపించే పేరు ఒకటి. సినిమాలో వినిపించే పేరు మరొకటి. రాజకీయ నేపథ్య చిత్రాలలో సెన్సార్ పరంగానూ, సామాజిక వర్గపరంగానూ తిప్పలు తప్పవు కాబట్టి పేర్లే లేకుండా అతి జాగ్రత్త పడ్డాడు శ్రీకాంత్ అడ్డాల). హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే చూడ ముచ్చటగా ఉంది. తెలుగు సినిమాల్లో కథానాయికలను ఈ తరహాలో చూసి చాలా కాలమైంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో సైతం హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా చూపిస్తున్నఈ రోజుల్లో దర్శకుడు చక్కని విచక్షణ పాటించాడు. సీతారామశాస్త్రి సాహిత్యం అర్థవంతంగా, ఆలోచింపచేస్తుంది. ముఖ్యంగా తొలి పాట! మిక్కీ జె మేయర్ బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. చివరలో శేఖర్ కమ్ముల ఎంట్రీ ఓ కొసమెరుపు.

'ముకుంద' అనగానే ఇదేదో శ్రీకృష్ణ ప్రేమాయణం అనుకునో; మెగాఫ్యామిలీ హీరో ఫస్ట్ మూవీ కాబట్టి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ అనో థియేటర్లకు వస్తే నిరాశకు గురవుతారు. ఇది శ్రీకాంత్ అడ్డాల మార్కు సినిమా! ఆ స్పృహతో 'ముకుంద'కు వస్తే... ఈ గోపికా లోలుడు మీకు నచ్చుతాడు. నిజానికి కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సినిమాలు చేయడం అనేది తెలివైన నిర్ణయం. అన్ని వర్గాలను రీచ్ అయ్యే అవకాశం ఇలాంటి చిత్రాలకే ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న వరుణ్ తేజ ను, ఇలాంటి సినిమా తీయడానికి శ్రీకాంత్ అడ్డాలను ప్రోత్సహించిన చిత్ర సమర్పకుడు 'ఠాగూర్' మధును, నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)ని అభినందించాలి.

3/5