Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 24 Dec 2018 03:26:04 IST

పాయింట్లు.. పనిష్మెంట్లు!

పాయింట్లు.. పనిష్మెంట్లు!

  • చిన్న తప్పునకు రెండు పాయింట్లు
  • అవి 36 దాటితే ఉద్యోగం పోయినట్టే
  • సిబ్బందిని వణికిస్తున్న ఆర్టీసీ విధానం
  • డ్యామేజీ 25 వేలైనా డ్రైవరే భరించాలి
  • బ్రేక్‌ డౌన్‌ అయితే మెకానిక్‌కి దండన
  • రూ.10 తేడా వచ్చినా కండక్టర్‌ ఇంటికే..
‘‘ఎవరో చిల్లర మరిచిపోయారు. పది రూపాయలు బ్యాగులో ఎక్కువ ఉంది. రెండు పాయింట్లు పడ్డాయి’’ ఒక ఆర్టీసీ కండక్టర్‌ ఆవేదన. ‘‘నీది పది రూపాయలే. నా పరిస్థితి మరీ అన్యాయం. రోడ్డు బాగలేక టైరు పగిలింది. పన్నెండు వేలు నా జీతం నుంచి రికవరీ చేస్తున్నారు’’ మరో డ్రైవర్‌ గోడు. ‘‘నేను రోజుకు పది లక్షల పైనే క్యాష్‌ లెక్క పెడుతుంటా. పొరపాటున రూ.500 నోటు తేడా వచ్చింది. పది రెట్లు (5వేలు) ఫైన్‌ చెల్లించాల్సిందే అంటున్నారు’’ బస్‌ డిపోలో క్యాషియర్‌ నిట్టూర్పు. ‘‘నా గ్యారేజీలో అందరూ అవుట్‌ సోర్సింగే. బయట ఎక్కడ బస్సు ఆగిపోయినా నాదే బాధ్యత అంటున్నారు. రోడ్డు లోపమా? స్పేర్‌ పార్ట్‌ నాసిరకమా? సిబ్బంది లేకపోవడమా? అనేది చూడకుండా నన్ను బలిపశువు చేస్తున్నారు’’ ఇది ఒక మెకానిక్‌ ఆందోళన.
 
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఈ నలుగురే కాదు... సెక్యూరిటీ సిబ్బంది నుంచి కార్యాలయంలో క్లర్కుల వరకూ ఆర్టీసీలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పు చిన్నదే.. పాయింట్లు రెండే కదా అనుకుంటే చివరకు అదే కొంప ముంచేలా ఉందని వాపోతున్నారు. ఏ క్షణం ఎవరికి ముప్పు వస్తుందోననే ఆందోళనతో మనశ్శాంతికి
దూరమయ్యారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకొంటూ డ్యూటీలు చేయలేక, ఉద్యోగం వదులుకోలేక బిక్కు బిక్కు మంటున్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కానే కాదని పదే పదే యాజమాన్యం చెబుతోంది. పైగా ఆక్యుపెన్సీ రేషియో 68శాతం నుంచి 82శాతానికి పెంచడంలో కార్మికుల శ్రమ కీలకమని అంటున్నది.
 
అలాంటప్పుడు తమను ఈ స్థాయిలో ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని వాపోతున్నారు. నష్టాల పేరుతో సిబ్బందిని కుదిస్తూ, అవుట్‌ సోర్సింగ్‌పై ఆధారపడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకూడదంటే ఎలాగని నిలదీస్తున్నారు. అనారోగ్యంతో డ్యూటీకి రాకపోతే రెడ్‌ మార్క్‌ వేస్తున్న యాజమాన్యం, తానే సిఫారసు చేసిన ప్రభుత్వ వైద్యుడి నుంచి సర్టిఫికెట్‌ తీసుకొస్తే తిరస్కరించడం ఎంత వరకూ సబబని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ డిస్పెన్సరీలు లేని చోట ప్రభుత్వ డాక్టర్‌ ఇచ్చే సర్టిఫికెట్‌ చెల్లదనడమంటే ఉద్దేశపూర్వకంగా కార్మికులను వదిలించుకునేలా యాజమాన్యం తీరు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఒకప్పుడు డీజీఎం, ఆర్‌ఎం, ఈడీలకు అప్పీలు అవకాశం ఉండేది. కార్మికుడి వేజ్‌ నుంచి తగ్గించే అధికారం ఎవ్వరికీ లేదు. అయినా పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌లో ఏదైనా చిన్న డ్యామేజీ అయితే పాతిక వేల రూపాయలైనా డ్రైవర్‌ భరించాల్సిందే. ఎంటీడబ్ల్యూ యాక్టులో ఎక్కడైనా ఇలా ఉందా.? అని కార్మికులు అడుగుతున్న ప్రశ్నలకు యాజమాన్యం వద్ద సమాధానమే లేదు.
 
మెకానిక్‌ల మెడపై కత్తి
కార్మికులకు ఫిజికల్‌ ఒత్తిడి తక్కువగా ఉండే టెక్నాలజీ అన్ని ప్రైవేటు గ్యారీజీల్లోనూ ఉంటుందని, ఇక్కడ అలాంటివేవీ కనిపించవు. అయినా, ఉన్నంతలోనే సర్దుకొని మెకానికల్‌ సిబ్బంది పని చేస్తున్నారు. అలాంటి తమ తలపై కత్తి వేలాడదీయడం న్యాయమా అని మెకానిక్‌లు అడుగుతున్నారు.
యాజమాన్యం మెకానికల్‌ సిబ్బందిని తగ్గించేసి, శ్రామికులను అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా తెచ్చుకొంటున్నది. ఇప్పుడు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఒక రోజు వస్తే మరో రెండు రోజులు రావడంలేదు. అప్పుడు ఎవరు ఆ పని చేస్తారనేది మెకానిక్‌ల వాదన.
 
గార్డుల గోడు
వంద బస్సులున్న డిపోలో కనీసం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. డిపోలో వంద బస్సులు చెక్‌ చేయాలి, గ్యారేజీలో పెట్రోలింగ్‌, రిజిస్టర్‌ మెయింటేన్‌ చేయాలి. ఇంత పనిని సెక్యూరిటీగార్డులు చేయాలి. ఈ విషయాలన్నీ యాజమాన్యానికి తెలుసు. అయినా, రాష్ట్ర వ్యాప్తంగా 250మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించింది. పన్నెండు వేలు జీతం ఉన్నప్పుడు హోంగార్డులు బస్టాండ్లలో ఉండేవారు. ఇటీవల ప్రభుత్వం వారికి వేతనాలు పెంచడంతో అందర్నీ తిరిగి పంపేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్ర పని భారం పడింది. ఎవరైనా రాకుంటే డబుల్‌ డ్యూటీ చేయాల్సిందే. డ్యూటీ ముగిసింది కదా అని ఇంటికి వెళ్లడానికి కుదరదు.
 
15 మందికి ఒక ప్రింటర్‌..
వీళ్లే కాదు పర్సనల్‌ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్న వాళ్లూ ఒత్తిడిని అనుభవిస్తున్నారు. తిరుపతి రీజినల్‌ ఆఫీ్‌సలో 15మంది క్లర్క్‌లకు ఒక్క ప్రింటర్‌ ఉంది. కనీస సౌకర్యాలుండవు. పని ఆలస్యమైతే పాయింట్లు వేస్తారు. అవి పెరిగితే ఉద్యోగం నుంతి తొలగించేస్తారు. ఆర్టీసీ సిబ్బందికి వైద్యం చేసే డాక్టర్లు కూడా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే. దీంతో తమకు ముళ్లబాటపై నడుస్తూ ఉద్యోగం చేస్తున్నట్లుందని ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది వాపోతున్నారు.
 
మెమోల్లేవు.. పాయింట్లూ వద్దా? : యాజమాన్యం
‘‘కార్మికులు తప్పు చేస్తే చార్జి మెమోలు ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ తీసేశాం. ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కల్పించాం. పాయింట్ల విధానం కూడా వద్దంటే ఎలా? ఏ తప్పూ చేయకపోతే పాయింట్ల గురించి ఆందోళన ఎందుకు?’’ అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.