Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 24 Dec 2018 02:59:12 IST

కేంద్రం ద్రోహంపై.. 1న భారీ నిరసన

కేంద్రం ద్రోహంపై.. 1న భారీ నిరసన

  • సంబరాలు మాని ప్రదర్శనలు
  • జన జాగృతి కోసం ర్యాలీలు
  • పల్లెపల్లెలో కదం తొక్కాలి
  • గుంటూరు జిల్లాలో సీఎం ర్యాలీ
  • 15-20 కి.మీ. మేర ప్రదర్శన
  •  ప్రజలకు చంద్రబాబు పిలుపు
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం, ద్రోహానికి వ్యతిరేకంగా నూతన సంవత్సరం తొలిరోజున రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున నిరసన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రజలను జాగృతం చేయడం కోసం ఆ రోజు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించాలని పిలుపిచ్చారు. ‘కొత్త సంవత్సరం తొలిరోజు సంబరాలు చేసుకుంటాం.. అయితే వాటి బదులు మనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాలి. మన ఐక్యతను చాటాలి. రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు నిరసన ప్రదర్శనలు జరగాలి. ప్రతి పల్లెలోనూ జనం కదం తొక్కాలి. ఆ రోజు ఎవరికి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో 2-3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీలు చేయాలి’ అని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా ప్రజల్లో చైతన్యం రావాలని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా ఆ రోజు నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మీదుగా 15-20 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరుపుతారని సమాచారం. పార్టీపరంగా అని కాకుండా.. ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు చేయాలని చంద్రబాబు కోరారు. ‘ఒకరు నడుస్తూ వెళ్తుంటే కలిసొచ్చేవాళ్లు కలిసొస్తూ ఉంటారు. అదో  ప్రవాహంలా మారుతుంది. జనాలను రాజకీయంగా తీసుకొచ్చి చేసే పనికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా స్వచ్ఛందంగా అంతా కలిసిరావాలి. ఎవరికి వీలున్నచోట్ల వారు చేయాలి. ఓ 20 మందీ మొదలుపెడితే.. అలా నిరసన ర్యాలీ సాగుతుండగా మధ్యలో అనేకమంది స్వచ్ఛందంగా కలుస్తారు. చివరకు వెళ్లేసరికి భారీ ర్యాలీగా మారుతుంది. అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటే మళ్లీ అదే చేస్తారు. మోసం చేసినా మౌనంగా ఉంటే బలహీనత అనుకుంటారు. మళ్లీ అదేపని చేస్తారు. మోసం చేసినవాళ్లను నిలదీయాలి. అప్పుడే భయం ఉంటుంది’ అని చంద్రబాబు పార్టీ నేతలు, మీడియాతో వ్యాఖ్యానించారు.
 
సంబరాలు మానుకుని...నిరసనలు
రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం, ఇతర హామీల అమలు కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకే నూతన సంవత్సరం మొదటిరోజును ఎంచుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సంబరాలు మానుకుని..రాష్ట్రం కోసం ప్రజలు చైతన్యంగా ఉన్నారని నిరూపించే కార్యక్రమంగా ఇది మారాలని ఆకాంక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ నిరసన ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి జనవరి 6న రాష్ట్రానికి వస్తున్నారని.. ఆ రోజు కూడా ఏవైనా నిరసన ర్యాలీలు, వ్యతిరేక ధర్నాలకు పిలుపిస్తారా అని ప్రశ్నించగా.. సభలు అడ్డుకోవడాలు, హింస, గొడవలు సృష్టించడం కాదు.. ఏదైనా ప్రజాస్వామిక పద్ధతిలోనే జరగాలని ఆయన బదులిచ్చారు. భారీ చైతన్యానికి ఈ నిరసన ర్యాలీలు సంకేతంగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రజలు తెలివైనవారని, అమాయకులు కాదని, ఏం చేయాలో వారికి తెలుసని వ్యాఖ్యానించారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.