desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 22 2018 @ 03:13AM

ధర్మో రక్షతి రక్షితః

ధర్మం.. ఇది కేవలం రెండక్షరాల పదం కాదు! ముక్కోటి దేవతలూ అనుక్షణం శ్వాసించే అద్భుతం. ముల్లోకవాసుల్నీ శాసించే అక్షర సమూహం. ధారణాద్ధర్మమిత్యాహుః.. అని వ్యాసోక్తి. ధరించునది కావున ధర్మం అనబడిందని దీని అర్థం. ధర్మమే ప్రజలను, ప్రపంచాన్ని ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని చక్కని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం.
 
ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌
 
..అని మనుస్మృతి చెబుతోంది. ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.. అంతరార్థం.. పరమార్థం.
 
ధర్మా బహువిధా లోకే శ్రుతి భేదముఖోద్భవాః
దేశధర్మాశ్చ దృశ్యంతే కులధర్మాస్తథైవచ
 
అని మహాభాష్యోక్తి. అంటే.. లోకంలో ధర్మాలు బహువిధాలుగా ఉన్నాయి. విధానాలు అనేకంగా ఉండటమే ఇందుకు కారణం. దేశ ధర్మం, కుల ధర్మం, జాతి ధర్మం, వయో ధర్మం, శరీర ధర్మం, కాల ధర్మం, ఆపద్ధర్మం.. ఇలా ఎన్నో ఉన్నాయి. లోకులు అనేక ధర్మాల్ని స్థాపించుకుని వాటిని అనుసరిస్తుంటారు. మానవుడు తనకున్నదానిలో తృప్తిపడటంలో ధర్మబద్ధమైన సుఖముందని హిందీ కవి రహీమ్‌ ఇలా చెబుతారు..
గోధన్‌, గజ్‌ధన్‌, వాజిధన్‌, జార్‌రతన్‌ ఖాన్‌, జబ్‌ ఆలై సంతోష ధన్‌, సభ్‌ధన్‌ ధూరి సమాన్‌. ఆవులు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు ఇలా ఎంత సంపద ఉన్నా తృప్తి అనే ధర్మధనం ముందు అవన్నీ దిగదుడుపే అని దీని అర్థం. సకల వేదాంత సారమే ధర్మ స్వరూపం. ఏకోదేవః సర్వభూతేషు గూఢః.. అందరిలో నిక్షిప్తమై ఉన్నది ఒకే పరబ్రహ్మ అనే వాస్తవాన్ని విస్మరించకూడదంటుంది ధర్మశాస్త్రం. సకల జీవుల పట్ల అటువంటి సమరసభావం అలవడటం ఒకింత కష్టసాధ్యమే. అయితే, అటువంటి కరుణమైత్రీ భావం వ్లలనే ధర్మం సిద్ధిస్తుంది. ధర్మసాధన బాహ్యమైన పని కాదు. అది భావప్రధానమైన ఆంతరంగిక శోధన. మనసు మేలుకొని ఉన్నంతకాలం ప్రతి ఆలోచనలో ధార్మిక భావసరళి కదలాలి. ప్రతి క్రియా పారమార్థిక, ధార్మిక పరిమళాలతో గుబాళించాలి. కానీ..
 
మత్తః ప్రమత్తశ్చోన్మత్తః శ్రాంతః క్రోధీ బుభుక్షితః
లుబోభీరుః త్వరా యుక్తః కాముకశ్చ న ధర్మవిత్‌
 
..మత్తుడు, ప్రమత్తుడు, ఉన్మత్తుడు, అలసిపోయినవాడు, క్రోధనుడు, ఆకలితో ఉన్నవాడు, లోభి, పిరికివాడు, తొందరపడేవాడు, కాముకుడు.. వీరు ధర్మాన్ని గుర్తించలేక అధర్మవర్తనులై లోకంలో సంచరిస్తూ ఉంటారు. అలాంటివారి దుశ్చర్యలు, దుష్కృత్యాలు పెచ్చుమీరి ధర్మానికి హాని కలిగినప్పుడు.. సాధుసజ్జనులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని గీతాచార్యుడు హామీ ఇచ్చాడు.
-ఎస్‌.ఆర్‌.భల్లం, 9885442642