
పేదింటి బిడ్డకు పెద్దజబ్బు
అప్లాస్టిక్ అనీమియాతో నరకయాతన
ప్రపంచంలో అతి కొద్ది మందికి వచ్చే వ్యాధి
రక్తంలో మూలకణాలను ఎక్కించేందుకు రూ. 25లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు
అంత మొత్తం లేక తల్లిదండ్రుల కన్నీరు
దాతల సాయం కోసం అభ్యర్థన
కారంచేడు (పర్చూరు), ప్రకాశం జిల్లా : చదువులో రాణిస్తున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆర్థిక స్థోమత లేకపోయినా కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అతను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 461/470 మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచాడు. అంతలోనే విధి వక్రించింది. ఆ విద్యార్థి అరుదైన అప్లాస్టిక్ అనీమియా బారిన పడ్డాడు. తల్లిదండ్రులు ఉన్న పొలం, బంగారం అమ్మి, ఇల్లు తాకట్టు పెట్టి రూ. 12 లక్షల వరకూ ఖర్చు చేసినా నయం కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో అతను మృత్యువుతో పోరాడుతున్నాడు. వ్యాధి నయం చేసేందుకు రూ. 25లక్షల ఖర్చవుతుందని వైద్యులు చెప్తుండగా, అంత డబ్బు తమ వద్ద లేక.. కళ్లెదుటే ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డను కాపాడుకోలేక కుమిలిపోతున్నారు. ఆర్థిక సాయం కోసం అర్థిస్తున్నారు.
పర్చూరు మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన జరుగుమల్లి రంగయ్య, అంజమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. క్షౌరవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రంగయ్య.. కుమారుడు రాజేష్‌బాబు చదువులో రాణిస్తుండటంతో ఆర్థిక స్థోమత లేకపోయినా కార్పొరేట్ కళాశాలలో చేర్పించాడు. ఇంటర్ ప్రథమ సంత్సరంలో రాజేష్‌బాబు 461 మార్కులు సాధించాడు. ద్వితీయ సంవత్సరంలో చేరిన మూడు నెలలకే అనారోగ్యానికి గురయ్యాడు.
వైద్య పరీక్షల కోసం రూ. 8లక్షల ఖర్చు
ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రాజేష్‌బాబుకు తల్లిదండ్రులు తొలుత చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికి త్స చేయించారు. ఆ తర్వాత గుంటూరులోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూయించారు. అనేక పరీక్షలు చేసినా వైద్యులు అతనికి వ్యాధి నిర్థారణ చేయలేకపోయారు. చివరికి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ అసలు విషయం బయటపడింది. అతను ప్రపంచంలోనే అతి కొద్ది మందికి వచ్చే అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నట్లు తేలింది. అప్పటికే పరీక్షలు, వైద్యం కోసం తల్లిదండ్రులు రూ. 8 లక్షల వరకూ ఖర్చు చేసి ఉండటం, ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో వైద్యం చేయించలేకపోయారు.
పొలం విక్రయం, ఇల్లు తాకట్టు
బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. ఉన్న అరెకరా పొలం అమ్ముకున్నారు. గ్రామం లో ఉన్న పెంకుటిల్లును రూ. 6లక్షలకు తాకట్టు పెట్టారు. మరికొంత అప్పు కూడా చేశారు. మొత్తం రూ. 12 లక్షలు ఖర్చు చేశారు. అందులో పరీక్షల కోసమే రూ. 8లక్షలు వెచ్చించారు. అయినప్పటికీ రాజేష్‌బాబుకు నయం కాలేదు.
రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం
హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యశాలలో ప్రస్తుతం చికిత్స పొం దుతున్న రాజేష్‌బాబు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. సాధా రణంగా రక్తకణాలు 12 నుంచి 13 రోజులకు ఒకసారి చనిపోవడం, మళ్లీ పుట్టడం జరుగుతుంది. కానీ రాజేష్‌కు మాత్రం మళ్లీ కొత్త క ణాలు ఏర్పడటం లేదు. అవి ఎముకల్లోనే ఆవిరైపోతున్నాయి. దీంతో ఆయన పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఒంటిపై గడ్డలు రావడంతోపాటు, చర్మం పుండులా మారి పోతోంది. నీరసించి అతను పడకపై నుంచి కూడా లేవలేకపోతున్నాడు. అదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.
రూ. 25లక్షలు లేక.. చికిత్స చేయించలేక..
రక్తంలోకి మూలకణాలు ఎక్కిస్తే వ్యాధి నయం అవుతుందని చెప్పిన నిమ్స్ వైద్యులు అందుకు రూ. 25లక్షల ఖర్చవుతుందని తెలిపారు. మూల కణాల మార్పిడి చికిత్స రాష్ట్రంలోనే లేకపోవడంతో తమిళనాడులోని సీఎంసీకి సిఫార్సు చేశారు. దాత్రీ ఫౌండేషన్ నుంచి డోనర్ కూడా దొరికాడు. కానీ చికిత్సకు అవసరమైన రూ. 25లక్షలు తమ వద్ద లేక ఆర్థిక సాయం కోరుతున్నారు. ప్రస్తుతం రాజేష్‌బాబుకు 20 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేస్తున్నారు. అందుకు సహకారం అందిస్తున్న చీరాలలోని కామా క్షికేర్ ఎండీ తాడివలస దేవరాజుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న వారు దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డ చికిత్స కోసం సాయం అందించాలని కోరుతున్నారు.
బతకాలని ఉంది
నాకు బతకాలని ఉంది. కానీ వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నరకయాతన అనుభవిస్తున్నా. మంచం మీద నుంచి కూడా లేవలేకపోతున్నా. దాతలు స్పందించి సాయం అందిస్తే బాగా చదువుకుంటా. ఉద్యోగం సంపాదించి నాలాంటి వారికి సాయం అందిస్తా.
- రాజేష్‌బాబు
రాజేష్‌కు ఆర్ధిక సాయం చేయాలనుకున్న దాతలు
ఆంధ్రాబ్యాంకు (కారంచేడు బ్రాంచ్), అకౌంట్ నెంబరు : 033210100033069, ఐఎఫ్ఎస్సీ నెం.ఏఎన్‌డీబీ 0000332కు నగదు పంపవచ్చు. వివరాలకు సెల్ నెంబర్ : 92473 56545 నంబరును సంప్రదించవచ్చు.