desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Nov 26 2018 @ 02:54AM

సిక్కోలులో ‘కథ 2017’ ఆవిష్కరణ

పాతశ్రీకాకుళం, నవంబరు 25: కథా సాహితీ సభ్యులు, ప్రముఖ రచయిత, వయొలిన్‌ విద్వాంసులు, సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకులు ద్వారం దుర్గాప్రసాదరావు ‘కథ 2017’ పుస్తకాన్ని శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. గ్రాండ్‌హోటల్‌లో ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక (ఉరకవే) ఆధ్వర్యంలో ఆదివారం ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కథానిలయం వ్యవస్థాపకులు కారా (కాళీపట్నం రామారావు) మాస్టారు మాట్లాడుతూ..నాటి పురాణ ఇతిహాసాల కాలం నుంచి, నేటి వరకు గురజాడ, జాషువా, శ్రీశ్రీ వంటి రచయితలే కాకుండా ఆధునిక రచయితలు కూడా కథలు, కవితల్లో సామాజిక అంశాలపై దృష్టి సారిస్తూనే ఉన్నారన్నారు.
 
నేటి యువత కాలక్షేపానికి ఏవో కవితలు రాసి.. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే కన్నా పుస్తకాల రూపంలో ప్రచురించి పది మంది చదివే విధంగా సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ‘కథ-2017’ పుస్తక సంపాదకుడు, హైదరాబాద్‌కు చెందిన కథా సాహితీ సంపాదకులు వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌, మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పలనాయుడు, వాసిరెడ్డి రమేష్‌ మాట్లాడుతూ.. రచయితల కంటే, పాఠకులే నిజమైన సాహిత్యవేత్తలని అభిప్రాయపడ్డారు. దశావతారాలను నేటి మానవ సంబంధాలతో ఎలా అన్వయించుకోవాలో రచయితలకు వారు సూచనలు ఇచ్చారు.