Nov 23 2018 @ 12:34PM

24 కిస్సెస్ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌లు: సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రెస్పెక్ట్ క్రియేష‌న్స్
న‌టీనటులు: ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు
సంగీతం: జోయ్ బారువా
ఛాయాగ్ర‌హ‌ణం: ఉద‌య్ గుర్రాల‌
నేప‌థ్య సంగీతం: వివేక్ పిలిప్‌
కూర్పు: ఆల‌యం అనిల్‌
క‌ళ‌: హ‌రి వ‌ర్మ‌
నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ద‌ర్శ‌క‌త్వం: అయోధ్య‌కుమార్ కృష్ణం శెట్టి
 
ప్రేమ‌క‌థా చిత్రాల‌కు ఆద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంది. అయితే నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లు లిప్ లాక్‌ల ట్రెండ్ నేటి క‌థ‌ల్లో ఎక్కువైయ్యాయి. అలాంటి ముద్దుల పైనే ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందోన‌ని అనుకున్నారేమో కానీ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారి చేసిన సినిమా `24 కిస్సెస్‌`. ఒక‌ట్రెండు ముద్దులుంటేనే ఎలాగో వార్త‌లు వ‌చ్చేస్తుంటాయి. అలాంటిది 24 ముద్దుల‌కు సంబంధించిన సినిమా కావ‌డంతో ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. మ‌రి 24 కిస్సెస్ వెను క‌థేంటో తెలుసుకుందాం......
 
క‌థ‌:
ఆనంద్‌(అరుణ్ అదిత్‌) ఓ చిల్డ్ర‌న్ ఫిలిమ్ మేక‌ర్‌. ఓ కాలేజ్‌లో సినిమాల‌కు సంబంధించిన కోర్సు చ‌దువుతున్న విద్యార్థులకు పాఠాలు చెప్ప‌డానికి మెంట‌ర్‌గా వెళ‌తాడు. ద‌ర్శ‌కుడిగా త‌ను చేసే సినిమాల‌న్నీ పిల్ల‌ల‌కు సంబంధించిన‌వే కావు. స్ట్రీట్ చిల్డ్ర‌న్ క‌ష్టాలు గురించి ఎక్కువ బాధ‌ప‌డే క్యారెక్ట‌ర్ ఆనంద్‌ది. త‌న‌లోని మాన‌వ‌త్వం చూసి శ్రీల‌క్ష్మి(హెబ్బా ప‌టేల్‌) త‌న‌ను ప్రేమిస్తుంది. అనుకోకుండా ఓ సంద‌ర్భంలో ఆనంద్‌, శ్రీలక్ష్మిని త‌ల‌పై ముద్దు పెట్టుకుంటాడు. అస‌లు ఆనంద్ త‌ల‌పై ముద్దు ఎందుకు పెట్టాడ‌నే విష‌యాన్ని ఇంట‌ర్నెట్‌లో చూసిన‌ప్పుడు శ్రీల‌క్ష్మికి 24 ముద్దులు గురించి ఓ విష‌యం తెలుస్తుంది. 24 ముద్దులు పెట్టుకున్న జంట విడిపోద‌నే విష‌యం కూడా ఆమెకు తెలుస్తుంది. వివిధ సంద‌ర్భాల్లో ఆనంద్‌, శ్రీల‌క్ష్మి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. 13 ముద్దులు పూర్త‌యిన త‌ర్వాత ఆనంద్‌కు త‌న‌ను ప్రేమించ‌డం లేద‌నే విష‌యం తెలిసి అత‌నితో గొడ‌వ‌ప‌డి వెళ్లిపోతుంది. మ‌ళ్లీ క‌లుసుకుంటారు. 23 ముద్దుల త‌ర్వాత అస‌లు ఆనంద్‌కు పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేద‌నే విష‌యం తెలుస్తుంది. అంతే కాకుండా అప్ప‌టికే త‌న‌కు ఇద్ద‌రు, ముగ్గురితో శారీర‌క సంబంధాలున్నాయ‌ని తెలుసుకుని గొడ‌వ‌ప‌డి త‌న‌ను ఎప్పుడూ క‌ల‌వొద్ద‌ని వెళ్లిపోతుంది. అస‌లు ఆనంద్‌కు పెళ్లంటే ఎందుకు ఇష్టం ఉండ‌దు? పిల్ల‌ల స‌మ‌స్య‌ల గురించి బాధ‌ప‌డే వ్య‌క్తికి పిల్ల‌లంటే ఎందుకు ఇష్టం ఉండ‌దు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణ‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే హీరోగా ఆనంద్ అనే క్యారెక్ట‌ర్‌లో న‌టించిన అదిత్ .. పాత్ర మేర‌కు న్యాయం చేశాడు. అయితే ఇలాంటి సినిమా చేయ‌డం వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే ఉప‌యోగం ఏమీ ఉండ‌దు. ఎందుకంటే క్యారెక్ట‌ర్‌ను మ‌లిచిన తీరు బాగా లేదు. ఇక హెబ్బా ప‌టేల్ ఇందులో ముద్దు సీన్స్‌కు ఏం న‌చ్చి ఒప్పుకుందో తెలియ‌దు. అస‌లు ఇలాంటి సినిమా వ‌ల్ల ఆమె కెరీర్‌కు ఎలా ఉప‌యోగ క‌రంగా ఉంటుందో త‌న‌కే తెలియాలి. హీరోయిన్ తండ్రి పాత్ర‌లో సీనియ‌ర్ న‌రేశ్‌. సైక్రియాటిస్ట్ పాత్ర‌లో రావు ర‌మేశ్‌లు ఉన్నామంటే ఉన్నార‌నేలా న‌టించారు. ఇక సినిమాలో మిగిలిన పాత్ర‌ధారులందరూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే మిణుగురులు వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ఇలాంటి సినిమాను తెరకెక్కించాడా? అనిపిస్తుంది. స‌రే ఇదేమైనా అడ‌ల్ట్ సినిమానా? అంటే అదీ కాదు.. హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుడుతుంది. హీరోకు ప్రేమంటే న‌మ్మ‌కం ఉండ‌దు. అప్ప‌టికే ఇద్ద‌రి ముగ్గురితో సెక్స్ చేసుంటాడు. హీరోయిన్ అంటే ఇష్ట‌మే అంటాడు కానీ.. ప్రేమ లేదంటాడు. కాసేప‌టి హీరోయిన్ ప్రేమ అర్థ‌మైంద‌ని అంటాడు. పెళ్లి వ‌ద్దంటాడు. వీధి బాలల కోసం పోరాడుతాడు. కానీ పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని కందామ‌ని హీర‌యిన్ అంటే ఇష్ట‌ప‌డ‌డు. ఎమ్మార్వోతో పిల్ల‌ల కోసం చేసే పోరాటం చూస్తే సిల్లీగా క‌న‌ప‌డుతుంది. హీరో పిల్ల‌ల్ని వ‌ద్ద‌ని చెప్పే రీజ‌న్ ఇంకా సిల్లీ ఉంది. సినిమాలో హీరోయిన్‌కి అత‌ను త‌ప్ప మ‌రేవ‌రూ న‌చ్చ‌రు. వేరొక‌రితో సెక్స్ చేసిన వ్య‌క్తి ఎలా న‌చ్చుతాడు. స‌రే న‌చ్చాడ‌నే అనుకుందాం.. గొడ‌వ‌ప‌డ్డ త‌ర్వాత హీరోయిన్ .. హీరోతో ముద్దులు పెట్టించుకుంటుంది. మ‌ళ్లీ పెళ్లి, పిల్ల‌లు ఇలా క‌థ‌ను ముందుకు, వెన‌క్కి న‌డిపాడు ద‌ర్శ‌కుడు. దర్శ‌కుడు సన్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా, ఎమోష‌న‌ల్‌గా రాసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. వాట్ ద ఫ‌క్ అని సినిమాల్లో హీరో అంటే ఎంట్రా ఇది అని అనుకుంటుంటా. కానీ ఓ అమ్మాయితో అదే డైలాగ్‌ను సింపుల్‌గా చెప్పించేశాడు ద‌ర్శకుడు. రావు ర‌మేష్ సైక్రియాటిస్ట్ పాత్ర కామెడీగా అనిపిస్తుంది. పది నిమిషాల‌కొక‌సారి రావు ర‌మేశ్ పాత్ర చిరాకు తెప్పిస్తుంటుంది. ఉద‌య్ గుర్రాల కెమెరా ప‌నితనం బావుంది. జోయ్ బారువా పాట‌లు బావున్నాయి. చిత్రీక‌ర‌ణ పాట‌లు, వాటి సాహిత్యాన్ని మ‌రుగున‌ప‌డేసింది. వివేక్ పిలిప్ నేప‌థ్య సంగీతం బావుంది. ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ వీధిబాల‌లు అనే కాన్సెప్ట్ హెంగోవ‌ర్ నుండి బ‌య‌ట‌కు రాలేదు.
 
చివ‌ర‌గా.. 24 కిస్సెస్‌... ముద్దుల్లో చేదు ఎక్కువైంది.
రేటింగ్: 1.5/5