Nov 7 2018 @ 12:47PM

అదుగో మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాణ సంస్థ‌లు: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్‌
తారాగ‌ణం: ర‌విబాబు, అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్‌.కె, వీరేంద‌ర్ చౌద‌రి త‌దిత‌రులు
సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహార్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
క‌థ‌: నారాయ‌ణ రెడ్డి
కూర్పు: బ‌ల్ల స‌త్యనారాయ‌ణ‌
మాట‌లు: ర‌విబాబు, నివాస్‌
క‌థ‌, నిర్మాత‌, ద‌ర్శక‌త్వం: ర‌విబాబు
 
న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తుంటాడు. అల్ల‌రి, అవును, అవును 2, అన‌సూయ‌, అమ‌రావ‌తి, న‌చ్చావులే, నువ్విలా .. ఇలా చాలా సినిమాలను ర‌విబాబు తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలో ర‌విబాబు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రం `అదుగో`. సాధార‌ణంగా ప్రేమ‌క‌థా చిత్రాలు, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ర‌విబాబు అదుగో సినిమా కోసం ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఇంత‌కు ఆ ప్ర‌యోగం ఏమంటారా.. లైవ్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో పందిపిల్ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ధారిగా సినిమా చేయ‌డ‌మే. ఈ సినిమా కోసం దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాల క‌ష్ట‌ప‌డ్డాడు ర‌విబాబు. మ‌రి అదుగో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
క‌థ‌:
ఓ పంది త‌న పిల్ల‌కు క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా స్టార్ట్ అవుతుంది. గ‌న్న‌వ‌రంలోని చంటి.. ఓ పంది పిల్ల పెంచుకుంటూ ఉంటాడు. దానికి బంటి అని పేరు కూడా పెట్టుకుంటాడు. అయితే ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ పంది పిల్ల‌ను ఎత్తుకుని పారిపోతారు. చంటి వారి వెంటే బంటిని వెతుక్కుంటూ వ‌స్తుంటాడు. మ‌రో వైపు సిక్స్ ప్యాక్ శివ‌(ర‌విబాబు), బెజ‌వాడ దుర్గ మ‌ధ్య వెయ్యి ఎక‌రాల‌కు సంబంధించిన డీల్ గొడ‌వ జ‌రుగుతుంటుంది. మ‌రో వైపు గుట్కా వ్యాపారం చేసే గంగరాజుకి , అమ్మాయిల‌ను అక్ర‌మంగా షార్జాకు పంపే శంక‌ర్‌కు మ‌ధ్య ఆధిప‌త్య‌ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. అలాగే అభిషేక్(అభిషేక్ వ‌ర్మ‌)కి ఉద్యోగం చేయ‌డం ఇష్టం ఉండ‌దు. చౌక ధ‌ర‌కు ఓ మొబైల్‌ను త‌యారు చేయాల‌నుకుంటూ ఉంటాడు. అత‌ని ల‌వ‌ర్ రాజి(న‌భా)ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే ఎవ‌రో కొంద‌రు రాజిని కిడ్నాప్ చేస్తారు. అస‌లు వారెంద‌రు రాజిని కిడ్నాప్ చేస్తారు. పైన చెప్పిన మూడు నాలుగు గ్యాంగులు, అభి, రాజి, చంటి, బంటిల‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
 
విశ్లేష‌ణ‌:
ఓ మెయిన్ థ్రెడ్ చుట్టూ కొన్ని గ్యాంగులు వెంట‌ప‌డ‌టం.. అదే మెయిన్ పాయింట్‌కు హీరో, హీరోయిన్‌కి లింకు ఉండ‌టం అంద‌రూ దాని వెంట‌నే ప‌రుగు పెట్ట‌డం చివ‌ర‌కు ఓ శుభం కార్డు ప‌డ‌టం. ఈ క‌థ‌నంతో తెర‌కెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. స్వామి రారా, దొచేయ్, కో అంటే కోటి.. , శ‌మంతక‌మ‌ణి ..ఇలాంటి త‌ర‌హా సినిమాలే. ఇప్పుడు ర‌విబాబు కూడా ఇలాంటి థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌నే తెరకెక్కించాడు. ఆంధ్ర ప్ర‌దేశ్ నుండి విడిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి దాని చుట్టూ ఉన్న ప్ర‌దేశాల్లో భూముల ధ‌ర‌లు అమాంతంగా పెరిగాయి. దాంతో చాలా మంది భూములను క‌బ్జా చేసే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. ఇలాంటి కాన్సెప్ట్‌కు ఓ పందిపిల్ల‌కు లింక్ పెట్టి రవిబాబు క‌థ రాసుకున్నాడు. అలాగే త‌న చిత్రాల్లో చూపించే అడ‌ల్ట్ త‌ర‌హాకామెడీని ఈ సినిమాలో కూడా చొప్పించాడు. పందిపిల్ల చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. హీరో, హీరోయిన్ కూడా అనుకోకుండా పందిపిల్ల‌కు లింక్ ప‌డి ట్రావెల్ అవుతుంటారు. సినిమా ఫ‌స్టాఫ్ ముగియ‌డానికి ముందే క్లైమాక్స్ గురించి ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది. అయితే ర‌విబాబు ఎంత ఆస‌క్తిగా తెర‌కెక్కించాడో అనేదే పాయింట్‌గా మారింది. అయితే చంటి అనే కుర్రాడికి, పంది పిల్ల‌కు మ‌ధ్య ఎమోష‌న‌ల్ క‌నెక్టింగ్ సీన్స్‌ను మ‌రికొన్నింటిని చూపించి ఉంటే బావుండేద‌నిపించింది. ఇక లైవ్ యానిమేష‌న్‌లో చేసిన పందిపిల్ల విన్యాసాలు ఆక‌ట్ట‌కుంటాయి. ప్ర‌శాంత్ విహారి పాట‌లు బాలేదు. ముఖ్యంగా హీరోయిన్ క‌ష్టంలో ఉంటే.. వీడియో చాట్‌లో హీరో సాంగ్ పాడ‌ట‌మేంటో ..ర‌విబాబుకే అర్థం కావాలి. పోనీ హీరోయిన్‌కి హీరో ప్రేమ‌ను ఎమోష‌న‌ల్‌గా చెబుతున్నాడులే అనుకుంటే.. అప్ప‌టికే హీరో, హీరోయిన్ ప్రేమ‌లో మునిగి ఉంటారు. నేప‌థ్య సంగీతం జ‌స్ట్ ఓకే. సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌దు.. ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కాదు.. క‌న్‌ఫ్యూజింగ్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. ర‌విబాబు రెండున్న‌రేళ్లు క‌ష్టం వృథాయేనా అనిపిస్తుంది.
 
చివ‌ర‌గా... అదుగో .. స‌క్సెస్‌కి దూరంగా
రేటింగ్‌: 2/5