Oct 26 2018 @ 03:59AM

మూడింతల దిగుబడినిచ్చే కందులు

  • అభివృద్ధి చేస్తున్న ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు
హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మూడింతల దిగుబడినిచ్చే కంది వంగడాన్ని అభివృద్ధి చేసే కొత్త పరిశోధనలకు ఇక్రిశాట్‌ శ్రీకారం చుట్టింది. కొన్ని అటవీ జాతి వంగడాల్లో వ్యాధులను తట్టుకునే సామర్థ్యం ఉంది. అయితే.. కంది పంటలో అటవీ మొక్కల జన్యువులను జొప్పించడం ద్వారా వ్యాధులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు దిగుబడి మూడింతలు చేసే అవకాశం ఉంది. గ్లోబల్‌ క్రాప్‌ డైవర్సిటీ (జీసీడీటీ) అనే సంస్థ సహకారంతో వినూత్న పరిశోధనలను ఇక్రిశాట్‌ ప్రారంభించింది. ప్రస్తుతం సాగులో ఉన్న కంది రకాల్లో లేని లక్షణాలను ప్రీ బ్రీడింగ్‌ ద్వారా సాఽధించవచ్చని జీసీడీటీ శాస్త్రవేత్త బెంజిమిన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సన్న, చిన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ఆసియా, ఆఫ్రికాలో పోషకాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నూతన వంగడాల రూపకల్పన చేసి రైతులకు చేరవేయటమే ప్రధాన ఉద్దేశమని, అప్పుడే రైతులకు ఎక్కువ దిగుబడి, ఆదాయం వస్తుందని ఇక్రిశాట్‌ రీసెర్చ్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ రాజీవ్‌ కె. వర్షిణి విశ్వాసం వ్యక్తంచేశారు. దీని వల్ల భారత్‌, మయన్మార్‌ దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. డీఏఆర్‌ మయన్మార్‌, జయశంకర్‌ వర్సిటీ, ఎన్‌జీ రంగా వర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌ సంస్థల సహకారంతో ఈ పరిశోధనలను ఇక్రిశాట్‌ చేపడుతోంది.