desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 14 2018 @ 02:17AM

కవిశాబ్దిక కేసరి రఘునాథాచార్యులు ఇకలేరు

  • తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలో కన్నుమూత
  • గొప్ప ఆధ్యాత్మికవేత్త... జీయర్లకే గురువు
  • చినజీయర్‌కు తర్కశాస్త్రం, సంస్కృతం బోధన
  • 90 గ్రంథాల రచన.. సంస్కృతానికి విశేష సేవ
  • 1972లో జాతీయ పురస్కారం.. సీఎం సంతాపం
హన్మకొండ/హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘ఓ పరమాత్మా! నీవే రక్షకుడవు.. అనే భావముతో వచ్చి ఆశ్రయించడమే శరణాగతి. తిరిగి విడిపోని విధముగా గట్టిగా పట్టుకోవటమే దీనిలో గొప్పతనము. ‘నీవే తప్ప నితఃపరంబెరుగ’ అనే మహా విశ్వాసముతో భగవంతుడి రక్షకత్వమునకు లోబడి ఉండడం దీనిలో ముఖ్యమైన అంశం. ద్రౌపది, విభీషణుడు, గజేంద్రుడు మొదలైనవారు శరణాగతి మార్గమును అనుసరించినవారే. ఈ శరణాగతికి ప్రత్యేకమైన నియమములు ఏవీ ఉండవు. పవిత్రమైన పుణ్యక్షేత్రములందో.. గంగ, యమున, గోదావరి వంటి పుణ్యనదుల తీరములలోనో.. శుభప్రదమైన తిథి, వార, నక్షత్రాలు చూసి బ్రహ్మముహర్తాన్ని ఎంచుకోవాల్సిన అవసరమో శరణాగతికి లేదు. స్ర్తీ, పురుష భేదము, బాల వృద్ధాది వయోభేదము, వర్ణ, వర్గ, ప్రాంత భేదము ఉండదు. కొన్ని ఫలితాలను ఆశించి శరణాగతిని కోరాల్సిన అవసరము లేదు’’
 
ఇది.. మహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శాస్త్రరత్నాకర నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారి బోధ! సంస్కృత భాషా సాహిత్య పిపాసి.. వేదవేదాంగాలను జీర్ణం చేసుకొని, జీయర్లకే గురువుగా వెలుగొందిన ద్రష్ట.. తన ఆధ్యాత్మిక ప్రభోదాలు, రచనలతో దశాబ్దాలుగా పండిత, పామరులను ప్రభావితం చేసిన మహానీయుడు.. జీవనపర్యంతం ఆధ్యాత్మికచింతన, భగవత్‌ సేవ, సత్సంప్రదాయ పరిరక్షణలో గడిపిన రుషి రఘునాథాచార్యులు కన్నుమూశారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. వరంగల్‌ శివనగర్‌లోని స్వగృహంలో శనివారం ఉదయం 7:50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
 
రఘునాథాచార్యులకు భార్య సీతమ్మ.. నలుగురు కుమార్తెలు శేషమ్మ, శ్రీదేవి, నీలాదేవి, గోదాదేవి ఉన్నారు. ఆచార్యుల స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడలోని మోటూరు. 1946లో వరంగల్‌ శివనగర్‌లో స్థిరపడ్డారు. రఘునాథాచార్యులు 1926 మే 1న వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. తల్లి శేషమ్మ, తండ్రి శ్రీనివాస తాతాచార్యులు. హైదారాబాద్‌ సీతారాంభాగ్‌లోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శ్రీభాష్యాది శాస్త్ర విషయాలను అధ్యయనం చేశారు. వరంగల్‌లో సింహాద్రిబాగ్‌లోని వైదిక కళాశాలలో ప్రధానాచార్యులుగాను, ఆ తర్వాత విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో ఉపన్యాసకులుగాను పనిచేసి రిటైరయ్యారు. బాల్యంలోనే కాంచీపుర పీఠాధిపతి ప్రతివాది భయంకర అణ్ణంగాచార్య స్వామివారితో మధిరేక్షణ శబ్దార్ధ విషయంలో వివాదపడి ప్రసిద్ధులయ్యారు. పలువురు జీయర్‌ స్వాములకు మార్గనిర్దేశనం చేశారు. చినజీయర్‌ స్వామికి సాక్షాత్తు గురువు. అలాగే శ్రీవైష్ణవ పీఠాధిపతుల్లో చాలామంది ఆయన శిష్యులే!! చినజీయర్‌కు తర్కశాస్త్రం, సంస్కృతం బోధించారు. రఘునాథాచార్యులు వరంగల్‌లో సంస్కృత విజ్ఞానవర్థినీ పరిషత్‌, సంప్రదాయ పరిరక్షణ సభ, భగవత్‌ కైంకర్య నిధి సంస్థలను స్ధాపించి నడుపుతున్నారు.
 
రాష్ట్రంలోని జీర్ణదేవాలయోద్ధరణ కార్యక్రమాలను చేపట్టి కొన్ని దేవాలయాలను పునఃప్రతిష్ఠగావించారు. హన్మకొండలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, కృష్ణాజిల్లా మోటూరులోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం వీటిలో ఉన్నాయి. తన ఇంట్లోనే వేదపాఠశాలను ఏర్పాటు చేసి చాలా సంవత్సరాల పాటు నిర్వహించారు. ఈ శ్రీపాంచరాత్ర ఆగమ పాఠశాల ద్వారా అనేక మంది విద్యార్ధులను తీర్చిదిద్దారు. పదేళ్లుగా శాస్త్ర సంప్రదాయ, సాహిత్య సేవా రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు ప్రముఖులకు ఏటా శ్రీరఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. రఘునాథాచార్యులు బహుగ్రంథకర్త. వివిధ అంశాలపై 90కిపైగా గ్రంథాలను రచించి ముద్రింపజేశారు. సంస్కృత విజ్ఞానవర్ధిని పరిషత్‌ను స్థాపించి దీని ద్వారా ఆరు గ్రంథాలను ప్రచురించారు. సత్సంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మరో 54 గ్రంథాలను ముద్రించారు. భగవత్‌ కైంకర్యనిధి పేరుతో ధార్మిక సంస్థను నెలకొల్పి 28 శ్రీమద్రామాయణ క్రతువులను నిర్వహించారు. రఘునాథాచార్యులు చేసిన సాహితీ కృషికి, వేదాధ్యయనానికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వరించాయి. రఘునాథాచార్యుల అంత్యక్రియలు శివనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలోని శ్మశానవాటికలో జరిగాయి. మనుమడు శ్రీనివాసాచార్య ఆయన చితికి నిప్పంటించారు. అంతకు ముందు శివనగర్‌లోని ఆయన నివాస గృహం నుంచి ఎస్‌ఆర్‌ఆర్‌ తోట వరకు సాగిన అంతిమయాత్రలో శిష్యులు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
 
అనేక గ్రంథాల రచయిత
వేద సామ్రాజ్యం, సత్సంప్రదాయ సుధ, తత్వోపహారం, శ్రీరంగపతి స్తుతి, క్షమాషోడషి (తెలుగు వివరణ), ఈశాన్యోపనిషత్‌, విశిష్టాద్వైతము (తెలుగు-సంస్కృతం), శ్రీమాలికాస్తుతి, సంప్రదాయసుధాసారం, గోదాపురేశ మహత్యం (తెలుగు అనువాదం), శ్రీ వైష్ణవ సౌభాగ్యము, అమృతవర్షిణి, భక్త రసాయనము, బుధరంజని (రెండు భాగాలు), గౌతమధర్మ సూత్రము, వైౖష్ణవ సంప్రదాయ సౌరభము, లక్ష్మీస్తుతి మంజరి (సంస్కృత వ్యాఖ్య), శ్రీ వరవరముని వైభవస్తుతి, శ్రీ విష్ణుసహస్రనామభాష్యమ్‌, ముండకోపనిషత్‌, కఠోపనిషత్‌, కేనోపనిషత్‌ (తెలుగు వ్యాఖ్యానం), ఉత్తర రామచరిత్ర, శ్రీకుమార తాతాచార్య వ్యాఖ్య.
 
ఉభయ వేదాంతాచార్య
విద్య, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో రఘునాథాచార్యుల కృషికి 1972లో రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు; త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ జీయర్‌ స్వామి నుంచి 1970లో ఉభయ వేదాంతాచార్య బిరుదు; కవిశాబ్దిక కేసరి (మద్రాసు) పురస్కారం; 1997లో గోపాలోపాయన ప్రథమ పురస్కారం; తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి మహామహోపాధ్యాయ పురస్కారం; తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌; కరీంనగర్‌ సర్వవైదిక సంస్థానం నుంచి శాస్త్రరత్నాకర బిరుదు; విజయవాడలో 2006లో గజారోహణము, బ్రహ్మరథం, కనకాభిషేకం; అమెరికాలోని ఆజో- విభొ ఫౌండేషన్‌ నుంచి కందాళం విశిష్ట పురస్కారం.
 
సీఎం కేసీఆర్‌ సంతాపం
రఘునాథాచార్యుల మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ‘‘ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్దిక కేసరి, మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా, సంప్రదాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్‌ స్వాములతోపాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యుల వారు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలు కృషి చేశారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనిషి రఘునాథాచార్య స్వామి.’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.
 
జీయర్‌ స్వామినే విభేదించారు
‘‘నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యులు ఒక సందర్భంలో చినజీయర్‌ స్వామినే విభేదించారు. స్వామివారి నిర్వహణలోని భక్తి నివేదన ఆధ్యాత్మిక మాసపత్రికలో ఏకాదశిరోజున శ్రాద్ధ ప్రయోగం చేయవచ్చుననడాన్ని ఆచార్యులు విభేదించారు. ఎందుకు చేయరాదో సవివరంగా మరో పత్రికలో ఆచార్యులు ఇచ్చిన వివరణను చదివిన జీయర్‌ స్వామి పొరపాటును అంగీకరిస్తూ లేఖ రాశారు. తాను రాసిన కాకతీయ విశ్వవిద్యాలయం పాఠ్య పుస్తకంలోని ఒక అంశంపై ఓ లెక్చరర్‌ చేసిన వ్యాఖ్యకు ఆచార్యులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దాంతో కేయూ వీసీ స్వయంగా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పారు. సంస్కృతంపై ఆయనకు అంత సాధికారత.’’
- అమరవాది పురుషోత్తమచార్యులు, శ్రీ వైష్ణవ సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు
 
తర్కశాస్త్రంలో దిట్ట: డాక్టర్‌ కండ్లకుంట అళహ సింగరాచార్యులు
శ్రీ వైష్ణవ సంప్రదాయాలకు, విశిష్టాద్వైత వ్యాప్తికి నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యుల మృతి తీరని లోటు అని డాక్టర్‌ కండ్లకుంట అళహ సింగరాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాకరణ, వేదాంతం, తర్క శాస్త్రంలో ఆయన నిష్ణాతులని, తెలంగాణ సాంస్కృతిక పండితుల్లో గొప్పవారని కొనియాడారు. ‘‘రఘునాథాచార్యులతో నాకు 20ఏళ్లుగా దగ్గరి పరిచయం ఉంది. ఆయా అంశాలపై ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. నేను రాసిన గోదా రంగనాథ సుప్రభాతం పుస్తకంపై విశ్లేషణ చేసి సలహాలు అందించారు. రఘునాథాచార్యులు రాసిన శ్రీభాష్యం, శ్రీరఘునాథ సూక్తిమంజరి, సత్యమేవ జయతే పుస్తకాలు చదివాను. సంప్రదాయం, పాండిత్యంపై ఆయన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉండేది’’ అని గుర్తుచేసుకున్నారు. భగవన్‌ రామానుజాచార్యులు సూచించిన విశిష్టాద్వైతవ్యాప్తి కోసం ఆయన ఎనలేని కృషి చేశారని సింగరాచార్యులు చెప్పారు.
 
వారు తిరుమల వంశీయులు
‘‘ఆచార్యులవారు నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యులుగానే సుపరిచితులు. నిజానికి వారి ఇంటిపేరు తిరుమల నల్లాన్‌ చక్రవర్తుల. చాలామందికి తెలియని విషయమేమిటంటే ఆయన తిరుమల వంశీయులు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆరగింపు చేసే మొదటి పడి స్వీకరించేది ఆచార్యుల వంశీయులే! తిరుమల పరిరక్షణకు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చేపట్టిన ఉద్యమంలో రఘునాథాచార్యులు కీలక భూమిక పోషించారు. దేశవ్యాప్తంగా 42 మంది పీఠాధిపతులను ఏకీకృతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది’’
-సౌమిత్రి లక్ష్మణాచార్యులు