Oct 8 2018 @ 09:45AM

తెలుగుదేశం కంచుకోటలో కారు దూకుడు

  • రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వర్ధన్నపేటకే సొంతం
  • మూడుసార్లు టీడీపీ, కాంగ్రెస్‌కు పట్టం
  • రెండుసార్లు బీజేపీ, పీడీఎఫ్‌, స్వతంత్రుల గెలుపు
  • పునర్విభజన దెబ్బకు ఉద్దండుల వలస
 
వరంగల్‌ రూరల్‌: వర్ధన్నపేట నియోజకవర్గమంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన దెబ్బకు సైలెంట్‌ కావాల్సి వచ్చింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఉద్దండులు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక్కడి నుంచే చాలా మంది కీలక వ్యక్తులుగా రాజకీయాల్లో ఉన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. రాజకీయాల్లో కీలకంగా మారారు.
 
బీజేపీ సైతం రెండు పర్యాయాలు వర్ధన్నపేట నుంచి గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా మూడుసార్లు ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గం ఆరంభంలో పీడీఎఫ్‌ సైతం రెండుసార్లు గెలుపొందాయి. రాజకీయ పార్టీలకు చెందిన వారే కాకుండా స్వత్రంతులు సైతం రెండుసార్లు గెలుపొంది సత్తా చాటిన చరిత్ర వర్ధన్నపేటది. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరఫున ఇప్పటి కాంగ్రెస్‌ పార్టీ నేత తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు 1972లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బుచ్చయ్యపై గెలుపొందారు. అంతకుముందు 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు సమీప కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పి.ఉమారెడ్డిపై గెలుపొందారు. 
 
స్వతంత్రుల పరిస్థితి ఇలా ఉంటే... జనతా పార్టీ సైతం వర్ధన్నపేట నుంచి ఒకసారి గెలుపొందింది. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున మాచర్ల జగన్నాథం పోటీ చేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి టి. పురుషోత్తమరావుపై గెలుపొంది రికార్డు సృష్టించారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. తొలిసారిగా ఎస్సీ రిజర్వ్‌డ్‌ కోటాలో కాంగ్రెస్‌ పార్టీ తరఫనున బరిలో దిగిన కొండేటి శ్రీధర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయరామారావుపై గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగురవేసింది. ఇలా అన్నీ పార్టీలనూ ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించారు.
 
టీడీపీ హ్యాట్రిక్‌
వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలో వరుసగా మూడుసార్లు టీడీపీ గెలుపొందింది. పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 1994లో టీడీపీ తరఫున పోటీ చేసిన సమీప కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావుపై తొలిసారిగా గెలుపొందారు. టీడీపీ ఖాతాను దయాకర్‌రావు వర్ధన్నపేటలో తెరిచారు. 1999లో జరిగిన ఎన్నికల్లో సైతం ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణపై గెలుపొంది రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో సైతం ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై గెలుపొందారు. హ్యాట్రిక్‌ సాధించి రికార్డు సృష్టించారు.
 
ఆది నుంచి కాంగ్రెస్‌ పోరాటమే..
వర్ధన్నపేట నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ దీన్ని హస్తగతం చేసుకునేందుకు తీవ్రంగా పోరాటం చేసింది. వర్ధన్నపేటలో 15 సార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు గెలుపొందింది. ఇదిలా ఉంటే 10 సార్లు పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సి.రావు 1952లో పీడీఎఫ్‌ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో ఓటమి చెందారు. 1952-57లో జరిగిన ఉప ఎన్నికలో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి జేకే రావు, పీడీఎఫ్‌ అభ్యర్థి ఎ.ఎల్‌.ఎన్‌. రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
 
తొలిసారిగా 1957లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇ.వి. రామనర్సయ్య స్వతంత్ర అభ్యర్థి కె. కాశీనాథంపై గెలుపొంది కాంగ్రెస్‌ జెండాను ఎగురవేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పి.ఆర్‌.రావు స్వతంత్ర అభ్యర్థి కె. లక్ష్మీనర్సింహారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 1967లో ఉమారెడ్డి, 1972లో ఎ. బుచ్చయ్య, 1972, 78లో పురుషోత్తమరావు ఓటమి చెందారు. కాంగ్రెస్‌ పార్టీ తొలిసారి గెలుపొందిన అనంతరం 26 ఏళ్లకు మరోసారి 1983లో జరిగిన ఎన్నికల్లో మాచర్ల జగన్నాథం కాంగ్రె్‌స(ఐ) పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు వరుసగా ఓటమి చెందుతూ వచ్చారు. 1999లో సైతం ఎర్రబెల్లి స్వర్ణ టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో మరోసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కొండేడి శ్రీధర్‌ గెలుపొందారు. ఇలా మూడోసారి కాంగ్రెస్‌ పార్టీ వర్ధన్నపేటను హస్తగతం చేసుకుంది.
 
తొలిసారి గులాబీ భారీ మెజారిటీ
టీఆర్‌ఎస్‌ 2009లో పోటీ చేసి ఓటమిని చవిచూసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా గులాబీ జెండా వర్ధన్నపేటలో ఎగిరింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని జఫర్‌గఢ్‌కు చెందిన అరూరి రమేశ్‌ వర్ధన్నపేట నుంచి పోటీ చేసి 86వేల భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా కితాబు అందుకున్నాడు.
 
కమలం రెపరెపలు
వర్ధన్నపేటలో కాంగ్రెస్‌, టీడీపీతో పాటుగా జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ సైతం రెండుసార్లు ఎమ్మెల్యే పదవిని అలకరించింది. 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థి మాచర్ల జగన్నాథానికి బీజేపీ తరఫున బరిలోకి దిగిన వన్నాల శ్రీరాములు గట్టి పోటీనిచ్చారు. అనంతరం 1985లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ గెలుపొందింది. కమలం పార్టీ తరఫున వన్నాల శ్రీరాములు పోటీ చేసి ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావుపై తొలిసారి గెలుపొంది బీజేపీ జెండాను ఎగురవేసింది. 1989లో జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావుపై గెలుపొంది వరుసగా రెండోసారి బీజేపీ కైవసం చేసుకుంది.
 
రిజర్వ్‌డ్‌తో వలస
వర్ధన్నపేట నియోజకవర్గం 2009లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయ్యింది. దీంతో రాజకీయాల్లో కీలక నేతలకు వలస తప్పలేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ అప్పటి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోస్థానానికి మారాల్సి వచ్చింది. పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లి అక్కడి నుంచి గెలుపొంది ఆ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇక కాంగ్రెస్‌ సనియర్‌ నేత ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్‌ నగరంలోని పశ్చిమ నియోజకవర్గానికి వలస వెళ్లక తప్పలేదు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు సైతం వరంగల్‌ నగరానికి మారారు. టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సైతం జనగామకు వెళ్లారు. ఇదిలా ఉంటే రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌లో మరో నియోజకవర్గం నుంచి వర్ధన్నపేటకు వలస వచ్చిన అరూరి రమేశ్‌ గెలుపొందాడు.