Oct 7 2018 @ 23:42PM

అరచేతిలో కలియుగ వైకుంఠం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన సమస్త సమాచారాన్నీ స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకొనే అపురూపమైన అవకాశం శ్రీవారి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. తిరుమలలో సందర్శనీయ స్థలాల మ్యాపింగ్‌, నేవిగేషన్‌లతో భక్తులకు కావలసిన వివరాలను నిజసమయంలో అందించే యాప్‌ను ‘శ్రీసిస్‌’ అనే సంస్థ అందిస్తోంది. శ్రీవారి ఆలయం, అతిథి గృహాలు, వసతి సదుపాయాలు, అన్న ప్రసాద కేంద్రాలు ఎక్కడున్నాయో ఈ యాప్‌ యూజర్లు సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, అత్యవసర సేవల కేంద్రాలు, ఔషధ దుకాణాలు, బస్టాప్‌లు, ఫంక్షన్‌ హాల్స్‌ తదితరాల వివరాలు కూడా దీనిలో కనిపిస్తాయి. నేవ్‌టిటిడి (ఎన్‌ఎవిటిటిడి) పేరిట ఈ యాప్‌ ఇటీవలే విడుదలయింది.
 
బ్రహ్మోత్సవాల వేళ...
ముందుగా ప్రణాళిక వేసుకోవడానికీ, తిరుమలలో నిర్వహించే వివిధ సేవలు, కార్యక్రమాల వివరాలను తెలుసుకొని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడానికీ ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. తిరుమలలోని సౌకర్యాలను వినియోగించుకోవడం, హోటళ్ళలో రిజర్వేషన్‌, ఇన్‌-యాప్‌ కాలింగ్‌, మేసేజింగ్‌, ఇన్‌స్టంట్‌ నోటిఫికేషన్లు, అలర్ట్స్‌, భద్రతకు సంబంధించిన సూచనలు లాంటి ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్‌సినాటి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న శ్రీసిస్‌ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయి. శ్రీవారి భక్తులు సమయం వృఽథా కాకుండా, శ్రమ లేకుండా తిరుమల వివరాలను ఈ యాప్‌ ద్వారా పొందవచ్చు. ఈ నెల పదోతేదీ నుంచి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, భక్తులకు ఈ యాప్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. పీజియన్‌ ఐపిఐఎన్‌ ప్లాట్‌ఫారమ్‌ మీద రూపొందిన ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.