Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 18 Sep 2018 03:17:59 IST

చల్లబడిన ‘తాడిపత్రి’

చల్లబడిన తాడిపత్రి

  • ఎస్పీ, కలెక్టర్‌ల చొరవ, చర్చలతో సుఖాంతమైన ‘నిమజ్జన’ వివాదం
  • స్వస్థలాలకు ప్రబోధానంద శిష్యులు
  • నిరసన విరమించుకొన్న ఎంపీ జేసీ
  • ఎవరినీ వదలొద్దు : సీఎం ఆదేశం
తాడిపత్రి, అమరావతి, సెప్టెంబరు 17: రెండు రోజులుగా రగులుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం..సోమవారం ఎట్టకేలకు చల్లబడింది. నాలుగు జిల్లాల ఎస్పీలు, ఆక్టోపస్‌ బలగాల మోహరింపుతో వివాద కేంద్రం ప్రబోధానంత ఆశ్రమం వద్ద ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఏ క్షణాన్నైనా ఆక్టోపస్‌ దళాలు ఆశ్రయంలోకి చొచ్చుకుపోవచ్చునన్న ఉద్రిక్తత మధ్యాహ్నం దాకా కొనసాగింది. అయి తే, అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వీరపాండ్యన్‌ ఆశ్రమంలోకి ప్రవేశించి జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో ఇటు ఆశ్రమంలోని శిష్యులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి అంగీకరించగా, అటు ఇదే అంశంపై పోలీ్‌సస్టేషన్‌లో నిరసన తెలుపుతున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన ఆందోళనను విరమించారు. ప్రబోధానంద ఆశ్రమంలోని శిష్యులను అధికారులు బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న జేసీ.. 24 గంటలుగా సాగిస్తున్న తన నిరసనను విరమించారు. శిష్యుల తరలింపు సమయంలో ఘర్షణలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఓ డీఐజీ, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ముందు జాగ్రత్తగా నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను అమరావతి నుంచి రప్పించారు. ఇంకోవైపు నుంచి అనంతపురం జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారిద్దరినే తమ ఆశ్రమంలోకి నిర్వాహకులు అనుమతించారు. బయటనుంచి వైద్యులను రప్పిం చి, ఆదివారం నాటి ఘర్షణల్లో గాయపడిన శిష్యులకు వైద్యచికిత్స అందించారు. న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్‌, ఎస్పీలు స్పష్టమైన హామీ ఇచ్చారు. సేఫ్‌ ప్యాకేజీ ఇవ్వడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు శిష్యులు అంగీకరించారు. స్థానికంగా ఆధార్‌కార్డు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరినీ తరలించారు. నిర్వాహకులతో పాటు 50 మందినే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతించారు.
 
శాంతి చెదరొద్దు: సీఎం
తాడిపత్రి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై సోమవారం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ‘‘వృద్ధిబాటలోకి వచ్చిన అనంతపురం జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఈ జిల్లా ప్రతిష్టకు మచ్చ తెచ్చే పరిస్ధితి రాకూడదు. తప్పు ఎవరు చేసినా కఠినంగా ఉండండి. సమయ స్ఫూర్తితో వ్యవహరించండి. ఆవేశ కావేశాలు ఉంటాయి. వాటిని ఓపికతో పరిష్కరించండి. శాంతి చెదరొద్దు’’ అని అధికారులకు స్పష్టం చేశారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.