Aug 19 2018 @ 03:38AM

పర్యాటక ‘ఫార్ములా’...!

  • ఎఫ్‌1హెచ్‌2వో విజయవంతానికి సన్నాహాలు..
  • యువతలో క్రేజ్‌ పెంచడమే లక్ష్యం
  • వర్సిటీలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు
  • ఇంజనీరింగ్‌ విద్యార్థులే టార్గెట్‌
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఒంపులు తిరిగిన రోడ్లపై గంటకు 300కిలోమీటర్ల పైగా వేగంతో రయ్‌ రయ్‌మని దూసుకెళ్తుంటే భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అందుకే వేగానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఫార్ములా-1 రేసులంటే క్రీడాభిమానులు పిచ్చెక్కిపోతారు. వేగం వల్లే ఫార్ములా-1కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. అందుకే వాటర్‌ స్పోర్ట్స్‌లోనూ ఈ ‘ఫార్ములా’నే క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. ఫార్ములా-1 గ్రాండ్‌ప్రీ మాదిరిగానే... ‘ఎఫ్‌1హెచ్‌2వో’ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ‘ఎఫ్‌1హెచ్‌2వో’ అంటే బోట్‌ రేస్‌ అన్నమాట. నీటిపై నిర్వహిస్తారు. యూనియన్‌ ఇంటర్నేషనల్‌ మోటర్‌ ఎంటిక్యూ(యూఐఎం) వీటిని నిర్వహిస్తుంది. ఎంతో ప్రాచుర్యం ఉన్న ఈ క్రేజీ స్పోర్ట్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్వహించేందుకు యూఐఎం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలకు ఏడు దేశాలు ఆతిథ్యం ఇస్తుండగా వాటిలో భారత్‌కు తొలిసారిగా అవకాశం దక్కింది. ఆ చాన్స్‌ కూడా ఏపీకి దక్కడం విశేషం. ఈ చాంపియన్‌షి్‌పలో భాగంగా పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రీ, లండన్‌ గ్రాండ్‌ప్రీ, ఫ్రాన్స్‌ గ్రాండ్‌ప్రీ పూర్తయ్యాయి. చైనా గ్రాండ్‌ప్రీ సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరుగుతుంది. ఆ తర్వాత అమరావతి వేదికగా ఇండియన్‌ గ్రాండ్‌ప్రీ నవంబరు 17, 18 తేదీల్లో జరుగనుంది. విజయవాడ భవానీ ఐల్యాండ్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఐల్యాండ్‌ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో వాటర్‌ స్టోరేజీ ఉండటం కలిసొచ్చింది. ఈ నీటిపై పవర్‌ బోట్లు నిమిషాల వ్యవధిలోనే దూసుకెళ్తాయి.
 
ఆఫర్లు... అవగాహన సదస్సులు...
ఎఫ్‌1హెచ్‌2వోను విజయవంతం చేసేందుకు పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఏపీకి రప్పించేలా అనేక ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు స్థానికంగా ఉన్న యువతను ఆకర్షించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు వర్సిటీలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు ప్రారంభించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులే టార్గెట్‌గా ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు.
 
ఇదే మంచి చాన్స్‌...
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... పైగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కావడంతో ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఏపీ భావిస్తోంది. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ఈ పోటీల నిమిత్తం విదేశీ పర్యాటకులు ఇక్కడికొస్తారు. కాబట్టి పర్యాటక శాఖ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఈ చాంపియన్‌షి్‌పను అమరావతిలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ఆయన పిలుపు మేరకే యూఐఎం ఇండియన్‌ గ్రాండ్‌ప్రీని ఇక్కడ నిర్వహించేందుకు అంగీకరించింది. పోటీల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం పర్యాటక శాఖ చేతుల్లో పెట్టింది. పర్యాటకశాఖ ఎండీ హిమాన్షు శుక్లా ఇప్పటికే యూఐఎంతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎఫ్‌1హెచ్‌2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పను నిర్వహిస్తూనే.. మరోవైపు అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను చాటేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు రచిస్తోంది.
గంటకు 266 కిలోమీటర్ల వేగం..
వేగం అంటే ఫార్ములా1 కారుదే. గంటకు 375కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దీనిలాగే ఈ ఎఫ్‌1హెచ్‌2వో రేస్‌ బోట్‌ కూడా నీటిపై రయ్‌మంటూ దూసుకెళ్లగలదు. 2సెకన్ల వ్యవధిలోనే 100కి.మీ. వేగాన్ని అందుకునే ఈ పవర్‌ బోట్లు గంటకు 266కి.మీ వేగంతో ప్రయాణించగలవు. దీని బరువు సుమారు 455కిలోలు ఉంటుంది.