Aug 19 2018 @ 02:57AM

వేదగిరి రాంబాబు కన్నుమూత

  • అనారోగ్యంతో అంతిమశ్వాస
  • పుంఖానుపుంఖాలుగా కథలు రాసిన రచయిత
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, కథకుడు, జర్నలిస్టు వేదగిరి రాంబాబు అనారోగ్యంతో శనివారం రాత్రి మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాగ్‌లింగంపల్లిలో ఉన్న స్వగృహంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్ధం ఉంచనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన రాంబాబుకు నాటకాలు, సినిమాల్లో నటించాలని కోరిక. అయితే- 1974లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన... యర్రంశెట్టి శాయిని స్ఫూర్తిగా తీసుకొని రచయితగా ఎదిగారు. కొద్దికాలం యువ, జ్యోతి, స్వాతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. కథానికలపై చిన్న చూపు చూసే వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
 
ఆయన అనేక కథా సంకలనాలను వెలువరించారు. ‘వేదగిరి రాంబాబు కథానికలు’ ‘పేచీ కథలు’, ‘గిడుగు-పిడుగు’, ‘కాటూరి రవీంద్ర త్రివిక్రమ్‌ కథానికలు’, ‘కాలాన్ని జయించిన గురజాడ, ‘ఈ కాలం కథలు’, ‘బుచ్చిబాబు జీవితం-సర్వస్వం’, గురజాడ శత వర్ధంతికి నివాళిగా ‘తప్పక చదవాల్సిన వంద కథానికలు’ మొదలైన పుస్తకాలను వేదగిరి కమ్యూనికేషన్స్‌ పేరిట సొంతంగా ప్రచురించి ప్రచారంలోకి తెచ్చారు. రాంబాబు కథలు అనేకం రేడియోలో ప్రసారమయ్యాయి. ఆయన రూపొందించిన ‘పాపం పసివాడు’ సీరియల్‌ 52 వారాలపాటు ప్రసారమయ్యింది. రాంబాబు తీసిన టెలీఫిలిమ్‌కు రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ నంది అవార్డు దక్కింది. తెలుగు సాహిత్యానికి రాంబాబు చేసిన సేవ అమూల్యమైనదని సాహితీవేత్తలంటారు. ముఖ్యంగా గురజాడ అప్పారావును ఆయన దేవుడిగా భావించేవారు. తన ఇంట్లో దేవుడి పటాల మధ్య గురజాడ ఫోటో కూడా పెట్టి ఆరాధించేవారు.
 
విజయనగరంలో గురజాడ ఇంటికి మరమ్మతులు చేసి- ఆయన వారసుల ఆర్థిక కష్టాలు తీర్చిన వ్యక్తి ఆయన. గురజాడ 150వ జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన దశలో ఆయన పూనుకుని స్వయంగా ప్రతీ జిల్లాలో రచయితల సమావేశాలు, సాహిత్య పోటీలు నిర్వహించారు. అదే తరహాలో గిడుగు రామ్మూర్తి పంతులుకు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి ఘనంగా నివాళులర్పించి ఉత్సవాలు జరిపించి విగ్రహాలు నెలకొల్పారు. ఇవన్నీ ఆయన సొంత ఖర్చుతో చేయడం విశేషం.