desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 13 2018 @ 11:03AM

ఎడమ చేతివాటం ఉన్నవారికి ఈ విషయం తెలిస్తే షాకవుతారు !

  • ఎడమ చేతివాటం ఎంతో ప్రత్యేకం
  • జనాభాలో 10 నుంచి 12 శాతం మంది
  • ప్రముఖుల్లో ఎందరో లెఫ్ట్‌ హ్యాండర్స్‌
  • వీరిలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని అంచనా
  • ప్రజ్ఞావంతులై చరిత్ర సృష్టిస్తారట
  • నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే
చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.
 
ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘కుడి’ పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడికాలు పెట్టు...అన్నమాటలు తరచూ వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్లు, చేతులు. ప్రయాణానికి కాళ్లు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతివాటం, ఎడమ చేతివాటం వారని రెండు రకాలు. చేసేపని ఒక్కటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90 శాతం మంది కుడిచేతితోనే ఏదైనా పనిచేస్తారు. మిగిలిన పది శాతం ఎడమచేతివాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమ చేతివాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బి న అలవాటు. కొందరు పిల్లలు అన్నిపనులు ఎడమచేతితోనే చేస్తుంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడిచేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
నలభై ఏళ్ల తరువాత ఎవరికైనా పిల్లలు పుడితే సాధారణంగా వారు ఎడమచేతి వాటం వారై ఉంటారని చెబుతారు. బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు కారణంగా 75 శాతం ఎడమ చేతివాటం వస్తుందని, కొన్ని సర్వేల్లో తేలింది. జన్యువులు కారణంగా ఎడమ చేతివాటం రావడానికి 25 శాతం అవకాశం ఉంది. ఎడమచేతివాటం వారు గొప్ప అదృష్టవంతులవుతారని, ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని, గర్వించదగ్గ విజయాలు నమోదు చేస్తారని పలుసందర్భాల్లో నిరూపితమైంది. అందుకే ఎడమ చేతి వాటానికి అంత ప్రాముఖ్యం. నేడు లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
 
ఎప్పటి నుంచి
ఫ్రెండ్‌షిప్‌డే, మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వాలంటైన్‌ డేలా ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే) జరుపుతున్నారు. ఎడమచేతివాటం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1976 ఆగస్టు 13 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.

ఎందరో ప్రముఖులు
ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. రాణీలక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యాకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.
 
ఇవీ లక్షణాలు
కలలు కంటారు. వాటి సాకారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు.
స్వతంత్ర భావాలు, జ్ఞాపక శక్తి మెండు. నిత్యనూతనంగా (సృజనాత్మకత) ఆలోచనా విధానం వీరి సొంతం.
ఎంత ఒత్తిడినైనా తట్టుకునే గుణం వీరి సొంతం.
ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సత్తా ఉండడం వల్ల బహుళ లక్ష్యాల సాధనలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.
చిత్రాలు గీసేటప్పుడు అవి కుడివైపు అభిముఖంగా ఉంటేటట్టు గీస్తారు. ఎడమవైపు తిరిగి ఉన్న చిత్రాలు గీయడానికి చాలా కష్టపడతారు.
బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారు.
కుడిచేతివాటం వారి కోసం రూపొందించిన పరికరాల వినియోగం వల్ల ఏటా 2,500 మంది ఎడమ చేతివాటం వారు మృతి చెందుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
వీరికి అసహనం, కోపం తొందరంగా వస్తాయి.
కళ, భాష, సంగీత రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు. మొదడు, మనోవ్యాధులతో సతమతమవుతుంటారు.
 
ఇవీ వీరి ఇక్కట్లు
సనాతన హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యం, శుభకార్యం తలపెట్టినా కుడిచేతితోనే చేయాలి. ఎడమ చేతితో చేస్తే అపచారంగా, తీవ్ర అశుభంగా పరిగణిస్తారు. ఎడమ చేతితో పొరపాటున అపచారం చేస్తే ఇంట్లో పెద్దలతో అక్షింతలు తప్పవు. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో పెద్దలు, తల్లిదండ్రులు చీవాట్లు పెట్టినా రాయడం, ఇతర పనులు ఎడమ చేతితోనే చేస్తుంటారు.