Dec 9 2014 @ 02:01AM

ప్రముఖ సంపాదకుడు పిరాట్ల ఇక లేరు

హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌: కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన నారాయణగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 7.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లాలో జన్మించిన ఆయన సంఘసంస్కర్తగా, పాత్రికేయడిగా అవిరళ సేవలందించారు. ఆయన భార్య సూర్యకుమారి, ఏకైక కుమారుడు కృష్ణ కిశోర్‌ కూడా కృష్ణా పత్రికలో పనిచేస్తున్నారు. 1902లో ప్రారంభమైన కృష్ణా పత్రిక తెలుగు పత్రికారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. అయితే తదనంతర కాలంలో వివిధ సమస్యల కారణంగా మూతబడింది. 1983లో మూతపడిన పత్రికను వెంకటేశ్వర్లు పునరుద్ధరించారు.పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పత్రిక పూర్వవైభవానికి తనవంతు కృషి చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఏబీవీపీ తరఫున పోరాడారు. ఆనంతరం పత్రికా రంగంలో స్థిరపడ్డారు. తన జీవితకాలంలో వివిధ సమస్యలపై ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన రచించిన ‘రెడ్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా’ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. అంతేగాక వందేమాతరం, జై భారత్‌, మేధావులకు మత్తు మందుతోపాటు దాదాపు 20 పుస్తకాలను రచించారు. ఇందిరాగాంధీ సద్భావనా అవార్డుతోపాటు మరెన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. శేరిలింగంపల్లిలోని ఆదర్శనగర్‌కాలనీలో ఉన్న స్వగృహానికి వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని తరలించారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
రమణాచారి సంతాపం
పిరాట్ల మృతికి తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పిరాట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికూడా తమ సంతాపం తెలిపారు.