Jul 23 2018 @ 02:19AM

పీడిత ప్రజల గొంతుక దాశరథి

  • ఘనంగా మహాకవి జయంతి వేడుకలు
  • వజ్జల శివకుమార్‌కు దాశరథి పురస్కారం ప్రదానం
రవీంద్రభారతి/హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): దగాపడ్డ తెలంగాణ పీడిత ప్రజల గొంతుక దాశరథి అని వక్తలు అభివర్ణించారు. తన పద్యాలను పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన మహాకవి అని కొనియాడారు. మలిదశ ఉద్యమానికి దాశరథి దార్శనికుడని.. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితమిచ్చిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2018 సంవత్సరానికిగాను దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సీఎంవో ఓఎ్‌సడి దేశపతి శ్రీనివాస్‌ తదితరులు హాజరై వజ్జల శివకుమార్‌ను ఘనంగా సత్కరించి అభినందించారు.
 
ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్వామిగౌడ్‌ మాట్లాడుతూ దాశరథి పేరిట స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. నా తెలంగాణ కోటి రతనాలవీణ అంటూ ఆయనిచ్చిన నినాదాన్ని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రతిగోడపై రాసుకున్నామని గుర్తుచేశారు. దాశరథి పురస్కారగ్రహీత వజ్జల శివకుమార్‌ భావితరాలకు మరో దాశరథి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నిలిచిన గొప్ప వ్యక్తి దాశరథి అని.. కవిత్వం ఉన్నంత వరకు దాశరథి బతికే ఉంటారని నాయిని పేర్కొన్నారు.
 
అటు నిజాం, ఇటు ఆంధ్రా నాయకత్వాన్ని ఎదిరించిన మహోన్నత కవి దాశరథి అని నందిని సిధారెడ్డి కొనియాడారు. శత్రువుల చేతిలో దెబ్బలుతింటూ కూడా తన కవితాస్త్రాలను సంఽధించిన మహానుభావుడు దాశరథి అని దేశపతి పేర్కొన్నారు. పురస్కారగ్రహీత వజ్జల శివకుమార్‌ మాట్లాడుతూ దాశరథి లాంటి గొప్ప కవి పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని తనకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ వందన సమర్పణ చేశారు.